పల్లె ప్రగతి ఉత్తదేనా?

ABN , First Publish Date - 2022-05-19T05:06:34+05:30 IST

పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పట్టు తప్పుతోంది.

పల్లె ప్రగతి ఉత్తదేనా?
ఇంద్రవెల్లి మండలం లింగూడ పల్లె ప్రకృతి వనం

నామమాత్రంగానే నాలుగు విడతల పల్లె ప్రగతి కార్యక్రమం

అసంపూర్తిగానే దర్శనమిస్తున్న అభివృద్ధి పనులు

మైదానాలుగా మారిన పల్లె ప్రకృతి వనాలు

కొరవడుతున్న పర్యవేక్షణ.... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌లు

ఐదో విడత పల్లె ప్రగతికి సిద్ధమవుతున్న అధికారులు

ఆదిలాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పట్టు తప్పుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏదో హడావుడి చేయడం ఆ తర్వాత అంతా మరిచి పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పల్లె ప్రగతి మారుతోంది. గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామ ని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అంతా ఉత్తదేనన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమం కింద వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇది వరకు నాలుగు విడతల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించిన అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా శ్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాల్వల నిర్మాణం, తడి, పొడి చెత్తను వేరు చేయడం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర పనులను చేపట్టారు. బుధవారం పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించే 5వ విడత పల్లె, పట్టణ ప్రగతిపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి యేటా పల్లె ప్రగతి పనులకు కోట్లాది రూపాయలను వెచ్చించినా క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నా యి. పల్లెల్లో ప్రగతి పనులను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా నెల నెలా నిధులను మంజూరు చేస్తున్నా నిరుపయోగంగానే మారుతోంది. అలాగే పల్లె పాలనను గాడిలో పెట్టేందుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను నియమించి ప్రగ తి పనుల పర్యవేక్షణకు ప్రతీ గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయిలో పంచాయతీ అధికారులను ప్రభుత్వం నియమించిం ది. అయిన పాలనలో మార్పు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారి పోతోందనే విమర్శలు కూడా లేక పోలేదు. 

పడుతూ లేస్తున్న పనులు..

మూడేళ్లుగా పల్లె ప్రగతి కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి పడుతూ లేస్తున్న పనులతో ప్రజలు విసుగెత్తి పోతున్నారు. గ్రామ సర్పంచ్‌ పదవి కాలం దగ్గర పడుతున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదంటున్నారు. ఏదో ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో కొంత హడావుడి చేయడం, ఆ తర్వాత అంతా మరిచి పోతునట్లుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. పూర్తయిన చోట నాసిరకం పనులతో ఇప్పటికే నేలమట్టమయ్యాయి. డంపింగ్‌యార్డులను నిర్మించిన ఎక్కడ తడి పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ జరుగడం లేదు. కొన్ని చోట్ల డంపింగ్‌యార్డు పైకప్పులు లేచి పోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో డంపింగ్‌యార్డులకు తరలించకుండానే చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించి నిప్పంటిస్తున్నారు. అలాగే పల్లె ప్రకృతి వనాల చుట్టు కంచెను ఏర్పాటు చేయక పోవడంతో మొక్కలు కనిపించకుండానే పోతున్నాయి. 

చిత్తశుద్ధి ఏదీ..?

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం కింద గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లాలో అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో ప్రభుత్వ ఆదేశాలతో పనులు చేపట్టి వదిలేస్తున్నారే తప్ప నిరంతరంగా పర్యవేక్షణ లేక పోవడంతో అభివృద్ధి ప నులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ము ఖ్యంగా ప్రభుత్వం హరితహారం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్న క్షేత్ర స్థాయిలో మా త్రం నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2018 పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు జిల్లా ఉన్నతాధికారులు ఏ ఒ క్కరిపై వేటు వేసిన దాఖలాలు లేవు. పల్లెల్లో ప్రగతి పనులు మరి అధ్వానంగా కనిపిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. కొందరు ఎంపీడీవోలు, ఎంపీవోలు కార్యాలయాలకే పరిమితమవుతున్నట్లు తెలు స్తోంది. ఏ ఒక్కరు స్థానికంగా ఉండక పోవడంతో పల్లె ప్రగ తి పనుల పర్యవేక్షణ కరువవుతోంది. పంచాయతీ కార్యదర్శులు కూడా ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాల వైపు అయితే కొందరు కార్యదర్శు లు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. 

పేరుకే ప్రకృతి వనాలు..

పల్లె ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనికి గాను రూ.5లక్షల నుంచి రూ.11లక్షల వరకు నిధులను కూడా మంజూరు చేసింది. కానీ అధికారులు, సర్పంచ్‌లకు చిత్తశుద్ధి లేక పోవడంతో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నేలమట్టమై మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. అలాగే ప్రతి మండలంలో పది ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లె ప్రకతి వనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మండిపోతున్న ఎండలకు నాటిన మొక్కలు కనిపించకుండానే పోతున్నాయి. మొక్కల సంరక్షణకు ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌,నీటి ట్యాంకర్‌ను అందించిన నిరుపయోగంగానే మారుతోంది. మెజార్టీ గ్రామాల్లో నీటి ట్యాంకర్‌ ద్వారా మొక్కలకు నీళ్లందించిన దాఖలాలు కనిపించడం లేదు. పల్లె ప్రకృతి వనాల చుట్టూ కంచె లేక పోవడంతో పశువులు సంచరించి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రతి యేటా వానాకాలంలో పల్లె ప్రకృతి వనాల పేరిటా మొక్కలు నాటడం, వదిలేయడంతో కోట్ల రూ పాయల నిధులు నేలపాలవుతున్నాయి. అటయిన సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన కరువవుతుంది.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. 

- శ్రీనివాస్‌ (డీపీవో, ఆదిలాబాద్‌)

పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనులను చేపట్టి నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో పల్లె ప్రకృతి వనాలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌తో పాటు నీటి ట్యాంకర్‌ను అందజేశారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేయాలని మండల అధికారులను ఆదేశించాం. ఐదో విడత పల్లెప్రగతిని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలి.

Updated Date - 2022-05-19T05:06:34+05:30 IST