బ్రౌన్‌ రైస్‌ నుంచి తీసిన గంజి తాగితే సన్నగా అవుతామా?

ABN , First Publish Date - 2022-04-15T19:04:58+05:30 IST

నేను బరువు తగ్గేందుకు బ్రౌన్‌ రైస్‌ తింటున్నాను. బ్రౌన్‌ రైస్‌ నుంచి తీసిన గంజి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా?

బ్రౌన్‌ రైస్‌ నుంచి తీసిన గంజి తాగితే సన్నగా అవుతామా?

ఆంధ్రజ్యోతి(15-04-2022)

ప్రశ్న: నేను బరువు తగ్గేందుకు బ్రౌన్‌ రైస్‌ తింటున్నాను. బ్రౌన్‌ రైస్‌ నుంచి తీసిన గంజి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా?


- మెహెర్‌, వైజాగ్‌ 


డాక్టర్ సమాధానం: బరువు నియంత్రణలో ఉండాలంటే కెలోరీలను సరిచేసుకోవడం ముఖ్యం. ఎటువంటి శారీరక శ్రమా లేకుండా కేవలం విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా మన శరీరం కెలోరీలను ఖర్చు చేస్తుంది. వివిధ రకాల జీవక్రియలు జరిగేందుకు జరిగే ఈ కెలోరీల ఖర్చును ‘రెస్టింగ్‌ మెటబాలిక్‌ రేట్‌’ అంటారు. దీనికి మించి ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు ఇంకొన్ని కెలోరీలు ఖర్చవుతాయి. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు నిల్వలు తగ్గి మన బరువు తాగ్గాలంటే మనం ఆహారం ద్వారా తీసుకునే కెలోరీలకన్నా అధికంగా ఖర్చు పెట్టాలి. అలాగే, ఆహారం ద్వారా తీసుకునే కెలోరీలను పరిమితంగా ఉంచుకుంటే బరువు తగ్గడం సులభం. బ్రౌన్‌ రైస్‌లో కూడా తెల్ల బియ్యంలానే కెలొరీలు ఉంటాయి. కానీ బ్రౌన్‌ రైస్‌లో ఇంకొన్ని విటమిన్లు, పీచు పదార్థాలు కూడా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి మెరుగైనది. అందుకే ఏ బియ్యం తీసుకున్నా కెలోరీలు పరిమితికి లోబడి మితంగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. గంజిలో ఉండే పిండి పదార్థం త్వరగా గ్లూకోజుగా మారి శరీరంలోనికి శోషించుకోబడుతుంది. గంజిలో పీచు పదార్థం ఉండదు కాబట్టి వెంటనే ఆకలివేసే అవకాశం ఎక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకున్నప్పుడు ఏ బియ్యంనుంచైనా గంజిని తాగే బదులు ముడి ధాన్యాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరలు, ప్రోటీన్‌ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు మొదలైనవి సరైన పాళ్ళలో తీసుకుంటే  ప్రయోజనం ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-04-15T19:04:58+05:30 IST