వైసీపీని వీడితే అక్రమ కేసులా..?

ABN , First Publish Date - 2022-07-03T04:34:14+05:30 IST

వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.

వైసీపీని వీడితే అక్రమ కేసులా..?
మినీ మహానాడు సభాస్థలాన్ని పరిశీలిస్తున్న నల్లారి కిశోర్‌, శ్రీనివాసరెడ్డి

కొండ్రెడ్డిని పరామర్శించిన కిశోర్‌, శ్రీనివాసరెడ్డి

మదనపల్లె టౌన్‌, జూలై 2: వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కక్షతోనే మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకులు తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రెడ్డిపై కేసులు బనాయించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం మదనపల్లె సబ్‌జైలులో రిమాండులో ఉన్న మద్దిరెడ్డి కొండ్రెడ్డిని నల్లారి కిశోర్‌, పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కొండ్రెడ్డి భార్య తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీతకు ధైౖర్యం చెప్పారు. కిశోర్‌ మాట్లాడుతూ వైసీపీ తరపున తంబళ్లపల్లె జడ్పీటీసీ టికెట్‌ను గీతకు ఇచ్చారని, ఆమె గెలిచినప్పుడు ఈ కేసులేమి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి కనపడలేదా అని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబునాయుడు సమక్షంలో కొండ్రెడ్డి చేరుతూనే ఆయనపై కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి తప్పుడు కేసులపై పోరాడతామన్నారు. అవసరమైతే చంద్రబాబే తంబళ్లపల్లెకు వచ్చి ద్వారకనాథరెడ్డి అవినీతి, మల్లయ్యకొండలో వారు చేసిన అక్రమాలు వెలికి తీస్తారన్నారు. ద్వారకనాథరెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాల జాబితా కొండ్రెడ్డి వద్ద ఉందని, అందుకే కొండ్రెడ్డి అంటే ద్వారకనాథరెడ్డి భయపడుతున్నారన్నారు. కొండ్రెడ్డి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మదనపల్లెలో మినీమహానాడుకు తంబళ్లపల్లె నుంచి ప్రజలకు తీసుకుని రానీయకుండా కొండ్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ కార్యకర్తలు కెరటంలా దూసుకొచ్చి మినీమహానాడును విజయవంతం చేస్తారన్నారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌, టీడీపీ నేతలు శ్రీరామనేని జయరామనాయుడు, బోడెపాటి శ్రీనివాస్‌, పర్వీన్‌తాజ్‌, దొరస్వామినాయుడు, సురేంద్రయాదవ్‌, గుత్తికొండ త్యాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


మినీ మహానాడు వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు

మదనపల్లెలో నిర్వహించనున్న మినీమహానాడు సభాస్థలం వద్ద ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌, పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం స్థానిక బైపా్‌స రోడ్డు పక్కన 45 ఎకరాల్లో చదును చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా వచ్చే టీడీపీ కార్యకర్తలు సభలోకి వచ్చి, బయటకు వెళ్లేలా వచ్చేలా నాలుగు మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సభావేదిక వెనుక వైపు వీవీఐపీ కాన్వాయ్‌ పార్కింగ్‌, వీఐపీ వాహనాల శ్రేణి వచ్చి పోయేలా దారులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయానికి చేరుకుని పలు విషయాలను చర్చించారు. వీరి వెంట తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌, జయరామనాయుడు, బోడెపాటి శ్రీనివాస్‌, దొరస్వామినాయుడు, పర్వీన్‌తాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:34:14+05:30 IST