ఇంత దారుణమా...?

ABN , First Publish Date - 2022-01-19T06:27:31+05:30 IST

‘డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు ఒకరిని కూడా మత్తునుంచి విముక్తి చేయలేదా? అదే నిజమైతే నెలనెలా రూ.2లక్షల కార్పొరేషన్‌ నిధులు వృథా అవుతున్నట్టే కదా! సెంటర్‌ నిర్వహణపై ఈరోజు ఓ ప్రముఖ దినపత్రిక(ఆంధ్రజ్యోతి)లో కథనం వచ్చింది. అది వాస్తవమా? కాదా? దానిపై వివరణ ఇవ్వండి’ అంటూ ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ప్రశ్నించారు.

ఇంత దారుణమా...?
కార్పొరేషన్‌ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు వేదిక పైకి వస్తున్న ముద్రనారాయణకు కార్పొరేటర్ల అభినందనలు

డీ అడిక్షన్‌ సెంటర్‌ నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం 


జనన, మరణ సర్టిఫికెట్లకు రూ.500 వసూలు సరికాదు


 ఆంధ్రజ్యోతి కథనంపై కార్పొరేషన్‌ సమావేశంలో వాడివేడి చర్చ

 

తిరుపతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు ఒకరిని కూడా మత్తునుంచి విముక్తి చేయలేదా? అదే నిజమైతే నెలనెలా రూ.2లక్షల కార్పొరేషన్‌ నిధులు వృథా అవుతున్నట్టే కదా!  సెంటర్‌ నిర్వహణపై ఈరోజు ఓ ప్రముఖ దినపత్రిక(ఆంధ్రజ్యోతి)లో కథనం వచ్చింది. అది వాస్తవమా? కాదా? దానిపై వివరణ ఇవ్వండి’ అంటూ ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ప్రశ్నించారు.డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ అధ్యక్షతన తిరుపతి కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం జరిగింది.తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డీ అడిక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి వందరోజులవుతున్నా ఒక్కరిని కూడా మత్తునుంచి విముక్తి చేయలేదంటూ మంగళవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు వెనకున్న ఉద్దేశ్యాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి కథనంపై వివరణ కావాలని మంగళవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో పట్టుబట్టారు. డీ అడిక్షన్‌ సెంటర్‌ వైద్యురాలు లేచి సెంటర్‌ ఉపోద్ఘాతాన్ని చెప్పడం మొదలుపెట్టారు. మధ్యలో ఎమ్మెల్యే కలగజేసుకుని ‘నేను అడుగుతున్నది ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్లకు చికిత్స అందించారు? ఎంతమందికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు? ఎంతమంది బాధితులు మీ దగ్గరకు వచ్చారు? అనేవి కావాలి. జనరల్‌ సమాచారం ఎందుకు? అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఇంటింటికీ వెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చామని ఇన్‌పేషంట్లుగా ఎవరూ రాలేదని వైద్యురాలు తెలిపారు. ఆ ప్రాంత కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఆంజనేయులు కలుగజేసుకుని తాము ఎప్పుడు వెళ్లినా సెంటర్లో ఎవ్వరూ కనిపించరని ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్‌ గిరీష సెంటర్లో బయోమెట్రిక్‌ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. అప్పుడైనా ఎవరు వస్తున్నారో తెలుస్తుందన్నారు. డీ అడిక్షన్‌ సెంటర్‌ గురించి అక్కడ సిబ్బందే జనాల్లోకి తీసుకెళ్లాలని, మరోసారి ఇలాంటి విమర్శలు తలెత్తకుండా చూడాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు 21 రోజుల తర్వాత తీసుకోవాలంటే ఇప్పుడున్న రూ.10ఫీజును రూ.500 చేయడాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారు. ఒక్కసారిగా అంత పెంచటం సబబుకాదని, రూ.300గా మార్చాలని సూచించారు.  



మీరు చేసే తప్పులకు మాపై అపవాదులా..?


కౌన్సిల్‌ అజెండా సక్రమంగా తయారుచేయకపోవడం వలన తలెత్తే అపోహలకు తాము నిందలు పడాల్సివస్తోందని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒక వార్డు సచివాలయం కోసం రూ64.75లక్షలు అంచనా వేయడం ఏమిటని పత్రికలో వార్త చూసిన తనకు కూడా అనిపించిందన్నారు. తీరా ఇప్పుడు అది నాలుగు వార్డులకోసం వేసిన అంచనా అని ఇప్పుడు చెబుతున్నారు. అజెండాలో మాత్రం ఆ స్పష్టత లేకపోవడంతో ఇలాంటి అపవాదులు తాము పడాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు పనిమార్పిడి ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందన్న వివరణ అజెండాలో లేదని చెప్పారు. ఈసారి అజెండా తయారుచేసేటప్పుడు అంశాలను ఒకటికి రెండు సార్లు చదివి సవివరంగా పొందుపరచాలని ఎమ్మెల్యే సూచించారు.



ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై భారం వద్దు  


ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై బలవంతంగా భారం మోపడం సబబు కాదని టీడీపీ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎక్కువగా గుంటల్లో ఇళ్లు నిర్మించుకున్నారని... వీటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఓటీఎస్‌ వినియోగించుకోవాలని ఎవరినీ బలవంతం చేయడంలేదని, శాశ్వత గృహ హక్కు పథకం కావాలంటే ఓటీఎ్‌సలోకి రావాలని తద్వారా వారికే మేలు జరుగుతుందన్నారు.కమిషనర్‌ గిరీష మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా మార్కెట్లను వికేంద్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.కార్పొరేటర్లతో పాటు ఏడీసీ హరిత, ఎస్‌ఈ మోహన్‌, ఎంఈలు చంద్రశేఖర్‌, వెంకట్రామ రెడ్డి, మేనేజరు సేతుమాధవ్‌, ఆర్వో లోకే్‌షవర్మ, ఎంహెచ్‌వో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:27:31+05:30 IST