గోలో డైట్‌... మంచిదేనా?

ABN , First Publish Date - 2021-03-06T19:53:12+05:30 IST

బరువు నియంత్రించడంలో ఆహారంతో పాటు, రక్తంలో ఇన్సులిన్‌ పరిమాణం, శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు కూడా కారణమని ఎౖఔౖ డైట్‌ రూపకర్తల అభిప్రాయం. హార్మోనులను నియంత్రించి సక్రమంగా బరువును తగ్గించేందుకు ఈ డైట్‌ను రూపొందించారు.

గోలో డైట్‌... మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(06-03-2021)

ప్రశ్న: గోలో డైట్‌ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలున్నాయా?


- శ్రావ్య, విజయవాడ


డాక్టర్ సమాధానం: బరువు నియంత్రించడంలో ఆహారంతో పాటు, రక్తంలో ఇన్సులిన్‌ పరిమాణం, శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు కూడా కారణమని గోల్డైట్‌ రూపకర్తల అభిప్రాయం. హార్మోనులను నియంత్రించి సక్రమంగా బరువును తగ్గించేందుకు ఈ డైట్‌ను రూపొందించారు. నిర్ణీత పరిమాణాల్లో ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు ‘రిలీజ్‌’ అనే గోలో టాబ్లెట్‌ను ఇందులో భాగంగా వేసుకోవాలి. ఈ టాబ్లెట్‌లో వివిధ రకాల మొక్కల నుండి వెలికి తీసిన కొన్ని పదార్థాలు, శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజాలు ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఈ డైట్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కూరగాయలు, కొవ్వుల విభాగాల నుండి ఆహార పట్టిక ఎంపిక చేస్తారు. నిర్దేశించిన మోతాదులోనే వాటిని తీసుకోవాలి. ఆ పట్టికలో ఉండే ఆహారం పాశ్చాత్య దేశాల్లో విరివిగా లభించేదే కానీ మన దేశంలో అన్నీ దొరకవు. దొరికినా చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, తగిన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకుంటూ రోజువారీ వ్యాయామం చేస్తూ బరువు తగ్గొచ్చు. జీవనశైలి మార్పులతో ఎవరైనా కూడా గోలో డైట్‌తో లభించే ఫలితాలను ఎలాంటి సప్లిమెంట్ల అవసరం లేకుండా పొందడం సాధ్యమే. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-03-06T19:53:12+05:30 IST