పక్కాగా అమలయ్యేనా..?

ABN , First Publish Date - 2022-07-01T05:18:05+05:30 IST

ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నేటి నుంచి ఈ వస్తువులు ఏ రూపంలో ఉన్నా వినియోగించరాదని స్పష్టం చేసింది. నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

పక్కాగా అమలయ్యేనా..?
మామిడిపల్లిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

  నేటి నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

  ఆదేశాలు జారీ చేసిన  కేంద్ర ప్రభుత్వం

   వినియోగిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు

   జిల్లాలో అమలుపై సందేహాలు 

  ప్రత్యేక పర్యవేక్షణతోనే సాధ్యమంటున్న ప్రజా సంఘాలు

పార్వతీపురంటౌన్‌/సాలూరు రూరల్‌, జూన్‌ 30: ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నేటి నుంచి ఈ వస్తువులు ఏ రూపంలో ఉన్నా వినియోగించరాదని స్పష్టం చేసింది.  నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. 2021 నాటి ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించింది. అయితే జిల్లాలో అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  పర్యవరణానికి హాని కలిగించే పాలిథిన్‌ కవర్లు,  ప్లాస్టిక్‌ వస్తువులపై 2018లో  అప్పటి టీడీపీ ప్రభుత్వం నిషేఽధం విధించింది. దీంతో కొన్ని నెలల వరకూ పక్కాగా అమలు చేశారు.  ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. ఆ తర్వాత  ప్రజారోగ్యశాఖాధికారుల పర్యవేక్షణ లోపంతో  కొంతమంది వర్తకులు మళ్లీ విక్రయాలు ప్రారంభించారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం అమలు అటకెక్కిందనే చెప్పొచ్చు. జిల్లాలో యథేచ్ఛగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మునిసిపాలిటీల్లో మాత్రమే నాలుగేళ్లుగా పాలిథిన్‌ సంచులు, గ్లాసుల క్రయ, విక్రయాలపై నిషేధం  పక్కాగా అమలవుతోంది.  జిల్లా కేంద్రమైన పార్వతీపురం మునిసిపాలిటీలో మాత్రం అమలు కావడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ సారైనా ప్రత్యేక పర్యవేక్షణతో నిషేధం అమలు చేయాలని జిల్లావాసులు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. 

ఇవీ వాడరాదు.. 

100 మైక్రాన్ల లోపు ఉన్న ప్లాస్టిక్‌ ఇయర్‌ బడ్స్‌, బెలూన్లు, ఐస్‌క్రీమ్‌ కోసం వాడే పుల్లలు, జెండాలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు,  స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సంచులు తదితర వాటిని వినియోగించరాదు. బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్‌ వంటి వస్తువులు వినియోగించినా , నిల్వ చేసినా చర్యలు తీసుకోనున్నారు.  

     నిషేధాన్ని అమలు చేస్తున్నాం 

పట్టణంలో ప్లాస్టిక్‌ వస్తువుల క్రయ విక్రయాలపై పక్కాగా నిషేధాన్ని అమలు చేస్తున్నాం.  ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతులు జరగకుండా నిఘా పెట్టాం.  ఎవరి దగ్గరైనా పాలిథిన్‌ సంచులు, గ్లాసుల నిల్వలు ఉంటే  రూ.5వేలు జరిమానా, మునిసిపల్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నాం.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల ఒకటో తేదీ నుంచి  సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను ఎవరైనా అమ్మితే  రూ. 10వేలు జరిమానా, కఠిన చర్యలతోపాటు కేసు నమోదు చేస్తాం. 

-   సీహెచ్‌ ప్రసాద్‌, ప్రజారోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్‌, పార్వతీపురం 

            చర్యలు తప్పవు

 సాలూరు మునిసిపాలిటీలో 100 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్‌ ఏ రూపంలో విక్రయించినా, నిల్వ ఉంచిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా ఇటువంటి ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించొద్దు. పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న కేంద్రం నిర్ణయానికి  అందరూ మద్దతు ఇవ్వాలి.

 - హెచ్‌.శంకరరావు, మునిసిపల్‌ కమిషనర్‌, సాలూరు 

 

 

Updated Date - 2022-07-01T05:18:05+05:30 IST