Apr 17 2021 @ 11:46AM

'రాధే శ్యామ్'లో పూజా రోల్ ఇదేనట..?

జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వం యంగ్ రెబల్ స్టార్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'రాధే శ్యామ్'. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ - పూజా హెగ్డే... విక్రమాదిత్య - ప్రేరణ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా జూలై 30న  నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంతక ముందు 'రాధే శ్యామ్' మోషన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు సలీం - అనార్కలీ, లైలా - మజ్ఞు, దేవదాసు పార్వతీలను రివీల్ చేశాక విక్రమాదిత్య - ప్రేరణలను రివీల్ చేశారు. కంప్లీట్ యానిమేటెడ్ మోషన్ టీజర్ అయినప్పటికి థీమ్ ఏంటో హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్ర బృందం. అప్పటి నుంచే 'రాధే శ్యామ్' సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుందని అందరూ ఫిక్సైపోయారు. 

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ వచ్చి ఆసక్తికరంగా మారింది. 'రాధే శ్యామ్' సినిమాలో పూజా హెగ్డే రోల్ ఇదేనంటూ ప్రచారమవుతోంది. ప్రభాస్ పెద్ద కార్ల కంపెనీకి ఓనర్‌గా కనిపించబోతున్నాడట. ఇక పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ ప్రేరణగా నటిస్తుందని..తెలుస్తోంది. ప్రమాదం వల్ల వైద్యానికి హాస్పిటల్ లో పని చేసే పూజా దగ్గరికి ప్రభాస్ రావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం .. ప్రేమ మొదలవుతాయని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది అఫీషియల్‌గా తెలియనప్పటికి పాయింట్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారట. ఇక ప్రభాస్ వరసగా భారీ బడ్జెట్ సినిమాలను కమిటవుతున్న సంగతి తెలిసిందే. 'సలార్‌'తో పాటు 'ఆది పురుష్' ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి.