మరీ ఇంత మోసమా?

ABN , First Publish Date - 2022-01-10T07:52:54+05:30 IST

మరీ ఇంత మోసమా?

మరీ ఇంత మోసమా?

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం 

సర్కారు కొలువని చేరి ఇరుక్కుపోయాం

నేతలు, అధికారుల నుంచి నిత్యం ఒత్తిళ్లు 

వలంటీర్లకు ఇస్తున్న గౌరవం కూడా లేదు

ప్రొబేషన్‌ ప్రకటించకుండా శల్య పరీక్షలు

రెండేళ్ల తర్వాత సర్వీస్‌ రూల్స్‌ మార్పు

ఏ శాఖో, ఏ విభాగమో అర్థంకాని పరిస్థితి

పోరాటమే శరణ్యమంటున్న ఉద్యోగులు

నేడు కార్యాలయాల వద్ద ఆందోళనలు

టీకాలకు దూరం.. కిట్లు తీసుకోని వైనం

విధులకు రావాలని అధికారుల బెదిరింపులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి.. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడానికి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని ఘనంగా చెప్పుకొన్నారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగమని చేరి ఇరుక్కుపోయామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లకు ఇస్తున్న గౌరవం కూడా తమకు ఇవ్వడం లేదని వాపోతున్నారు. నిత్యం అధికార పార్టీ నేతలు, అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రొబేషన్‌ ప్రకటించకుండా వాయిదా వేసిందని, తమను వాడుకుని వదిలేస్తుందా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబరులోనే ప్రొబేషన్‌ ప్రకటించాల్సి ఉన్నా.. ప్రభుత్వం మరో ఆరు నెలలు వాయిదా వేయడం పై మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అధికారిక వాట్సాప్‌ గ్రూ పుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వెంటనే ప్రొబేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ లక్షా 30 వేల మంది ఉద్యోగు లు పోరుబాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు. ఆదివారం పలు చోట్ల గ్రామ, వార్డు ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ కి ట్లు తీసుకెళ్లలేదు. సోమవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉన్నందున తీసుకెళ్లాలని అధికారులు ఆదేశించినా వెళ్లలేదు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు.  


అంతా అయోమయం

సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగుల ను ఎంపిక చేశారు. జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. ఏ శాఖలో పనిచేస్తున్నారో? ఏ విభాగాని కి చెందిన వారో? అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. రికార్డింగ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుకు గ్రూప్‌-1 స్థాయి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే.. వారి సేవలు వినియోగించడంలో విఫలమైంది. రెండేళ్ల పాటు అప్రెంటిషిప్‌ పేరుతో కేవలం రూ.15 వేలు గౌరవ వేతనం ఇస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్‌ అయితే కనీసం రూ.30 వేల జీతం వస్తుందని, సొంత ఊర్లో ఆ జీతంతో బతికేయొచ్చని పలువురు భావించారు. మంచి వేతనాలు పొందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సైతం అక్కడ ఉద్యోగాలు వదిలేసి సొంత ఊర్లో ఉద్యోగం చేసేందుకు సిద్దపడ్డారు. కొంతమంది గ్రూప్‌-1, సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ.. ఈ లోపు గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల కోసం రాత పరీక్షలు రాసి ఎంపికయ్యారు. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్‌ ప్రకటించాల్సిన ప్రభుత్వం అనేక శల్య పరీక్షలు పెట్టిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్రెంటిషిప్‌ పూర్తికాకముందే ప్రభు త్వం డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పెట్టింది. కొంతమందికి సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పాస్‌ అయితేనే ప్రొబేషన్‌ ప్రకటిస్తామని పేర్కొంది. గత అక్టోబరు 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా... చాలా పోస్టులకు సర్వీస్‌ రూల్స్‌ మార్చింది. అంటే మొత్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీ్‌సను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకోలేదన్న ఆం దోళన ఉద్యోగుల్లో ఏర్పడింది. ఈ లోపు కంప్యూటర్‌ బేస్డ్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌ను తెరమీదకు తెచ్చింది. ఆ పరీక్ష పాసయితేనే రెగ్యులరైజ్‌ చేస్తామని షరతు పెట్టింది. దీనిపై ఉద్యోగులు ఆందోళన చేయడంతో మళ్లీ వెనక్కి తగ్గింది. అక్టోబరు 2 తర్వాత రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారుతామన్న ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు వారికి పలు అనుమానాలు కలిగేలా చేసింది. 


ప్రతి రోజూ ఒత్తిడి

సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం నిత్యం ఒత్తిడి పెట్టింది.  అధికార పార్టీ నేతలు కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే పలు అసంబద్ధ నిర్ణయాలను ప్రజల్లో అమలు చేయలేక  అవస్థలు పడ్డారు. పేదలు ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్ల బకాయిలను ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో సచివాలయ ఉద్యోగుల మెడ పై కత్తి పెట్టి వసూలు చేయిస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి పలు పథకాల టార్గెట్ల కోసం వేధిస్తున్నారు. కాగా, ఉద్యోగులకు జనవరి 1 నుంచి పీఆర్సీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకుండా పీఆర్సీ ఎలా అమలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు సర్కార్‌ ప్రొబేషన్‌ ప్రకటనను జూన్‌కు వాయిదా వేసిందని అనుమానిస్తున్నారు. న్యాయంగా అక్టోబరులో ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయితే జనవరి నుంచి పీఆర్సీ అమలవుతుందంటున్నారు. ప్రభుత్వం ఈ అవకాశాలను కాలరాసిందని బాధపడుతున్నారు.


నేడు ఉద్యోగుల నిరసన 

శనివారం వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఉద్యోగులు వైదొలగడంపై వారికి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఫోన్లు చేసి వెంటనే గ్రూప్‌లో చేరాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో కొంతమంది ఉద్యోగులు చేరినా ఎక్కువ మంది నిరసనలకు సిద్ధమయ్యారు. స్పందనలో తమ సమస్యలపై విజ్ఞప్తులు చేయాలని, మంగళవారం ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. 

Updated Date - 2022-01-10T07:52:54+05:30 IST