Abn logo
Jan 25 2021 @ 00:56AM

పసుపు పసిడి అయ్యేనా?

ఆశాజనకంగా పసుపు సాగు

మద్దతు ధర, దిగుబడిపైనే భారీ ఆశలు

మార్కెట్‌ సౌకర్యం లేక రైతులకు తప్పని అవస్థలు

కలగానే మిగిలిన నిజామాబాద్‌ పసుపు బోర్డు ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 350 ఎకరాల్లో పంట సాగు

తలమడుగు, జనవరి 24: జిల్లాలో పసుపు పంట సిరులు కురు పించనుంది. నేలలు, వాతావరణం అనుకూలించడంతో ఈసారి దిగు బడి పెరిగే అవకాశముంది. ఈ సారి పంట యేపుగా పెరిగి ఆశాజ నకంగా కనిపించడంతో పసుపు పంట పసిడి అయ్యేనా.. అని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా పంట సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడు జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో పంటను సాగుచేయగా ఈ యేడు కేవలం 350 ఎకరాల్లో సాగు చేశారు. క్వింటాలు పసుపు ప్రస్తుతం మద్దతు ధర రూ.5,000 ఉండ గా భవిషత్తులో పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. అయితే పంటను విక్రయించేందుకు స్థానికంగా మార్కె ట్‌ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

పంట మార్పిడివైపు మొగ్గు..

జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక శాతం పత్తి పంట సాగువైపే మొగ్గు చూపేవారు. పత్తి పంటలో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న రైతన్నలు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఏటా ఒకే పంట వేయకుండా పంటి మార్పిడితో అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసా య అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నాలుగు సంవత్సరా లుగా పసుపు పంటను వేస్తున్నారు. ఈ పంటలో లాభాలు ఉన్నప్ప టికీ మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఆ జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రయత్నాలు చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు మహారాష్ట్ర, వరంగల్‌, నిజామాబాద్‌ తదితర సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి పంటను విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో రవాణా ఖర్చులు భారంగా మారుతోంది. ఒక్కో రైతు వందలాది క్వింటాళ్ల పసుపును పండిస్తున్నప్పటికీ మార్కెట్‌ సౌకర్యం లేనికారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.

తాంసి, తలమడుగు మండలాల్లో అధికంగా సాగు..

జిల్లాలోని తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్‌, బోథ్‌ తదితర ప్రాంతాల్లో పసుపు పండిస్తున్నారు. అయితే తాంసి, తలమడుగు మండలాల్లోని రైతులు పసుపు పంట సాగుకు అధికంగా మొగ్గుచూపుతున్నారు. తలమడుగు మండలానికి చెందిన రైతులు తక్కువ నీటితో డ్రిప్‌ను ఉపయోగించి కట్టలపై పసుపును పండించడంతో అధిక దిగుబడితోపాటు ఆర్థికంగా లాభాలు గడిస్తున్నామని రైతులు తెలిపారు. జిల్లా కేంద్రంలో పసుపు పంట మార్కెట్‌ సౌకర్యాన్ని కలిపిస్తే మరికొంత మంది రైతులు పసుపు పంట పండించేందుకు ముందుకు వచ్చే ఆస్కారం ఉందంటున్నారు. గతంలో తలమడుగు రైతులు పండించిన పసుపు పంటను నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల రైతులే కాకుండా మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు పసుపు పంటను పరిశీలించి యాజమాన్య పద్ధతులను, రైతులు సాధిస్తున్న దిగుబడులను తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నూతన సాంకేతిక పద్ధతుల తోపాటు రైతుల అనుభవంతో పంటలను సాగు చేస్తే రైతులు మరింత ముందుకు వెళ్లవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

మద్దతు ధర కోసం ఎదురు చూపులు..

ప్రస్తుతం పసుపు పంట ఉత్పత్తులు చేతికి వస్తున్నందున రైతులు పంటకు మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. దగ్గర మార్కెట్‌ సౌకర్యం ఉంటే గిట్టుబాటు ధర పొందే వారమని, ఆ సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వారిచ్చిన ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పసుపు పంట సాగును విస్తరించి జిల్లా కేంద్రంలో పసుపు విక్రయించేందుకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement