మాఘమాసం మహా డేంజరా..?

ABN , First Publish Date - 2022-02-03T12:45:35+05:30 IST

మాఘమాసం మహా డేంజరా..?

మాఘమాసం మహా డేంజరా..?

  • పెళ్లిళ్లతో కొవిడ్‌ విరుచుకుపడనుందా?  
  • టెస్ట్‌లు చేయకుండా కేసులు తగ్గించి చూపుతున్న ప్రభుత్వం
  • నిర్లక్ష్యంగా ప్రజలు, పట్టనట్టు అధికారులు

తిరుపతి సిటీ : జిల్లాలో కొవిడ్‌ తగ్గుముఖం పడుతోందా? హమ్మయ్య అని తేలికపడచ్చా? ఆందోళన వీడి హాయిగా ఉండచ్చా? జిల్లాలో నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య చూస్తే మాత్రం ఇలాగే అనిపిస్తుంది. ఇది నిజమనుకుని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మరింత ప్రమాదంలోకి జారిపోతాం. వాస్తవానికి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ తగ్గుతున్నట్టు నమోదవడానికి అసలు కారణం టెస్ట్‌లు చేయకపోవడం. జనవరి 17 నుంచీ చేసిన టెస్ట్‌ల సంఖ్యనూ, నమోదవుతున్న పాజిటివ్‌ల సంఖ్యనూ పరిశీలిస్తే ఈ సంగతి అర్థం అవుతుంది. పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా పాజిటివిటీ రేటు తగ్గడం లేదు. టెస్ట్‌ చేసిన ప్రతి ఇద్దరిలో లేదా ముగ్గురిలో ఒకరు పాజిటివ్‌ అనే తేలుతోంది. 


మరి కొవిడ్‌ తగ్గడం ఎలా అవుతుందో అంతుబట్టడం లేదు. మరోవైపు ఈ నెలలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతోంది. ఇది కొవిడ్‌ విస్తృతికి కారణం కావచ్చనే ఆందోళన వైద్యవర్గాల్లో ఉంది.ఒక వైపు కొవిడ్‌ టెస్ట్‌ల కోసం జనం అగచాట్లు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నామమాత్ర సంఖ్యలోనే టెస్ట్‌లు చేస్తున్నారు. వాటిని కూడా సిఫారసులకు పరిమితం చేస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేస్తున్నా అవి ఐసీఎంఆర్‌లో నమోదు కావడం లేదు. ‘ఫలితం కావాలంటే చెబుతాం. సర్టిఫికెట్‌ ఇవ్వలేం’ అని చేతులెత్తేస్తున్నారు. అదేమంటే టెస్ట్‌ ఫలితాలను అప్‌లోడ్‌ చేయవద్దని ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలున్నాయని చెబుతున్నారు.


ఐసీఎంఆర్‌ నుంచి సర్టిఫికెట్‌ లేకపోతే అధికారిక సెలవు లభించదు. దీంతో జిల్లాలో ఉద్యోగులు చాలామంది నష్టపోతున్నారు. మాఘ మాసం కావడంతో ఫిబ్రవరి నెలలో 16కు పైగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిల్లో 10 ముహూర్తాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని పురోహితులు పేర్కొంటు న్నారు. పెళ్లి మండపాలతో కిటకిటలాడే తిరుపతి నగరంలో ఈ నెలలో సందడి పెరుగుతుంది. ఈ ముహూర్తాల్లో దాదాపు 5వేల పెళ్ళిళ్లు జిల్లాలో జరగచ్చని అంచనా. ఇవి కొవిడ్‌ వ్యాప్తికి ప్రధాన కారణమయ్యే అవకాశాలున్నాయి.కొవిడ్‌ నిబంధనల అమలు పట్ల  ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. ప్రజలు కూడా ప్రమాదం లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇందువల్ల వైరస్‌ విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంటుందంటున్నారు.


పెళ్లికెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

- ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించేలా చూడాలి. 

- పెళ్లి మండపంలో శానిటైజర్లను, మాస్కులను అందుబాటులో ఉంచాలి. 

- భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.

- భోజనాల సమయంలో పక్క పక్కనే కూర్చొని తినడం, ఒకరు తాకిన పళ్లేలు, గ్లాసులు ఇతరులు ముట్టుకోవడం వంటివి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.

- భోజనాలు వడ్డించేవారు తప్పనిసరిగా మాస్కులతో పాటు గ్లౌజులు ధరించాలి. 


Updated Date - 2022-02-03T12:45:35+05:30 IST