విచారణకూ ఆయనేనా ?

ABN , First Publish Date - 2022-08-13T06:12:46+05:30 IST

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే విచారణ బాధ్యతలు అప్పగించ డంపై జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విచారణకూ ఆయనేనా ?
అశోక్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియం

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే విచారణ బాధ్యత

స్వీయ నివేదికలో సొంత భజన

తానేమీ ఎరుగనంటూ నివేదిక

ప్రశ్నించేవారిపై కక్ష సాధింపు

తట్టుకోలేక ఓ ఉద్యోగిని సెలవులో వెళ్లిన వైనం

ఇదీ జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖలో అవినీతి తతంగం 

అనంతపురం క్లాక్‌టవర్‌ : ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే విచారణ బాధ్యతలు అప్పగించ డంపై జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నించిన ఉద్యోగులు, కోచలపై వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తునాయి. దీంతో ఉద్యోగులు, కోచలు ఆశాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే విచారణ బాధ్యతలు అప్పగించడం విడ్డూరంగా ఉంది. వేధింపులు తాళలేక ఓ ఉద్యోగిని సెలవులో వెళ్లినట్లు సమాచారం.  


సెలవులో వెళ్లడంపై అందరికీ అనుమానం

జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖలో వేధింపులు తాళలేక ఓ ఉద్యోగిణి సెలవులో వెళ్లారు. దీనిపై ఆశాఖలో  చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇండోర్‌స్టేడియం ఖాళీ అయ్యింది. ఇటీవల బదిలీల్లో సగానికి పైగా వెళ్లిపోయారు. ఇక్కడ సరిపడ సిబ్బంది లేరు. బదిలీ అయిన ఉద్యోగులు, కోచలు ఇక్కడ మంజూరైన పోస్టుల కంటే తక్కువగా ఉన్నారని జిల్లా యంత్రాంగం, ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే ఉద్యోగులు, కోచల బదిలీలను ఆపి సరిపడ సిబ్బందిని సమకూర్చుకోవడంపై ఎటువంటి దృష్టి సారించని ఆ అధికారి వేధిస్తూ పైశాచికానందం పొందుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఉద్యోగిణి సెలవులో వెళ్లారనే ప్రచారం ఆశాఖలో జోరుగా సాగుతోంది.  


స్వీయ విచారణ నివేదికలో భజనల పర్వం

అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇటీవల అశోక్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో రూ.1.2లక్షల విలువ చేసే మురుగు కాలువల మరమ్మతు పనులు చేశారు. ఇందుకు రూ.2లక్షల వరకు బిల్లులకు నిధులు డ్రా చేశారు. ఇందులో రూ.80వేలు ఆ అధికారి తన జేబులో వేసుకున్నారని ఆశాఖలో ఉద్యోగులే చర్చించుకుంటున్నా ఆయనకే విచారణ బాధ్యత ఇవ్వడంపై ఉద్యోగులు, కోచలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్వీయ నివేదికలో సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ తానేమీ ఎరుగనం టూ ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, ఉద్యోగులపై వివక్ష, పనివేళల అనంతరం స్టేడియంలోనే ఉద్యోగులు ఉండాలని హుకుం జారీ చేయడం వంటివి పొందుపరచడం గమనార్హం.


ఇండోర్‌ స్టేడియానికి దిక్కెవరు?

అశోక్‌నగర్‌లోని జిల్లా క్రీడాప్రాధికార (డీఎ్‌సఏ) ఇండోర్‌ స్టేడియం, కార్యాలయానికి ఆరు నెలలుగా వాచమన లేడు. దీంతో ఇండోర్‌ స్టేడియం, కార్యాలయానికి రక్షణ ఎవరూ అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. ఉదయం, సాయంత్రం మాత్రమే క్రీడాకారులు సాధన చేస్తారు. మిగిలిన సమయంలో ఇక్కడ ఎవరూ ఉండరు. దీంతో ఇక్కడి వస్తువులు, క్రీడా పరికరాలు, కార్యాలయంలో ఉండే రికార్డులకు రక్షణ ఎవరు కల్పిస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో పనిచేసిన వాచమనకు వేతనం సరిగా ఇవ్వకపోవడం, వేధింపులు తాళలేక ఉద్యోగం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. వాచమనగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి ఇక్కడ జరుగుతున్న తతంగం, వేధింపులే కారణమని ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. 

 

ప్రశ్నించేందుకు సాహసించని ఉద్యోగులు, కోచలు

జిల్లా క్రీడా, యువజనసంక్షేమశాఖలో ఉద్యోగులు, కోచలెవరైనా సరే ప్రశ్నిస్తే ఇక అంతే సంగతులు. ఓ అధికారి అన్నీ తానేనని తను చెప్పినట్లే జరగాలంటూ ఉద్యోగులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు  ఆశాఖలో చర్చలు జరుగుతున్నాయి. కలెక్టరేట్‌కు ఆనుకుని ఉన్న కార్యాలయంలో ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదంటూ ఆశాఖలో పనిచేస్తున్న చిరుద్యోగులు వాపోతున్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో కోచల శిక్షణ కేంద్రాలకు వెళ్తూ మళ్లీ కలవండి అంటూ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారింది. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఇక అంతే సంగతులు. ఎవరు ఎన్ని చేసినా పై స్థాయిలో నాకు ఉన్న పరపతితో నేను చెప్పిందే జరుగుతుంది. అప్పుడు మీ పనిపడతా అంటూ బహిరంగంగానే ఉద్యోగులు, కోచలపై విరుచుకుపడటం గమనార్హం.

Updated Date - 2022-08-13T06:12:46+05:30 IST