మల్యాల పూర్తయ్యేనా ?

ABN , First Publish Date - 2022-05-14T05:19:21+05:30 IST

మల్యాల ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నందికొట్కూరు మండలంలోని నాగటూరు వద్ద గల మల్యాల ఎత్తిపోతల ఫేస్‌ 1, ఫేస్‌ 2 పథకాలను ప్రారంభించారు.

మల్యాల పూర్తయ్యేనా ?
ఎత్తిపోతలకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నిర్మించిన అప్రోచ్‌ కెనాల్‌

పదేళ్లయినా కొలిక్కిరాని రెండు దశల పనులు

పది వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యం

నీరందుతున్నది మాత్రం రెండు వేల ఎకరాలకే..

సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం


నందికొట్కూరు రూరల్‌, మే 13: మల్యాల ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నందికొట్కూరు మండలంలోని నాగటూరు వద్ద గల మల్యాల ఎత్తిపోతల ఫేస్‌ 1, ఫేస్‌ 2 పథకాలను ప్రారంభించారు. దాదాపు 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడం ఈ ఎత్తపోతల లక్ష్యం. 9 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరేలా ఫేస్‌ 1 పథకానికి రూ. 1,536 లక్షలు వెచ్చించారు. ఫేస్‌ 2 పథకానికి రూ. 1,600 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటికీ ఖర్చు పెడుతూనే వున్నారు. అయినా లక్ష్యం నెరవేరడం లేదు. అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌కు మూడేళ్ల నుంచి వేతనం ఇవ్వడం లేదు. ఆపరేటర్‌కు ఆరు నెలలకు ఒకసారి వేతనం ఇస్తున్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్న ఈ పథకం ఎన్నటికైనా పూర్తవుతుందా? అనే సందేహంలో రైతులు ఉన్నారు.


మల్యాల ఎత్తిపోతల ఫేస్‌1లో 4,900 ఎకరాలకు నీరు అందించాలి. దీనికి 1,536 లక్షలు ఖర్చు చేశారు. 72 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు పంపులు ఏర్పాటు చేశారు. ఈ పథకం వల్ల నాగటూరులో 1000 ఎకరాలు, కొణిదేలలో 370, పగిడ్యాలలో 930, లక్ష్మాపురంలో 2000, మండ్లెంలో 600 ఎకరాలకు నీరు అందాలి. 4900 ఎకరాల ఆయకట్టుకు గాను కేవలం 1000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. 

మల్యాల ఫేస్‌ 2 పథకంలో 4,900 ఎకరాలకు నీరు అందాలి. దీని అంచనా వ్యయం రూ. 1600 లక్షలు. 72 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు పంపులు ఏర్పాటు చేశారు. దీని వల్ల మద్దిగట్లలో 2000 ఎకరాలు, నందికొట్కూరులో 930, మల్యాల లో 600, మండ్లెంలో 1000, తర్తూరులో 370 ఎకరాలకు సాగునీరు అందాలి. 4900 ఎకరాల ఆయకట్టుకుగాను కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరు పారడం లేదని రైతులు అంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయ లోపం వల్ల, నిర్లక్ష్యం వల్ల పక్కనే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఉన్నా ఈ ఎత్తిపోతల వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సుమారు పది వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన ప్రాజెక్లు నుంచి కేవలం 2 వేల ఎకరాలకే నీరు అందుతోంది. 


 దీని వల్ల ప్రయోజనం లేదు


ఈ ఎత్తిపోతల వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. పది సంవత్సరాల నుంచి రైతులు నీటి కోసం ఎదురు చేస్తున్నారు. పైపులు వేశారు నీరు రావడం లేదు. మాకు మండ్లెం పొలిమేరలో నాలుగు ఎకరాల పొలం ఉంది. దానికి నీరు పారడం లేదు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేశాం.


 -నాగేశ్వరరావు,  రైతు సంఘం నాయకుడు


పూర్తి స్థాయిలో ఎత్తిపోతలు పని చేయాలి


మల్యాల నాగటూరు ఎత్తి పోతల పూర్థిస్థాయిలో పనిచేస్తే వ్యవసాయ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేళ్లు దాటాయి. కానీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు. రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 


 -పక్కీర్‌సాహెబ్‌, వ్యవసాయకార్మిక సంఘం


చివరి ఆయకట్టు దాకా నీరిస్తాం


మల్యాల చివరి ఆయకట్టు దాకా నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. రూ 108 లక్షలకు అంచనావేసి పంపాం. ప్రభుత్వం నిధులు ఇస్తే మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తాం. 


-కేశవయ్య, మల్యాల ఎత్తిపోతల డీఈ 

Read more