నరహంతక దోపిడీ ముఠా పనేనా?

ABN , First Publish Date - 2021-12-05T07:33:16+05:30 IST

టంగుటూరులో తల్లీకూతుళ్లను అత్యంత దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లింది మహారాష్ట్రలోని పార్థీ గ్యాంగ్‌ అన్న అంచనాకు పోలీసులు వచ్చారు.

నరహంతక దోపిడీ ముఠా పనేనా?
టంగుటూరులో హత్యలు జరిగిన గృహం (ఇన్‌సెట్‌లో) హత్యకు గురైన తల్లీకూతుళ్లు శ్రీదేవి, వెంకటలేఖన (ఫైల్‌)

రెండు చోట్లా ఒకే ఫోన్‌ నెంబర్‌ వినియోగం

దాని ఆధారంగా  దర్యాప్తు

పార్థీ గ్యాంగ్‌పైనే అనుమానం 

గత నెల నుంచి నిందితులు టంగుటూరులోనే మకాం

మహారాష్ట్ర పోలీసుల అదుపులో దోపిడీ ముఠా?

అక్కడికి బయల్దేరి వెళ్లిన   ప్రత్యేక బృందాలు 

టంగుటూరులో తల్లీకూతుళ్లను కిరాతకంగా హత్య చేసిన కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నరహంతక దోపిడీ ముఠా పార్థీ గ్యాంగ్‌ ఈ ఘాతుకానికి  పాల్పడిందన్న ప్రాథమిక సమాచారం వణుకు పుట్టిస్తోంది. గత నెల 2 నుంచి టంగుటూరులో ఈ ముఠా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన కొద్ది గంటల ముందు మృతుల ఇంటి సమీపం నుంచి ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చాలాసేపు మాట్లాడినట్లు  కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇదేఫోన్‌ గతనెల 19న ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతుల హత్య జరిగిన ప్రాంతంలోనూ వినియోగించినట్లు తేలింది.  రెండు చోట్లా ఒకటే నెంబర్‌తో మాట్లాడటం, హత్యలు కూడా ఒకేరకంగా ఉండటం, ఆ ఫోన్‌ నెంబర్‌ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిది కావడంతో పోలీసులు పార్థీ గ్యాంగ్‌ పనేనన్న  నిర్ధారణకు వచ్చారు. అప్పటికే గుర్తించిన ఆ ముఠా సభ్యుడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా  వేట ప్రారంభించారు. వారు తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్లు గుర్తించారు. ఎస్పీ మలికగర్గ్‌ అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడారు. ఒక వాహనంలో నిందితులు అక్కడికి చేరినట్లు ఆమె చెప్పడంతో  అప్రమత్తమైన వారు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలు మహారాష్ట్రకు వెళ్లినట్లు సమాచారం. 

ఒంగోలు (క్రైం), డిసెంబరు 4 : టంగుటూరులో తల్లీకూతుళ్లను అత్యంత దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లింది మహారాష్ట్రలోని పార్థీ గ్యాంగ్‌ అన్న అంచనాకు పోలీసులు వచ్చారు. నేరస్థలంలో దాడి జరిగిన తీరు అత్యంత దారుణంగా ఉంది. తల్లి శ్రీదేవి, కుమార్తె వెంకటలేఖన శరీరాలపై ఉన్న గాయాలను పరిశీలిస్తే నరహంతక ముఠానే దోపిడీకి పాల్పడినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇంకొల్లు మండలం పూసపాడులో జరిగిన వృద్ధ దంపతుల హత్యలకు, టంగుటూరులో శుక్రవారం రాత్రి జరిగిన తల్లీకూతుళ్ల హత్యలకు దగ్గరి సంబంధం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీదేవి, వెంకట లేఖనలను పదునైన ఆయుధంతో గొంతు కోశారు. సుమారుగా 5 నుంచి 6 సెంటీమీటర్ల లోతున తెగింది. అంతేకాకుండా శ్రీదేవి శరీరంపై 13, వెంకట లేఖనపై మూడు కత్తిపోట్లు లోతుగా ఉన్నాయి.


పూసపాడులో  ఇదే తరహా హత్యలు

 ఇంకొల్లు మండలం పూసపాడులో గతనెల 19 రాత్రి వృద్ధ దంపతులను అత్యంత దారుణంగా హత్యచేశారు. అదేతరహాలో శుక్రవారం రాత్రి టంగుటూరులో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. అక్కడ రూ.70వేలు నగదు, ఆభరణాలు అపహరించుకెళ్లారు. టంగుటూరులో 25 సవర్ల బంగారు ఆభరణాలు పోయాయి. రెండు ప్రాంతాల్లో జరిగిన హత్యల తీరు ఒకేవిధంగా ఉందని పోలీసులు అంచనాకు వచ్చారు. పార్థీ గ్యాంగే ఇలా గొంతు కోసి హత్యలు చేసి సొత్తును దోచుకొని వెళతారని వారు భావిస్తున్నారు. 


గతనెల 2 నుంచి టంగుటూరు పరిసరాల్లో గ్యాంగ్‌ మకాం

మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్‌ గతనెల 2 నుంచి టంగుటూరు పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం సంఘటనకు ముందు హత్య జరిగిన ఇంటి సమీపం నుంచి ఒకవ్యక్తి సెల్‌ఫోన్‌లో అర్ధగంటపాటు మాట్లాడినట్లు సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇంకొల్లు మండలం పూసపాడులో గతనెల 19వతేదీ రాత్రి వృద్ధ దంపతులను హత్య చేసిన ప్రదేశం నుంచి కూడా ఇదే సెల్‌ఫోన్‌తో మాట్లాడినట్లు ఇప్పటికే తేలింది. రెండు చోట్లా ఒకటే నెంబర్‌తో మాట్లాడటం, హత్యలు కూడా ఒకేరకంగా ఉండటం, ఆ ఫోన్‌ నెంబర్‌ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిది కావడంతో పోలీసులు పార్థీ గ్యాంగ్‌ పనేనన్న నిర్ధారణకు వచ్చారు. అదే నంబరు గతనెల 2 నుంచి టంగుటూరు పరిసర ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.


మహారాష్ట్రకు బయల్దేరిన ప్రత్యేక బృందాలు

తల్లీకూతుళ్ల హత్య  పార్థీ గ్యాంగ్‌ పనే అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు రెండు బృందాలుగా మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లారు. అదేక్రమంలో నరహంతక ముఠా వద్ద ఉన్న సెల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా శనివారం మధ్యాహ్నానికి వారు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు. మార్గమధ్యంలో పట్టుకునేందుకు ఒక్కో బృందంలో ఇరువురు ఎస్సైలతో ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.  


2006లో  ఒంగోలులోనూ పార్థీ గ్యాంగ్‌ దోపిడీ

ఒంగోలు రామ్‌ నగర్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ను హత్య చేసి దోపిడీకి పాల్పడిన ఘటన 2006లో రాష్ట్రంలోనే సంచ లనం సృష్టించింది. మహా రాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఇంట్లో చొరబడి భార్యా భర్తలపై విచక్షణారహితంగా దాడిచేశారు. వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. బ్యాం క్‌ మేనేజర్‌ మృతిచెందగా, టీచర్‌గా పనిచే స్తున్న ఆయన భార్య తీవ్రగాయాలతో బయటపడ్డారు. 


అది నరహంతక ముఠా.. 

మహారాష్ట్రలో పార్థీ గ్యాంగ్‌గా పిలవబడే దొంగల ముఠాలు నరహంత కులు. దోపిడీలకు వచ్చిన సమయంలో కచ్ఛితంగా ఇంట్లో ఉన్నవారిపై విచక్షణారహితంగా దాడి చేస్తారు. ఎదురు తిరిగితే హత్య చేస్తారు. పూసపాడు, టంగుటూరులో జరిగిన దోపిడీలు అలాగే ఉండటంతో పార్థీ గ్యాంగ్‌ పని అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోన్‌నంబర్‌ కూడా అదే విషయాన్ని తేల్చింది.


పోలీసులు అప్రమత్తమై ఉంటే..

పోలీసులు అప్రమత్తమై ఉంటే టంగుటూరులో రెండు నిండు ప్రాణాలను బలికాకుండా ఉండేవన్న ఆరోపణలున్నాయి. గతనెల 19న నేర స్థలంలో తీసిన టవర్‌ డంప్‌లో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఫోన్‌ నంబరు వచ్చింది. అయితే ఆ దిశగా దర్యాప్తు జరగలేదు. శనివారం ఉదయం వరకు కూడా పూసపాడు హత్యలకు టంగుటూరు ఘటనకు సంబంధం లేదని ఎస్పీ మీడియాకు తెలిపారు. పూసపాడు హత్యలు జరిగిన తర్వాత కూడా టంగుటూరు ప్రాంతంలో పార్థీ గ్యాంగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కొంచెం అప్రమత్తమై అప్పుడే ఇలాంటి చర్యలు తీసుకుంటే టంగుటూరు తల్లీకూతుళ్లు ప్రాణాలు కాపాడేవారేమో. గతనెల 2 నుంచి పార్థీ గ్యాంగ్‌ జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసులు శనివారం నిర్ధారణకు వచ్చారు.


వెంకటలేఖన చివరి ప్రయత్నం చేసినా..

హత్యకు గురైన వెంకటలేఖన చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో బీటెక్‌  మూడో సంవత్సరం చదువుతోంది. కరో నా కావడంతో ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌ క్లాసులకు హా జరవుతోంది. అయితే ఇంట్లోకి దోపిడీ దొంగలు ప్రవేశిం చినప్పుడు 112కు ఫోన్‌ చేసే ప్రయత్నం చేసింది. ఆమె ఫోన్‌లో చివరి డయల్‌ 112 ఉంది. ఆమె మృతదేహం కింద ఉన్న ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


అన్ని కోణాల్లో దర్యాప్తు 

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. ఘటనా స్థలం పరిసరాల్లో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా టంగుటూరు పరిసర ప్రాంతాల్లో పార్థీ గ్యాంగ్‌ ఎక్కడ ఉన్నారు? అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకా జిల్లాలో ఇలాంటి ముఠాల సంచారం ఉందా అనే దిశగా  చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు.  అలాగే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్తవ్యక్తులు ఎవ్వరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 


పోలీసుల అదుపులో దోపిడీ ముఠా

 జిల్లాలో హత్యలు, దోపిడీలకు పాల్పడిన ముఠా మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. టంగుటూరులో తల్లీకూతుళ్ల హత్య అనంతరం ఎస్పీ మలికగర్గ్‌ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దోపిడీ ముఠా శనివారం మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఎస్పీ మహారాష్ట్రలోని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనుమానిత వాహనంలో వెళుతున్న ముఠాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ముఠా కోసం జిల్లా నుంచి ప్రత్యేక బృందాలు హుటాహుటిన బయల్దేరి వెళ్లాయి. అక్కడ వారిని విచారించి నిర్ధారణకు రావాల్సి ఉంది.  దాదాపుగా ఈ ముఠానే పూసపాడు, టంగుటూరు కేసుల్లో నిందితులుగా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయాలను ఏ పోలీసు అధికారీ నిర్ధారించలేదు. అనేక కోణాల్లో కేసును విచారిస్తున్నామని, కొంత పురోగతి వచ్చిందని మాత్రమే చెబుతున్నారు.


తల్లీకూతుళ్ల హత్య కేసును ఛేదిస్తాం : ఎస్పీ

టంగుటూరులో తల్లీకూతుళ్ల హత్యకేసును త్వరితగతిన ఛేదిస్తామని ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. సంఘటన జరిగిన జలదంకి రవికిషోర్‌ ఇంటిని శనివారం ఆమె పరిశీలించారు. హత్యల గురించి పూర్తి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పరిసరప్రాంత వాసులను విచారించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కేసు దర్యాప్తు కోసం ఓయస్‌డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు గంటలకు ఒకసారి తాను సమీక్ష  చేస్తానన్నారు. ఇదే తరహా నేరాలు జరిగిన ఇతర ప్రాంతాలలో ఉన్న నేరస్థుల సమాచారం సేకరించాలని పోలీసులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించాలన్నారు. అనంతరం మృతుల ఇంటి పెద్ద జలదంకి రవికిషోర్‌ బంగారం దుకాణాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఓయస్‌డీ కె.చౌడేశ్వరి, ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, ఎస్బీ డీఎస్పీ బి. మరియదాసు, ఎస్బీ సీఐ రాఘవేంద్రరావు, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌, సిబ్బంది ఉన్నారు.


పోలీసులపై స్థానికుల ఫిర్యాదు

టంగుటూరులో రాత్రులు గస్తీ ఉండటం లేదని ప్రజలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారని, దీంతో వాకింగ్‌ చేయడానికి ఇబ్బందిగా మారిందని పలువురు మహిళలు తెలిపారు. అంతేకాకుండా బైక్‌లలో పెట్రోల్‌ సైతం మాయం చేస్తున్నారని కొందరు చెప్పారు. చిల్లరదొంగల బెడద ఎక్కువైందని, రాత్రిళ్లు పోలీసుల గస్తీ పెంచాలని కోరారు. 



Updated Date - 2021-12-05T07:33:16+05:30 IST