Abn logo
Oct 27 2021 @ 22:16PM

పశువైద్యం అందని ద్రాక్షేనా?

- ఆస్పత్రుల్లో భర్తీకాని పోస్టులు

- సకాలంలో అందని వైద్యసేవలు

- ఆందోళనలో రైతులు

వాంకిడి, అక్టోబరు 27: మండలంలో మూగజీవాలకు పశువైద్యం అందనిద్రాక్షలా తయారైంది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతోపాటు సరిపడ వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడంలేదు. మండలంలోని వాంకిడి, కనర్‌గామ్‌, ఇందాని గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ వాటివల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు.  వైద్యశాలల్లో కొంతకాలంగా పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో మండలంలోని పశువులకు సరైన వైద్యం అందడంలేదు. వాంకిడి పశువైద్యశాలలో ఏడీఏతోపాటు ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్‌లు, ఇద్దరు అటెండర్‌లు ఉండాల్సి ఉండగా కేవలం ఒక వెటర్నరీ అసిస్టెంట్‌తో వైద్యశాల కొనసాగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న ఏడీఏ మెడికల్‌ సెలవులో ఉండగా పశువులకు సక్రమంగా వైద్యం అందడంలేదు. మండలంలో 21వేలు పశు వులు, 4426బర్రెలు, 11వేలు గొర్రెలు, 23వేలు మేకలు ఉన్నాయి.  మండలంలోని కనర్‌గామ్‌ పశువైద్యశాలలో ఒక ఎల్‌ఎస్‌ఏ, ఒక అటెండర్‌  ఉండాల్సి ఉండగా ఇక్కడి పనిచేసిన అటెండర్‌ గతేడాది  అనారోగ్యంతో మరణించడంతో ప్రస్తుతం ఈ వైద్యశాల మూతపడి పోయింది. ఇందాని వైద్యశాలలో వైద్యాధికారితోపాటు ఒక వెటర్నిరీ అసిస్టెంట్‌, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ ఇక్కడ పనిచేస్తున్న వైద్యాధికారికి ఇతర మండలాల్లో అదనపు బాధ్యతలు ఉండడంతో సకాలంలో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. మండలంలోని కనర్‌గాం పశువైద్యశాలలో కేవలం ఒక వైద్యాధికారి మాత్రమే ఉండడంతో మిగితా గ్రామాల్లో పశువులకు సకాలంలో వైద్యం అందించలేకపోతున్నారు. వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు గాలికుంటు తదితర అంటువ్యాధుల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి రైతులే పశువులు, గొర్రెలకు చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  మండలంలోని వాంకిడి, ఇందాని, కనర్‌గామ్‌ పశువైద్యశాలల్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి  సకాలంలో పశువులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

బంబారలో పశువైద్యశాల ఏర్పాటు చేయాలి..

సయ్యద్‌ అయ్యూబ్‌, సర్పంచ్‌, బంబార

మండలంలోని వాంకిడి, కనర్‌గామ్‌, ఇందానిలో ఉన్న పశువైద్యశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేక పశువులకు సకాలంలో వైద్యం అందడంలేదు. బంబార గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు వాంకిడి పశువైద్యశాలకు తమ పశువులను తీసుకువెలితే  ఈ ప్రాంత పశువులు తమ పరిధిలోకి రావని నామమాత్రంగా చికిత్సలు చేస్తున్నారు. ఇందాని పశువైద్యశాలకు వెళ్లాలని సలహాలు ఇస్తున్నారు. బంబార గ్రామ పంచాయతీ నుంచి ఇంధాని పశువైద్యశాల దాదాపు 20కిలోమీటర్ల దురం ఉంటుంది. దీంతో పశువులకు ప్రైవేట్‌ వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. బంబార గ్రామంలో పశువైద్యశాల ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతంలోని సోనాపూర్‌, సవ్వాతి, చౌపన్‌గుడ గ్రామపంచాయతీల రైతులకు అందుబాటులో ఉంటుంది. ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. 

సకాలంలో వైద్యం అందేలా చర్యలు..

పశువైద్యాధికారి శివప్రసాద్‌

మండలంలోని పశువులకు సకాలంలో వైద్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. వాంకిడి, ఇందాని, కనర్‌గామ్‌ పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతకారణంగా పశువులకు సకాలంలో వైద్యం అందించడంలో కొంత జాప్యం జరుగుతోంది. మండలంలోని ఖమాన గ్రామంలో పశువైద్యశాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాము. గ్రామాల్లో పశువైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.