మాయావతి ఒంటరే?

ABN , First Publish Date - 2021-06-18T10:06:38+05:30 IST

వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మా యావతి ఒంటరి అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

మాయావతి ఒంటరే?

యూపీలో బీఎస్పీతో పొత్తుకు ప్రధాన పార్టీలు దూరం

(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి): వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మా యావతి ఒంటరి అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తనతో ఏ పార్టీ చేతులు కలిపేందుకు సిద్ధం కాకపోవడం, అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని స మాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) క్రమంగా బలం పుంజుకుంటుండడమే దీనికి కారణం. దీనివల్లే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌పీతో చేతులు కలిపి.. 10సీట్లు గెలుచుకున్న బీఎస్పీ.. ఆ తర్వాత 11 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3,050 జిల్లా పంచాయత్‌ సీట్లలోఎస్‌పీకి 782, బీజేపీకి 580 సీట్లు రాగా.. బీఎస్పీకి 336 సీట్లు లభించాయి. ఒక్క బుందేల్‌ ఖండ్‌ లో మాత్రమే మాయావతి అత్యధిక ప్రభా వం చూపగా.. మిగతా ప్రాంతాల్లో పెద్ద గా ఆకట్టులేకపోయారు. 


సమాన బలం నుంచి..

నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల వర కూ ఎస్‌పీ, బీఎస్పీ దాదాపు సమాన బలా న్ని ప్రదర్శించాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 312 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. ఎస్‌పీ, బీఎస్పీలకు దాదాపు 22 శా తం చొప్పున ఓట్లు వచ్చినప్పటికీ.. ఎస్‌పీకి 47 సీట్లు.. బీఎస్పీకి 19 సీట్లే లభించాయి. దీంతో ఇద్దరం చేతులు కలిపితే ఫలితం ఉండొచ్చన్న ఉద్దేశంతో.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. ఎస్‌పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ అయినప్పటికీ.. బీఎస్పీ ఓట్లు ఎస్‌పీ బదిలీ కాలేదని వివిధ సర్వేల్లో తేలింది. 


ఎవరూ నమ్మడం లేదు!

వివిధ సందర్భాల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ, కాంగ్రెస్‌, బీజేపీ సహా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న మాయావతిని ఈ ఎన్నికల్లో ఎవరూ విశ్వసించే అవకాశాలు కనపడడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 


మజ్లి్‌సతో పొత్తుతో బీజేపీకే లాభం..? 

ప్రధాన పార్టీలేవీ తనతో జట్టుకట్టేందుకు సిద్ధపడకపోవడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి మజ్లిస్‌ పార్టీ (ఎంఐఎం)తో పొత్తు పెట్టుకుని తన ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దానివల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి.. బీజేపీకే ఎక్కువ లాభం చేకూరుతుందని అంటున్నారు. ఈ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు సమాజ్‌వాది పార్టీ.. రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ), కాంగ్రెస్‌, సుహుల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, అంబేడ్కర్‌ సమాజ్‌ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. 



Updated Date - 2021-06-18T10:06:38+05:30 IST