మేఘాలయ కాంగ్రెస్‌లో ముసలం వెనుక ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2021-11-25T23:09:43+05:30 IST

మేఘాలయలో టీఎంసీ దూకుడు వెనుక ఎన్నికల ప్రచార వ్యూహకర్త

మేఘాలయ కాంగ్రెస్‌లో ముసలం వెనుక ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : మేఘాలయలో టీఎంసీ దూకుడు వెనుక ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నట్లు భావించవచ్చు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ సంగ్మా, ప్రశాంత్ కిశోర్ కోల్‌కతాలో సమావేశమైనప్పటి నుంచి దీనికి బీజం పడినట్లు చెప్పవచ్చు. సంగ్మా నేతృత్వంలో ఆయనతోపాటు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో బుధవారం రాత్రి చేరిన సంగతి తెలిసిందే. 


మేఘాలయలో కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో 12 మంది బుధవారం రాత్రి ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మెట్బా లింగ్డోకు ఓ లేఖ సమర్పించారు. తాము కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరినట్లు తెలిపారు. బీజేపీపై పోరాటంలో కలిసి వచ్చేవారిని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ స్వాగతించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వర్, జేడీయూ నేత పవన్ వర్మ మంగళవారం న్యూఢిల్లీలో మమత సమక్షంలో టీఎంసీలో చేరారు. 


ఈ నేపథ్యంలో ముకుల్ సంగ్మా గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తాను కోల్‌కతాలో ప్రశాంత్ కిశోర్‌తో గతంలో సమావేశమయ్యానని తెలిపారు. ప్రత్యేకతను చూపగలిగే మంచి స్నేహితుడు ప్రశాంత్ అని చెప్పారు. మేఘాలయ పీసీసీ అధ్యక్షునిగా విన్సెంట్ పాలాను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేయడంతో ఆ పార్టీలో ముసలం ప్రారంభమైందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సమతుల్యత ఉండాలన్నారు. మనకు సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ప్రస్తావించానని తెలిపారు. ఢిల్లీకి అనేకసార్లు వెళ్ళినప్పటికీ ఏమీ జరగలేదన్నారు. ప్రతిపక్షంగా నిలిచేందుకు తగిన ఇతర అవకాశాల గురించి అన్వేషిస్తున్నపుడు మంచి స్నేహితుడైన ప్రశాంత్ కిశోర్‌తో సమావేశమయ్యానని, ఆయన ప్రత్యేకతను కనబరచే వ్యక్తి అని అందరికీ తెలుసునని చెప్పారు. తాము మాట్లాడుకున్నపుడు ఒకే విషయాన్ని పంచుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. మిగిలిన అన్నిటికన్నా ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట అనే విషయాన్ని తాము పంచుకున్నామన్నారు. 


Updated Date - 2021-11-25T23:09:43+05:30 IST