Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 15 May 2022 03:04:41 IST

కుంభకోణాలతో కడుపు నిండలేదా?

twitter-iconwatsapp-iconfb-icon
కుంభకోణాలతో కడుపు నిండలేదా?

 • ఇంకా అప్పులు ఎవరి కోసం అడుగుతున్నారు? 
 • కొడుకు కోసమా? కూతురి కోసమా?
 • ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
 • ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే..
 • కొనడం చేతకాకపోతే రాజీనామా చేయండి
 • బీజేపీ ప్రభుత్వం వచ్చి కొనుగోలు చేస్తుంది..
 • ముందస్తు కాదు.. ఎన్నికలు రేపైనా బీజేపీ సిద్ధం
 • కేసీఆర్‌ను గద్దె దించడానికి నేను అవసరం లేదు..
 • బండి సంజయ్‌ ఒక్కడు చాలు
 • తెలంగాణలో అధికారంలోకి వస్తాం..
 • డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని తెస్తాం
 • మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం..
 • నీళ్లు, నిధులు, నియామకాలు అందజేస్తాం
 • మంత్రాలు.. తంత్రాల సర్కారుతో మేలు జరగదు..
 • పథకాల పేర్ల మార్పు తప్ప చేసిందేమీ లేదు
 • తెలంగాణకు 8 ఏళ్లలో 2,52,202 కోట్లు ఇచ్చాం..
 • తుక్కుగూడ సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా


హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పులపాలు చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. తిరిగి ఇప్పుడు మరిన్ని అప్పులు కావాలని కోరుతున్నారని తెలిపారు. ‘‘ఎందుకోసం ఈ అప్పులు? కొడుకు, కూతురి కోసమా? ఇన్ని కుంభకోణాలకు పాల్పడినా.. ఇంకా మీ కడుపు నిండలేదా?’’ అని ప్రశ్నించారు. తాను 13 ఏళ్ల వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు తన వయసు 57 ఏళ్లు అని, కానీ.. ఇప్పటివరకు ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలడానికి తెలంగాణ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ (తుక్కుగూడ)లో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అమిత్‌షా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం కేంద్రం ధాన్యం కొనదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, చేతకాకపోతే రాజీనామా చేయాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రతి కిలో ధాన్యాన్నీ కొంటుందని చెప్పారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని, మతప్రాతిపదికన మైనారిటీలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించారు. కుటుంబ పాలనతో, అవినీతి ప్రభుత్వంతో, మంత్రాలు, తంత్రాలతో కొనసాగే ప్రభుత్వం వల్ల తెలంగాణకు మేలు జరగదన్నారు. ‘మీరెప్పుడూ సచివాలయానికి వెళ్లరు. అందులో అడుగు పెడితే అధికారం పోతుందని ఎవరో మాంత్రికుడు చెప్పారట. కానీ, నేను చెబుతున్నా.. మీ ప్రభుత్వం గద్దె దిగడానికి మాంత్రికుడు అక్కర్లేదు. తెలంగాణ ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకళిస్తారు’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అమిత్‌షా అన్నారు.

కుంభకోణాలతో కడుపు నిండలేదా?

మాపైనే ఆరోపణలు చేస్తారా?

‘‘కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావడానికి ముందు ధాన్యానికి మద్దతు ధర రూ.1340 ఉండేది. దీనిని రూ.1940 చేశాం. 11 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నాం. ధాన్యం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతారా? సజ్జలు, జొన్న, మొక్కజొన్న, రాగి, గోధుమలు, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి. మీకు కొనడానికి ఇష్టంలేక.. నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా? తెలంగాణ కోసం మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. మీరు మాత్రం మోదీ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడం తప్ప మరేమీ చేయలేదు. మోదీ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకాన్ని తెస్తే.. ఆ పథకాన్ని, కేంద్రం నిధులను తీసుకొని ‘మన ఊరు-మన బడి’ పేరుతో అమలు చేస్తున్నారు. మీ ఫొటో, మీ కొడుకు ఫొటో పెట్టి, పథకం పేరు మార్చి అమలు చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణతో స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తామన్నారు. చివరికి కొడుక్కి, కూతురికి అధికారాలిచ్చారు. కశ్మీర్‌ నుంచి ఆర్టికల్‌ 370ని ఎత్తివేశాం. మజ్లిస్‌ భయంతో ఈ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. మేము మజ్లి్‌సకు, మీకు(టీఆర్‌ఎ్‌సకు) భయపడం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ విముక్తి దినోత్సవం నిర్వహిస్తామని చెప్పి.. మజ్లి్‌సకు భయపడి నిర్వహించడం లేదు. టీఆర్‌ఎస్‌ గుర్తు అయిన కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉంది. బీజేపీ అధికారంలోకి రాగానే విముక్తి దినోత్సవం జరుపుతాం. నిజాం, రజాకార్ల అకృత్యాల నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర విముక్తిపొందిన రోజును విముక్తి దినంగా పాటిస్తాం. 


డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

ఫైవ్‌స్టార్‌ ఫాంహౌ్‌సలో కూర్చొని పథకం రచిస్తున్నావు. ముందస్తు ఎన్నికలకు వెళదామనుకుంటున్నావు. ముందస్తు కాదు కదా.. రేపు ఎన్నికలు పెట్టు. మీ ఓటమిని రాసిపెడుతున్నాం. తప్పక ఓడించి రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మోదీ ప్రభుత్వం దేశంలో అభివృద్ధిని నలుమూలలా వ్యాప్తి చేసింది. 8 ఏళ్లలోపే భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాం. కేంద్రంపై కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు. రూ.18 వేల కోట్లను ఉపాధి హామీ పథకానికి ఇస్తే.. ఆ నిధులతో హరితహారం కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఆ పథకానికి మీ పేరు, మీ కొడుకు ఫొటోలు అతికించారు. హరితహారం కార్యక్రమం కేంద్రానిదే. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరును మార్చినా.. ఇళ్లు ఇవ్వలేదు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్రంలో దాని అమలు లేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, ప్రధానమంత్రి మాతృవన్‌ యోజన, ప్రధానమంత్రి అన్నాకల్యాణ్‌ యోజనను ఆపేశారు. రెండేళ్లుగా ప్రతి కుటుంబానికీ 5 కిలోలు ఉచితంగా, మిగతా 5 కిలోలను రూ.2కు ఇస్తున్నాం. 


ఆ ప్రాజెక్టులతో కమీషన్లు రావడం లేదనే..

ప్రధానమంత్రి సింఛాయ్‌ యోజన కింద ఆర్డీఎస్‌, నెట్టెంపాడు పథకాలకు కేంద్రం నిధులిస్తుంటే.. ఆ పథకాలను అమలు చేయడం లేదు. వీటి వల్ల కమీషన్‌ రావడం లేదనే పక్కన పెట్టేశారు. హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీకి భూములు ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వడంలేదు. 2017 నుంచి వరంగల్‌లో సైనిక్‌ స్కూలు పెట్టడానికి భూములు ఇవ్వాలన్నా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికీ భృతి ఇస్తానని చెప్పారు.. రైతులకు రూ.లక్ష దాకా రుణాన్ని మాఫీ చేస్తామన్నారు.. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని, హైదరాబాద్‌ చుట్టూ నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు కడతామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టారా? ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను కూడా అమలు చేయలేదు. దళితులకు కేటాయిస్తామన్న రూ.50 వేల కోట్ల బడ్జెట్‌ ఎక్కడుంది? మూడెకరాల భూములు ఇస్తామన్నారు.. బీసీలకు ఏటా రూ.1000 కోట్లు ఇస్తామన్నారు.. రూ.100 కోట్లు అయినా ఇస్తే.. రేపటి ప్రెస్‌మీట్‌లో చెప్పాలి. 


బండి సంజయ్‌ ఒక్కడు చాలు..

కేసీఆర్‌ను అధికారం నుంచి తప్పించడానికి నేను అవసరం లేదు. బండి సంజయ్‌ ఒక్కడు చాలు. ప్రజా సంగ్రామ యాత్ర ఒక పార్టీని అధికారం నుంచి తొలగించి.. ఎవరినో సీఎంను చేయడానికి కాదు. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మహిళలకు మేలు చేయడానికి, హైదరాబాద్‌ నిజాంను, తెలంగాణ నిజాం మార్చడానికి చేసే యాత్ర ఇది. ఈ యాత్ర రజాకార్ల ఒడిలో కూర్చున్న వారికే వ్యతిరేకం. కుటుంబ పాలనకు వ్యతిరేకం. వేల కోట్ల అవినీతికి పాల్పడిన టీఆర్‌ఎ్‌సను కూకటివేళ్లతో పెకళించే యాత్ర ఇది. తెలంగాణ ఉద్యమ నినాదంగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలను సీఎం కేసీఆర్‌ విస్మరించారు. బీజేపీకి అధికారం ఇస్తే.. నీళ్లు, నిధులు, నియామకాలు అందేలా చేస్తాం. 


సాయిగణేశ్‌ హంతకులను వదలం..

పట్టపగలు మా కార్యకర్తలను చంపుతున్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను బెంగాల్‌లా మార్చాలనుకుంటున్నారు. మీరు దీనికి అంగీకారం తెలుపుతారా? బీజేపీ కార్యకర్తల భుజంపై చెయ్యేసి చెబుతున్నా.. సాయిగణేశ్‌ హంతకులను తప్పక శిక్షిస్తాం. జైల్లో పెడతాం. ఎప్పటిదాకా తప్పించుకుంటారు? ఇంకెన్నేళ్లు తప్పించుకుంటారు?’’ అని అమిత్‌షా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌, ఎంపీ ధర్మపురి అరవింద్‌, డీకే అరుణ, రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌, ఇంద్రాసేనారెడ్డి, పి.మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్‌, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ఎనిమిదేళ్లలో 2,52,202 కోట్లు ఇచ్చాం

 ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.2,52,202 కోట్లు ఇచ్చాం. ఈ లెక్కలన్నింటినీ ప్రజల ముందుంచాలి. రామగుండంలో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవును 5వేల కిలోమీటర్లను దాటించాం. నాలుగు లేన్ల ఫై ఓవర్‌కు రూ.127 కోట్లు ఇచ్చాం. రూ.8 వేల కోట్లను రీజనల్‌ రింగురోడ్డుకు ఇచ్చాం. ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద రూ.17 వేల కోట్లు ఇచ్చాం. రైల్వేలో రూ.2,200కోట్లు ఖర్చుం చేశాం. మిషన్‌ భగీరథ కోసం రూ.25 వేల కోట్లు ఇచ్చాం. - అమిత్‌ షా 


తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలకు సూచించారు. శనివారం తుక్కుగూడ సభ కన్నా ముందు శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంజయ్‌ పాదయాత్రకు స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం ఎక్కడున్నారని ప్రశ్నించగా.. పది రోజులుగా ఫాంహౌ్‌సలోనే ఉన్నారని పార్టీ నేతలు అమిత్‌షాకు తెలిపారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, వీలైతే గుజరాత్‌ ఎన్నికలతో పాటు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు కేసీఆర్‌కు ఓటేసే పరిస్థితి లేదని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలిసింది. కాగా, కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలను పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా ‘‘నా దాకా ఎందుకు తీసుకొస్తున్నారు? మీరే సరైన జవాబివ్వండి’’ అని సూచించారు. సంజయ పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని నేతలు షాకు వివరించారు. 


కుంభకోణాలతో కడుపు నిండలేదా?

రాష్ట్రాన్ని రాసిచ్చామా?- కిషన్‌రెడ్డి

తెలంగాణ ఎవరి జాగీరూ కాదని.. అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం దేశ పౌరులకు ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఉందని.. అలాగే అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని కొద్ది రోజులుగా అమిత్‌ షాపై టీఆర్‌ఎస్‌ నేతలు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం చెబుతాం. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబానికి రాసిచ్చామా? భారత హోం మంత్రి ఇక్కడకు రావాలంటే వారి అనుమతి తీసుకోవాలా? ఇదేమైనా నిజాం పాలనా?’’ అని ప్రశ్నించారు. ‘‘దేశ హోం మంత్రిగా, బీజేపీ కార్యకర్తగా అమిత్‌షా బరాబర్‌ హైదరాబాద్‌ వస్తారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేస్తున్న మేలును చెబుతారు. కేసీఆర్‌ పాలనను ఎండగడతారు. బీజేపీ జెండా ఎగరేస్తారు’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగకుండా, దానిని మార్చాలనే ఆలోచనను కేసీఆర్‌ పదేపదే చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. దళితబంధు ఎక్కడ ఉందని.. అది గులాబీ జెండా మధ్య తిరుగుతుందని విమర్శించారు. ఎస్టీ రిజర్వేషన్ల జాప్యానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు ఏమయ్యాయని నిలదీశారు. బీజేపీకి అధికారం ఇస్తే గిరిజన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.


కేసీఆర్‌కు ప్రజలు కనిపించట్లేదు: జితేందర్‌రెడ్డి 

కంటి వెలుగు పథకం అమలు కావడం లేదు. అందుకే కేసీఆర్‌కు ప్రజలు కనిపించడం లేదు. ప్రజలు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రాకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు న్యాయం చేయలేకపోయారు. కోట్ల విలువ చేసే భూములను లాక్కుంటున్నారు.


కుంభకోణాలతో కడుపు నిండలేదా?

లెక్క తేల్చుతాం: రాజాసింగ్‌

కేసీఆర్‌, కేటీఆర్‌ కమీషన్ల లెక్క తేల్చేందుకే అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానుంది. అసలు లెక్కలు అప్పుడు బయటకు తీస్తాం. పాతబస్తీ ప్రజలను అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌ మోసం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ నుంచి వారిద్దరినీ తరిమేసి అభివృద్ధి చేస్తాం.


టీఆర్‌ఎ్‌సకు కనువిప్పుగా అమిత్‌ షా సభ: గరికపాటి

అమిత్‌షా సభ టీఆర్‌ఎస్‌ పార్టీకి కనువిప్పు. ఎన్నడూ లేని విధంగా.. ఏ రాజకీయ పార్టీ నిర్వహించలేని విధంగా అమిత్‌ షా సభ సాగింది.  టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి అవకాశమివ్వండి.


నియంత పాలనకు అంతం పలకాలి: డీకే అరుణ

రాష్ట్రంలో నియంత పాలనకు అంతం పలకాలి. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్నాం. సీఎం హామీలు వినీవినీ విసుగుతో ప్రజలు మార్పుకోరుతున్నారు. బీజేపీదే అధికారమని తెలియడంతోనే తండ్రీ కొడుకులు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. 2 గంటలు ఎయిర్‌ పోర్టులోనే..

హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌ షాకు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తుక్కుగూడ బహిరంగ సభ తర్వాత ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాత్రి 8.30కి బయలుదేరాల్సిన షా.. 10:35 గంటలకు వెళ్లారు. బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానశ్రయంలో వీడ్కోలు పలికారు. వారి వెంట ప్రజాసంగ్రామ యాత్ర ప్రముఖ్‌ జి.మనోహర్‌రెడ్డి పలువురు నేతలు ఉన్నారు. వారు అమిత్‌ షాతో కలిసి డిన్నర్‌ చేశారు. 


చివరి రోజు బండి యాత్ర ఇలా..

బండి సంజయ్‌ నిర్వహించిన రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర శనివారం తుక్కుగూడలో ముగిసింది. చివరి రోజు ఆయన 1.5 కి.మీ పాదయాత్ర నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు తుక్కుగూడలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.