Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐదుపదుల ‘చిరుగాలి సితార’

ఇప్పుడు కమ్ముకుంటున్న కారుమబ్బులో ఏదో కొత్త సందేశం దాగి ఉన్నది. బహుశా, మనుషులు మనిషితనాన్ని నిలుపుకోవడానికి ఒక యుద్ధం చేయవలసి రావచ్చు. చిన్న సానుకూలత, చిన్న ప్రగతిశీలత, కాసింత ఉదారత– ఈ లక్షణాలు ఉంటే చాలు, ఇప్పుడు జరిగే పోరాటంలో ఆ మనిషి ఒక ఆవశ్యకమైన శక్తి. అటువంటి అందరినీ కలుపుకోవడానికి, అందరితో కలసి నడవడానికి అవసరమైన సందర్భం వచ్చింది. సరికొత్త 1930 లను ఎదురీదడానికి ప్రజాశ్రేణులకు విరసం సహనాయకత్వం అవసరం.

 

ఇప్పుడు కూడా ఏదో రుతు మేఘం ఆకాశాన్ని కమ్మేస్తున్నది.

 

ఎక్కడ చూసినా జనం, జనం. నిన్న ఇరానీ నగరం కెర్మన్‌లో జనం, మొన్న చిలీలో జనం, ఆ ముందు ముంబైలో జనం. ఇండియాలో యూనివర్సిటీల ముందు జనం. రోడ్డ మీద జనం. జెండాలు పట్టుకుని, నినాదాలు ఎత్తుకుని జనం. ప్రపంచంలోని ఆక్రోశం అంతా ఏదో కూడబలుక్కుంటున్నది. కాలం మళ్లీ పునరావృత్తమవుతున్నదా? వియత్నాం ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నది కదా?

 

1930లు ముసురుకుంటున్నాయా? వేరుచేయడానికి, బంధించడానికి, విషవాయువుతో చంపడానికి, హీనం చేసి ధ్వంసం చేసి మనిషిని హననం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అటో ఇటో నీ పేరు చిట్టాలోకి ఎక్కిస్తున్నారా? ఆనవాళ్ల కోసం సమాధులు తవ్వుతున్నారా? ఏ ఉనికీ లేనివాళ్లకోసం సమాధులు నిర్మిస్తున్నారా?

 

 

ఏదో ఒక రుతు మేఘం ఆకాశాన్ని ఆవరిస్తున్నది. ఇది మనలను అమృతధారలో తడిపేస్తుందా? జలప్రళయంతో తుడిచిపెడుతుందా?

 

***

ఇప్పటి లాగే అప్పుడు కూడా జనం జనం. కేంపస్‌లను ఆక్రమించిన విద్యార్థులు. 1960ల చివరి సంవత్సరాలు. రెక్క విప్పిన రివల్యూషన్‌. కేంద్రాన్ని బద్దలు కొట్టమన్న సాంస్కృతిక మహావిప్లవం. సరిహద్దులను తెంపేసిన, దిక్కులను ఊపేసిన, భాషను వివస్త్రం చేసిన వాగ్గేయ యువకులు, దిగంబర కవులు. గొంతు సవరించుకుంటున్న కాలం.

 

సరిగ్గా యాభై ఏళ్ల కిందట తెలుగు ఆకాశం రుతుగీతికి పులకించి, పొంగిపోయింది. లొంగిపోయిన అక్షరాన్ని నిలదీసి, ప్రలోభించిన అక్షరాన్ని ప్రశ్నించి, రచయితలారా మీరెటువైపు అని కొత్తతరం ప్రశ్నించింది. మహాకవిని గోడకుర్చీ వేయించి, విప్లవం ఇంపోజిషన్‌ ఇప్పించింది. విప్లవం ఏడున్నదో ఆడనే నీ గూడున్నదని ఒప్పించింది. స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో అని ప్రకటించింది. సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది అనీ, అభ్యుదయ ఉద్యమం శవప్రాయమైపోయిందని, జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకే విప్లవరచయితల సంఘం ఏర్పడుతున్నదని 1970 జులై 4 నాడు వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు.

 

సమాజాన్ని, వ్యవస్థను మౌలికంగా మార్చాలనే లక్ష్యాన్ని, అన్ని రకాలుగా మనుషులందరూ సమానత్వంతో జీవించే వ్యవస్థ కావాలనే ఆదర్శాన్నీ ప్రకటించుకున్న రాజకీయాలు, ఆచరణలో నెమ్మదించాయని, రాజీపడుతున్నాయని అనంతర తరం రాజకీయ విమర్శ చేసింది, అవే ఆదర్శాలను పంచుకునే రచయితలు, కవులు తమ సాహిత్యాచరణలో విఫలమయ్యారని సాహిత్యవిమర్శ చేసింది. ఈ రెండిటి నేపథ్యంలో కొత్త ఉత్సాహంతో– దృఢసంకల్పాన్ని, నిజాయితీని, వ్యవస్థపై రాజీలేని ఆగ్రహాన్ని ప్రకటించడానికీ, సాహిత్యరంగంలో విప్లవ పతాకం ఎగురవేయడానికీ విప్లవ రచయితల సంఘం(విరసం)ఆవిర్భవించింది. అనేక కష్టాలు, నష్టాలు, నిర్బంధాలు, విమర్శలు, దిద్దుబాట్ల నడుమ ఐదు దశాబ్దాల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసింది విరసం. ఆ సంస్థ తీసుకున్న తీవ్ర వైఖరులను, అనుసరించిన కఠినమైన ఆచరణను గమనిస్తే, ఇంత సుదీర్ఘకాలం అటువంటి సంస్థ మనగలగడమే ఒక విజయం. ఇప్పటికీ, రాజ్యంతో రాజీలేని వైఖరిని అనుసరించగలుగుతున్న సంస్థగా కొనసాగుతూ ఉండడం మరింత విశేషం.

 

అభ్యుదయోద్యమ కాలం నుంచి, ప్రగతిశీల రచయితలుగా ఉన్న శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రమణారెడ్డి, చలసాని ప్రసాద్‌ వంటి వారికి తోడు, కొత్తగా జతచేరిన నలుగురు దిగంబరులు, వరంగల్‌ వంటి సాహిత్య కేంద్రాల నుంచి వచ్చిన మార్చ్‌ వంటి బృందాల కవులు– విరసాన్ని తొలి అడుగు నుంచి పరుగుతీయించారు. కవిత్వంలో తీవ్రత, ప్రేరణాత్మకత, భావుకతకు ఆస్కారం లేని ఆవేశం, ఉద్వేగం– విప్లవ కవిత్వంపై వెంటనే విమర్శలను కూడా రప్పించాయి. నినాదప్రాయమైన కవిత్వం అన్నారు. రాజకీయం పాలు ఎక్కువ, సాహిత్యం పాలు తక్కువ అన్నారు. శ్రీకాకుళం ఉద్యమంలో మరణించిన సుబ్బారావు పాణిగ్రాహి, రచయిత నిబద్ధత, నిమగ్నత ఎంత ఉండాలనే చర్చకు కేంద్రం అయ్యారు. విప్లవోద్యమంలో ఉంటూ గెరిల్లా కవిత్వం రాసిన శివసాగర్‌ సజీవ కొలమానం అయ్యారు. రాజకీయపార్టీకి, సాహిత్యానికి ఎంత దూరం, ఎంత దగ్గర తనం ఉండాలి అనే చర్చలు కూడా ఆ కాలంలో జరిగాయి. రాజకీయపార్టీ ఎన్ని మెలికలు తిరిగితే, సాహిత్యం కూడా అన్ని మలుపులు తిరగనవసరం లేదని సీనియర్‌ విప్లవ రచయితలే వ్యాఖ్యానించారు. విప్లవోద్యమంలో ఉన్న వివిధ రాజకీయ సంస్థలు, వాటిపై అభిమానం కలిగిన రచయితలు బయటి ప్రపంచానికి గ్రూపులుగా, ముఠాలుగా కనిపించారు. అటువంటి విభేదాల ఆధారంగానే విరసంలో చీలికలు కూడా ఏర్పడ్డాయి. ఎమర్జెన్సీలో అనేక మంది విప్లవరచయితలు జైలు పాలయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో వ్యవహరించిన తీరు కారణంగా శ్రీశ్రీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 

ఎమర్జెన్సీ అనంతరకాలంలో విప్లవద్యోమంలో మార్పు వచ్చింది. మునుపటి పంథా మారి, ప్రజారంగంలో విస్తృతంగా పనిచేయాలనే ధోరణి ఏర్పడింది. అందుకు అనుగుణంగానే విరసం స్వరంలో కూడా మార్పు వచ్చింది. దశాబ్ది కాలం గడిచేసరికి, విరసం కవులలో కూడా నినాదాలు, ఆవేశాల ధోరణి బాగా తగ్గిపోయింది. విప్లవకవిత్వంలో కవిత్వం, విప్లవసాహిత్యంలో సాహిత్యం గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, విరసం ఉనికిలోకి వచ్చిన మొదటి దశాబ్దం రక్తం చేత రాగాలాపన చేయించింది. ఆ దశాబ్ద కాలాన్ని దందహ్యమాన దశాబ్దం అన్నారు.

 

కవిత్వ ఉధృతి ఎక్కువ ఉన్నప్పటికీ, విరసం ఆరంభ దశాబ్దంలోనే రావిశాస్త్రి, కాళీపట్నం, భూషణం వంటి కథానవలా రచయితలతో సంపన్నంగా ఉండింది. ఆ తరువాత కాలంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సాహు వంటి గొప్ప కథకులు తెలంగాణ జీవితాన్ని, పోరాట జీవితాన్ని కథనం చేశారు. అజ్ఞాత జీవితంలోని విప్లవకారులు కూడా అనేకులు తమ ఉద్యమ జీవితాన్ని కథలుగా రాశారు. మంచి కథకులుగా మారారు.

 

సాహిత్యానికి రాజకీయాలకు ఉండే సంబంధం గురించిన చర్చ విరసంలో కూడా సాగుతూనే వచ్చింది. గతితార్కిక సాహిత్య భౌతికవాదం, సాహిత్యానికి ఉండే స్వయం ప్రతిపత్తి మొదలైన అంశాలు విస్తృతంగా చర్చల్లోకి వచ్చాయి. 1980ల ప్రారంభం నుంచి స్త్రీవాదం, ఆ తరువాత దళితవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయవాదం సాహిత్యంలో ప్రవేశించాయి. 1980 దశకం ఆరంభం నుంచి విప్లవ కవిత్వం/ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతిగా పరిగణనలో లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే, ప్రధాన స్రవంతి అన్న భావనే అంతరించి పోయింది. అనేక బాటలు, కోవలు ఏకకాలంలో ఉనికిలో ఉంటూ వచ్చాయి. ఆయా వాదాలు వచ్చిన కొత్తలో, వాటి గొంతుబలంగా వినిపించినప్పటికీ, తరువాత అవి కొత్తవాటికి చోటు ఇస్తూ వచ్చాయి. తెలుగు సాహిత్యంపై ఏకైక నిర్ణాయక శక్తిగా విప్లవ సాహిత్యోద్యమం ఇక లేదన్నది వాస్తవం. ఒక బాహుళ్యంలో తాను భాగస్వామిగా మాత్రమే ఉండడాన్ని విరసం వెంటనే జీర్ణం చేసుకోలేకపోయినప్పటికీ, అతి త్వరలోనే వాస్తవికతను అంగీకరించింది. విరసంలో ఇప్పుడు 1970ల నాటి జోష్‌ లేకపోవచ్చును కానీ, అప్పటి కంటె ఎక్కువ ప్రజాస్వామికత ఉన్నదనిపిస్తుంది.

 

ప్రతి ‘ఇతర‘ ధోరణినీ శత్రుపూరితంగా చూడడం, నైతికమయిన తీర్పులు ఇవ్వడం – విరసం గత ధోరణి. ఇప్పుడది మారుతోంది. కొత్త తరం వచ్చింది. అధ్యయన శీలత ఉన్న, ఇతరులతో కలసి నడుద్దామన్న తపన ఉన్న యువత నాయకత్వం – ఈ సానుకూల మార్పులకు కారణమనిపిస్తుంది. వివిధ అస్తిత్వాల భాగస్వామ్యం పెరగడం కూడా ఇందుకు నిస్సందేహమైన కారణం. సాహిత్యానికి సంబంధించిన లోతైన అంశాలను, కొత్త కొత్త భావనలను, రచనా రీతులను చర్చించడం కానీ, తమ సభ్యులకు పరిచయం చేయడం కానీ విరసం వంటి సాహిత్య సంస్థకు ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అన్యవర్గ సాహిత్యమని గతంలో భావించేవాటిపై ఇప్పుడు సహనపూరితమైన విశ్లేషణలు, పరిశీలనలు విరసం ద్వారా జరుగుతున్నాయి. ఆ మార్పు, రచయితలను సంఘటితం చేసే ఐక్యతావ్యూహంలో మాత్రమే భాగం కాదనీ, నిజంగానే ఆ వైఖరిని ఒక విలువగా అంగీకరిస్తున్నారని ఇంకా నిర్ధారణ కావలసి ఉన్నది. ఏ అస్తిత్వ వాదాన్నీ ఆయా అస్తిత్వాలకు చెందినవారిలాగా సొంతం చేసుకోనక్కరలేదు కానీ, ఒక ఇంద్రధనస్సు దృక్పథం వ్యవహారసరళిలో ఉండాలి.

 

ఇతరులకు లేని సాహసం ఉంది. సంకల్పం ఉంది. కష్టాలను ఎదుర్కొనగలిగే నిబద్ధత ఉన్నది. యాభైఏళ్ల ఘనచరిత్ర ఉన్నది. జడత్వాన్నీ, పిడివాదాన్నీ సహజంగానే ఎడంగా పెట్టగలిగే కొత్త తరం నాయకత్వం ఉన్నది. ఇంకేమి కావాలి, విరసం మరింత విస్తృతం కావడానికి, మరింత ప్రభావశీలం కావడానికి.

 

సముద్రగర్భంలో ఉన్న అజ్ఞాత కెరటాలనే కాదు, జనసముద్రంలో నురగలు నురగలుగా తరగలెత్తుతున్న అలలను కూడా చూడండి. ఆ అలలను కూడా ప్రేమించగలిగే, చిరుగాలి సితారా సంగీతంగా మోగండి. అలలు కనే కలలను నిజం చేయండి.

ఇప్పుడు కమ్ముకుంటున్న కారుమబ్బులో ఏదో కొత్త సందేశం దాగి ఉన్నది. బహుశా, మనుషులు మనిషితనాన్ని నిలుపుకోవడానికి ఒక యుద్ధం చేయవలసి రావచ్చు. చిన్న సానుకూలత, చిన్న ప్రగతిశీలత, కాసింత ఉదారత– ఈ లక్షణాలు ఉంటే చాలు, ఇప్పుడు జరిగే పోరాటంలో ఆ మనిషి ఒక ఆవశ్యకమైన శక్తి. అటువంటి అందరినీ కలుపుకోవడానికి, అందరితో కలసి నడవడానికి అవసరమైన సందర్భం వచ్చింది. సరికొత్త 1930లను ఎదురీదడానికి ప్రజాశ్రేణులకు విరసం సహనాయకత్వం అవసరం. 

కె. శ్రీనివాస్ 

Advertisement
Advertisement