రాజధాని కోసం భూములివ్వటమే పాపమా?

ABN , First Publish Date - 2021-07-26T08:39:43+05:30 IST

‘రాజధానికి భూములు ఇవ్వటమే మేము చేసిన పాపమా?’ అంటూ రైతులు ప్రశ్నించారు.

రాజధాని కోసం భూములివ్వటమే పాపమా?

586వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

తుళ్ళూరు, జూలై 25: ‘రాజధానికి భూములు ఇవ్వటమే మేము చేసిన పాపమా?’ అంటూ  రైతులు ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం 586వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, మూడు రాజధానులతో అభివృద్ధి ఉండదని తెలిసినా.. సీఎం  జగన్‌రెడ్డి ప్రతిపాదన పెట్టారన్నారు. పాలకులు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు.  అన్నిప్రాంతాల అభివృద్ధికోసం ప్రత్యేక హోదా సాధించాలని, కానీ దానిపై కేంద్రం వద్ద మాట్లాడే దమ్ము ధైర్యం సీఎంకు, ఆయన ఎంపీలకు లేదన్నారు.  రైతులను బాధపెట్టటం కాదు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలన్నారు.  రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేసి వెలుగు కార్యక్రమం కొనసాగించారు.

Updated Date - 2021-07-26T08:39:43+05:30 IST