ఆమె తప్పులు బదిలీతోనే సరా?

ABN , First Publish Date - 2021-12-25T06:32:00+05:30 IST

ఇటీవల మిర్యాలగూడ బస్‌స్టాండ్‌ బయట ఓ ప్రైవేటు వాహనదారుడి నుంచి డబ్బులు వసూలు చేశారనే వీడియో వైరల్‌ కావడంతో డిపో సెక్యూరిటీ ఉద్యోగిని ఆర్టీసీ అధికారులు తక్షణమే సస్పెండ్‌ చేశారు. కాగా, ఆర్టీసీ సంస్థకు చెందిన సొమ్మును సొంత అవసరాలకు వినియోగించుకొని ఏడాది తరువాత విషయం వెలుగుచూడటంతో జమ చేసిన అధికారిని మాత్రం కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఆమె తప్పులు బదిలీతోనే సరా?
నార్కట్‌పల్లి డిపోలో అధికారి కారును కడుగుతున్న సిబ్బంది

కిందిస్థాయి ఉద్యోగుల ఇంక్రిమెంట్లలో కోత!

బదిలీ అయిన స్థానంలోనూ పలు ఆరోపణలు

వేధిస్తున్నారని ఆర్‌ఎంకు ఉద్యోగుల ఫిర్యాదు

పట్టించుకోని ఆర్టీసీ ఉన్నతాధికారులు



మిర్యాలగూడ, నార్కట్‌పల్లి : ఇటీవల మిర్యాలగూడ బస్‌స్టాండ్‌ బయట ఓ ప్రైవేటు వాహనదారుడి నుంచి డబ్బులు వసూలు చేశారనే వీడియో వైరల్‌ కావడంతో డిపో సెక్యూరిటీ ఉద్యోగిని ఆర్టీసీ అధికారులు తక్షణమే సస్పెండ్‌ చేశారు. కాగా, ఆర్టీసీ సంస్థకు చెందిన సొమ్మును సొంత అవసరాలకు వినియోగించుకొని ఏడాది తరువాత విషయం వెలుగుచూడటంతో జమ చేసిన అధికారిని మాత్రం కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇక బదిలీ చేసిన ప్రాంతంలోనూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులకు ఓ న్యాయం, కార్మికులకు ఓ న్యాయమా అని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.


గతంలో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వారు అధికారుల చెకింగ్‌లో దొరికితే కండక్టర్‌ తప్పులేకున్నా చార్జ్‌ మెమో ఇచ్చి ఇంక్రిమెంట్‌ కట్‌చేశారు. ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులు ఏ అవినీతి అక్రమాలకు పాల్పడినా, నిబంధనలను అతిక్రమించినా బదిలీ వేటుతోపాటు సస్పెండ్‌, ఇంక్రిమెంట్‌లో కోత విధించాలి. కానీ మిర్యాలగూడలో పనిచేస్తున్న ఓ అధికారిని మాత్రం బదిలీచేసి ఆ తరువాత విషయాన్ని అటకెక్కించారు.


సంస్థ సొమ్ము సొంతానికి వినియోగం

గత ఏడాది మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(నెం.1787) తెనాలిలో ఓ వివాహం కోసం అద్దెకు ఇచ్చారు. అందుకు డిపోలో సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగశ్రీకి 2020 మార్చి 21న అద్దెకు తీసుకున్నవారు రూ.20వేలు చెల్లించారు. టిమ్‌ మిషన్‌ ద్వారా టిక్కెట్లు ఇవ్వాల్సి ఉండగా, అవి లేకుండా కేవలం ఎస్‌ఆర్‌ రాసి బస్సును పంపారు. బస్‌ ఆన్‌లైన్‌ కాంట్రాక్టు సిస్టమ్‌(బీవోఎస్‌) పనిచేయకపోవడంతో అందులోనూ వివరాలను నమోదు చేయలేదు. అదే రోజు సంస్థ అకౌంటులో డబ్బులు జమ చేయాల్సివుండగా అదీ చేయలేదు. మరుసటి రోజు నుంచి (మార్చి 22) లాక్‌డౌన్‌ విధించడంతో ఈ విషయం అధికారుల దృష్టికి రాలేదు. అనంతరం ఏడాది తరువాత 2021, మార్చి 18న రూ.20వేలను సంస్థ ఖాతాలో ఆమె జమ చేశారు. అయితే తోటి ఉద్యోగుల మధ్య పంపకాల్లో తేడా రావడంతో విషయం బయటకు పొక్కుతుందని డబ్బులు చెల్లించారనే ఆరోపణలు అప్పుడు వినవచ్చాయి. దీనిపై డిపో మేనేజర్‌ పాల్‌ మార్చి 19న సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. కాగా, కాగా శాఖాపరమైన విచారణ నిర్వహించిన అధికారులు ఈ ఏడాది జూలై 1న ఆమెను నార్కట్‌పల్లి డిపోకు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఇదే విషయంలో కిందిస్థాయి ఉద్యోగులు ఇద్దరు ఏడీసీలు, డీసీ, సూపర్‌వైజర్‌కు మాత్రం చార్జ్‌మెమో ఇవ్వడమేగాక ఇంక్రిమెంట్‌ కూడా కట్‌ చేసినట్లు తెలిసింది. అయితే అసలు సూత్రధారిని మాత్రం కేవలం బదిలీతోనే సరిపుచ్చారని కిందిస్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆరునెలలైనా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిడే కారణమని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అక్కడా పలు ఆరోపణలు

నార్కట్‌పల్లి డిపోకు బదిలీ అయిన సదరు అధికారిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిపోలోని కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగుల మద్దతుతో డ్రైవర్‌, కండక్టర్‌లకు డ్యూటీ చార్ట్‌ కేటాయింపులో వేధిస్తున్నారని, అనుకూలమైన వారికి ఒక రకంగా, లేని వారికి మరో రకంగా డ్యూటీలు కేటాయిస్తూ సెలవుల మంజూరు విషయంలో ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. బస్సుకు ఏదైనా ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు నష్టాన్ని అంచనా వేసి సదరు డ్రైవర్‌ నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్న తరువాత చార్జ్‌షీటు జారీ చేశారని కొందరు డీవీఎంకు ఫిర్యాదు చేశారు. డిపో అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఇద్దరు మహిళా కండక్టర్‌లు రెండు నెలల క్రితం నల్లగొండ ఆర్‌ఎంకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో వీరి మాటలను వెనుక సీటులో కూర్చుని విన్న ఇదే డిపోకు చెందిన ఓ అధికారి ప్రశ్నించిగా, అది వివాదమై ఆర్‌ఎంకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లినట్లు సమాచారం. ఓ సంఘంలో పనిచేయడం, సమ్మెలో చురుకుగా పాల్గొనడంతో తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళా కండక్టర్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆర్‌ఎం విజిలెన్స్‌ విచారణ చేయించినట్టు తెలిసింది. డిపోలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సదరు అధికారి తన సొంత కారును నిబంధనలకు విరుద్ధంగా డిపోలోకి తీసుకురావడంతోపాటు, ఓ డ్రైవర్‌, హెల్పర్‌తో ఆ కారును కడిగించిన వీడియో వాట్స్‌పలో వైరల్‌ అయింది.


వేధింపులు అవాస్తవం : కృపాకర్‌రెడ్డి, నార్కట్‌పల్లి డీఎం

డిపోలో ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఫిర్యాదులు, విమర్శలు అవావస్తవం. డ్యూటీ విషయంలో టార్గెట్‌లపై ప్రశ్నిస్తే వేధింపు అనడం సమంజసం కాదు. ఉద్యోగులందరితో సఖ్యతతో మెలగుతున్నాం. డిపో ఆదాయానికి నష్టం వాటిల్లకుండా అవసరమైన ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తున్నాం. అసిస్టెంట్‌ మేనేజర్‌స్థాయి అధికారిపై ఫిర్యాదు ఉన్నతాఽధికారుల పరిధిలోని అంశం.


Updated Date - 2021-12-25T06:32:00+05:30 IST