ఆరోగ్యశ్రీపై ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2022-05-09T08:15:30+05:30 IST

ఆరోగ్యశ్రీ పథకంపై రాష్ట్ర సర్కారు సవతి ప్రేమ చూపుతోంది. ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతోనే ఆరోగ్యశ్రీని నెట్టుకొస్తోంది.

ఆరోగ్యశ్రీపై ఇంత నిర్లక్ష్యమా?

  • ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జిల పాలనే.. ఇప్పటికీ పూర్తిస్థాయి సీఈవో లేరు
  • అటకెక్కిన ఉద్యోగుల ఆరోగ్య పథకం
  • ‘ప్రైవేట్‌’లో పని చేయని హెల్త్‌ కార్డులు
  • బిల్లులు రావట్లేదని ఆస్పత్రుల గగ్గోలు


హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకంపై రాష్ట్ర సర్కారు సవతి ప్రేమ చూపుతోంది. ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతోనే ఆరోగ్యశ్రీని నెట్టుకొస్తోంది. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో రోగులను చేర్చుకునేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులు నిరాకరిస్తుండగా.. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాలు నామ్‌కే వాస్తే అన్న చందంగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం అందజేసిన హెల్త్‌ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. వాస్తవానికి ఆరోగ్యశ్రీకి పూర్తి స్థాయి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) లేక ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో సీఈవోను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. 2018 కన్నా ముందు ప్రస్తుత నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహార్‌కు ఆరోగ్యశ్రీ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత ఐఏఎస్‌ అధికారి మాణిక్కరాజ్‌కు అదనపు బాధ్యతల కింద ఆరోగ్యశ్రీని అప్పగించి.. కొన్ని నెలల తర్వాత తీసేశారు. అప్పటి నుంచి వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శే ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. నిత్యం తన శాఖ వ్యవహారాలతో బిజీగా ఉండే కార్యదర్శి.. ఆరోగ్యశ్రీని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.


బిల్లు ఎంతైనా ఇచ్చేది రూ.లక్షే!

ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎ్‌స) సరిగ్గా అమలు కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ముందుగా డబ్బు చెల్లించి.. ఆ తర్వాత రీయింబర్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అది కూడా సకాలంలో రావడం లేదు. ఆ ఫైళ్లన్నీ వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో నెలల తరబడి ఉండిపోతున్నాయి. అక్కడ క్లియర్‌ అయినా.. ఆర్థికశాఖ వద్ద బ్రేక్‌ పడుతోంది. బిల్లు కోసం కనీసం నాలుగైదు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు ఆస్పత్రిలో బిల్లు ఎంతైనా.. ప్రభుత్వం ఇచ్చేది మాత్రం లక్ష రూపాయలే. మెజారిటీ కేసులకు లక్షలోపే చెల్లిస్తుండగా.. కేన్సర్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌, గుండె శస్త్రచికిత్స వంటి కేసుల్లో రూ.2 లక్షల దాకా ఇస్తున్నారు. అంతకు మించి బిల్లు అయితే మాత్రం ఏడుగురు ముఖ్యకార్యదర్శుల కమిటీకి పంపుతున్నారు. ఆ కమిటీ భేటీ అవ్వడమే గగనం. దీంతో ఈహెచ్‌ఎ్‌సలో వైద్యం చేయించుకోలేక, డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఉద్యోగులు, పెన్షనర్లు యాతన పడుతున్నారు. అయితే, ఈహెచ్‌ఎస్‌ కోసం తమ వంతు వాటా ధనం చెల్లిస్తామని ఉద్యోగులు పదేపదే మొరపెట్టుకోగా.. ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కానీ, ఇందుకోసం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు.


వాటా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం

ఈహెచ్‌ఎస్‌ పథకానికి ఉద్యోగుల తరపున వాటా ధనం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. పీఆర్సీ కూడా ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్‌ తీసుకోవాలని చెప్పింది. ఉద్యోగుల బేసిక్‌ పే నుంచి  1 శాతం కాంట్రిబ్యూషన్‌ తీసుకోమ్మని పీఆర్సీ సూచించింది. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికైనా స్పందించి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలి.

- మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో అధ్యక్షుడు

Read more