అలంకారప్రాయమేనా?

ABN , First Publish Date - 2022-01-07T06:28:36+05:30 IST

ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫోటో, దాని కింద రాసిన విషయం రెండూ సంచలనం రేపాయి. గౌరవనీయుడైన ఒక పార్లమెంటు సభ్యుడు ఏడెనిమిది మంది తోటి మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీ అది...

అలంకారప్రాయమేనా?

ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫోటో, దాని కింద రాసిన విషయం రెండూ సంచలనం రేపాయి. గౌరవనీయుడైన ఒక పార్లమెంటు సభ్యుడు ఏడెనిమిది మంది తోటి మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీ అది. దానిని చూడగానే చిన్నప్పటి నుంచి మనమందరం చూసే గోపికా సమేత శ్రీకృష్ణ భగవానుని చిత్రం తప్పక గుర్తుకు వస్తుంది. ఆ సెల్ఫీకి ‘‘లోక్‌సభ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరన్నారు?’’ అన్నది ఆయన కామెంటు. అలా ప్రకటించడం ద్వారా తన మగధీరతను, హాస్య చతురతను ప్రదర్శించాలనుకున్నాడు కాబోలు ఆ మహానుభావుడు. 


కాని ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. జాతీయ మహిళా చైర్‌పర్సన్‌ నుంచి ఆయనకు ఘాటైన హెచ్చరిక వచ్చింది. వెంటనే ఆయన ఆ ప్రకటనను విత్‌డ్రా చేసుకుని మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని కోరింది. ఆయనగారు నాలుక్కరచుకుని ‘‘నా ఉద్దేశం అది కాదు’’ అంటూ సాగదీసి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పుకున్నాడు.


అరవై అయిదేళ్ల జీవితకాలంలో మూడు పెళ్లిళ్లను పెటాకులు చేసుకున్న ఆ పెద్ద మనిషికి మహిళల విషయంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలియకపోవటం ఆశ్చర్యమే! పైగా ఆయన మామూలు రాజకీయ నాయకుడు కాదు గొప్ప మేధావి, రచయిత. అనేక గ్రంథాలు రాసి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచినవాడు. ఐక్యరాజ్యసమితిలో ఉన్నత పదవులు అలంకరించినవాడు. ఎన్ని గొప్ప లక్షణాలుంటేనేం, ఆడవాళ్ల దగ్గరకు వచ్చే సరికి తన సహజగుణాన్ని దాచుకోలేకపోయాడు. ఆయన దృష్టిలో మహిళా మెంబర్లను ఎన్నుకున్నది పార్లమెంటును సుందరీకరణ చేయడానికే కాబోలు!


రాజకీయాల్లో ఉన్న స్త్రీలందరూ కొంత ఆత్మావలోకనం చేసుకోవలసి ఉంది. వాళ్లు నిజంగా ప్రజల సమస్యలను తీర్చాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో చేరారా లేక తండ్రో, భర్తో చనిపోతే వారి వల్ల వచ్చే సానుభూతి ఓట్ల కోసం పార్టీ వాళ్లు తమను నిలబెడితే వచ్చారా? లేకపోతే ఆ పెద్దమనిషి అన్నట్టు లోక్‌సభను సుందరీకరణ చేయడానికి చట్టసభల్లో ప్రవేశించారా? నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతాలు గాని, సామాజిక దృక్పథం గాని లేని స్త్రీలు పదవీ వ్యామోహంతోనో, పార్టీ ఒత్తిడితోనో వస్తే వాళ్ల వల్ల సమాజానికి ఏమాత్రం ప్రయోజనం ఉండక నిజంగానే కేవలం అలంకారప్రాయులుగానే మిగిలిపోతారు.


అసలు చట్టసభల్లో ‘గ్లామర్‌’ చొరబడటం ప్రారంభమైంది బాలీవుడ్‌ తారలు ప్రవేశించడం వల్లనే. వైజయంతి మాల వంటి వాళ్లు ప్రజల చేత ఎన్నుకోబడి లోక్‌సభకు వెళ్లినా, చాలామంది తారలు రాజ్యసభలో చేరి తమ గ్లామర్‌తో నెగ్గుకు వచ్చారు. ఈ అందాల తారలు ప్రజా సమస్యలను గురించి ప్రస్తావించినట్లు ఎన్నడూ వార్తలు రాలేదు. తాము వెండి తెరమీద చూసి ఆనందించే తారలు (పురుషులు కూడా) తమ పక్క బెంచీల్లో కూర్చోవటాన్ని సామాన్య సభ్యులందరూ ఎంతో థ్రిలింగ్‌గా ఫీలయ్యేవారుట. అలా మేకప్‌ వేసుకుని చట్టసభల్లోకి వచ్చే సినిమాతారల వల్ల ముఖ్యంగా స్త్రీలు కేవలం గ్లామర్‌ డాల్స్‌ గానే ఉండిపోతారన్న అపప్రధ వచ్చింది. ఈ రోజుల్లో చట్టసభల్లో చేరుతున్న స్త్రీలు చాలామంది విద్యావంతులే. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పుల వల్ల వేషభాషలు సినీతారల గ్లామర్‌ని తలపిస్తున్నట్లు కనబడుతున్నాయి. అందుకే ఇప్పటికీ స్త్రీలను ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించే వ్యక్తులుగానే పరిగణిస్తున్నారే తప్ప చట్టసభల్లో వారికివ్వవలసిన గౌరవం దక్కడం లేదు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, సీతక్కల్లా నిరాడంబరంగా, సామాజిక నిబద్ధతతో వ్యవహరించే స్త్రీ సభ్యులుంటే పురుషపుంగవులు చట్టసభలలో ఆకర్షణను వెతుక్కోరు.

డా. జి. పరిమళా సోమేశ్వర్‌

రచయిత్రి

Updated Date - 2022-01-07T06:28:36+05:30 IST