స్వేచ్ఛ రాజద్రోహమా?

ABN , First Publish Date - 2021-05-18T05:56:17+05:30 IST

చట్టప్రకారం ఏర్పడిన ప్రభుత్వంపై ద్వేషాన్ని, నిరసనభావాన్ని, అప్రియత్వాన్ని కలిగించే, లేదా కలిగించే ప్రయత్నాన్ని మాట ద్వారా కానీ రాత ద్వారా కానీ సైగలూ ప్రదర్శన ఇతరత్రా కానీ చేస్తే జీవితకాలం జైలులో....

స్వేచ్ఛ రాజద్రోహమా?

చట్టప్రకారం ఏర్పడిన ప్రభుత్వంపై ద్వేషాన్ని, నిరసనభావాన్ని, అప్రియత్వాన్ని కలిగించే, లేదా కలిగించే ప్రయత్నాన్ని మాట ద్వారా కానీ రాత ద్వారా కానీ సైగలూ ప్రదర్శన ఇతరత్రా కానీ చేస్తే జీవితకాలం జైలులో పెట్టవచ్చు, జరిమానా వేయవచ్చు, లేదా మూడేళ్ల జైలు, జరిమానా విధించవచ్చు- అని భారత శిక్షాస్మృతిలోని 124 ఎ సెక్షన్ చెబుతుంది. ఇదే రాజద్రోహాన్ని నిర్వచించే సెక్షన్. దీన్ని మహా ఘనత వహించిన థామస్ బాబింగ్టన్ మెకాలే రచించారు.


భారతదేశంలో విద్యావిధానాన్ని సమూలంగా మార్చివేశాడని లేదా ఆంగ్లమానసపుత్రులను, సామ్రాజ్యవాదానికి ఊడిగం చేసే గుమస్తాలను తయారుచేసే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడని కీర్తిపొందిన మెకాలే ఇతడే. ప్రభుత్వంపై అప్రియత్వమో సమ్మతో కలిగించే అవకాశం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? భారతదేశం తమ వలస కాబట్టి ప్రజాస్వామ్యం చెల్లదు కానీ, మెకాలే సొంతదేశంలో ఇటువంటి చట్టం ఉంటే జనం ప్రభుత్వాన్ని కూల్చేసేవారు. 1870 నుంచి ఈ సెక్షన్ మన దేశంలో అమలులో ఉన్నది. బ్రిటిష్ వారు పోయారు, స్వాతంత్ర్యం వచ్చింది. కాంగ్రెస్ వారు పాలించారు. ఇప్పుడు బిజెపి పాలిస్తోంది. ‘రాజద్రోహాలూ’ కొనసాగుతున్నాయి, పాలకులకు ఆ సెక్షనూ అవసరం పడుతోంది. ఈ సెక్షన్‌ను తొలగించే అవకాశముందా అని 2019లో కేంద్రాన్ని అడిగితే, అటువంటిదేమీ లేదు, తీవ్రవాద, వేర్పాటువాద, ఉగ్రవాద శక్తులతో తలపడడానికి ఈ సెక్షన్‌ను మరింతగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది అప్పటి కేంద్రహోంశాఖ సహాయమంత్రి చెప్పారు. 


రాజులు లేనప్పుడు రాజద్రోహాలు ఏమిటి? పాలకుల మీద విమర్శకు ఆస్కారం లేకపోతే ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వాలు మారడం ఎందుకు? పైగా, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలపై వ్యతిరేకతను ఎవరన్నా పనిగట్టుకుని సృష్టించాలా? అనతికాలంలోనే అప్రియత్వాన్ని వారు సమకూర్చుకోలేరా? రాజద్రోహం మరీ ఫ్యూడల్‌గా వినిపిస్తోంది కాబట్టి, దేశద్రోహం అందాము. ద్వేషం, అప్రియత్వం, విముఖత, నిరసన వంటి మాటలను ఎవరు నిర్వచించాలి? ఫలానా ప్రభుత్వం నశించాలి, అని ఉద్యమకారులు నినాదాలిస్తారు అనుకోండి, అది రాజద్రోహం అవుతుందా? అది ఒక వలసవాద చట్టం. ప్రజాస్వామ్యంలో దానికి స్థానం లేదు. 


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తనది రాచరికమని, లేదా తెల్లదొరల ప్రభుత్వమని అనుకుంటున్నదా? రఘురామకృష్ణంరాజుకు ఆయనకు ఎక్కడ చెడిందో మరి, అది వారికి సంబంధించిన విషయం. తన పార్టీ తరఫునే తన అభ్యర్థిగానే ఆ రాజు పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు కదా? ఆయన నుంచి అంత వ్యతిరేకతను ఎట్లా సంపాదించుకున్నారో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిత్యం ఉతికి ఆరేస్తున్నారనుకోండి, అది ఆయన హక్కు. ఆ ఆరోపణలను విశ్వసించాలో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు. రఘురామరాజును నమ్మలేదనుకోండి, ఆయన రాజకీయ జీవితమే దెబ్బతింటుంది. తన బెయిల్‌ను రద్దుచేయమని అడిగారని ఆయన మీద ఎపి ముఖ్యమంత్రికి చాలా కోపం వచ్చి ఉండవచ్చు. ఆ కోపాన్ని తక్షణం తీర్చుకోవాలంటే, పార్టీ నుంచి బహిష్కరించి ఉండవలసింది. ప్రస్తుతానికి ఎంపీల లెక్క ఒకటి తగ్గుతుంది, అంతే. వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించే పథకం వేసి ఉండవలసింది. పోలీసులను పురమాయించి, ఎత్తుకొచ్చి, కాళ్ల మీద దెబ్బలను అనుగ్రహించి, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టుదాకా తన ప్రభుత్వ ప్రతిష్ఠనే బోనులో నిలబెట్టడం ఎందుకు? దానికితోడు, ఆ రాజుగారి విమర్శను, వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఎబిన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్ల మీద కూడా కుట్రకేసు, రాజద్రోహం కేసు! పగ ప్రతీకారాలనే శ్వాసించేవారికి వేరే శత్రువులక్కరలేదట! తీరిగ్గా కూచుని తమ గోతులు తామే తవ్వుకుంటూ ఉంటారు.

 

ఇప్పుడు సైనిక ఆస్పత్రిలో, రఘురామకృష్ణంరాజు గాయాలకు మూలకారణాలను పరీక్షించి, ఆయనను అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని కూడా పరిశీలించి, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను తప్పుపట్టిందనుకోండి! అప్పుడు దేశవ్యాప్తంగా లభించే అపకీర్తిప్రతిష్ఠల గురించి కూడా ముందే ఆలోచించి ఉండవలసింది? బెయిల్ రద్దు గురించిన రఘురామకృష్ణంరాజు అభ్యర్థనను పరిశీలించే న్యాయస్థానం, ఇప్పుడు నెలకొన్న సన్నివేశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా? తప్పొప్పులు, దానికి అనుభవించే శిక్షల సంగతేమిటో కానీ, ముందు జగన్ రెడ్డి తనకు ఇటువంటి ఉత్తమోత్తమమైన సలహాలు ఇస్తున్న ఆంతరంగికుల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. వారెవరో ప్రియమైన శత్రువు అయి ఉండాలి. లేకపోతే, ఒక అసమ్మతి రాజకీయనాయకుడు తన నాయకుడి మీద, అతని ప్రభుత్వం మీద చేసే విమర్శలను ప్రసారం చేసినందుకు టీవీ చానెళ్ల మీద రాజద్రోహం కేసులు పెడతారా? అభిప్రాయాలకు వాహికలుగా ఉండే సమాచార, ప్రసారసాధనాలను, ఆ అభిప్రాయాలకు బాధ్యులుగా చేస్తారా? అట్లా అయితే, ఇక ఏ రాజకీయనాయకుడి ప్రకటననూ పత్రికలు ప్రచురించకూడదు. ఏ అధికప్రసంగాన్నీ విలేఖనం చేయకూడదు. మీడియాను కూడా రాజద్రోహ కేసులో ఇరికించే ప్రయత్నాన్ని న్యాయస్థానాలు సహిస్తాయా? 


కేంద్రప్రభుత్వం తనకు దన్నుగా ఉంటుందన్న అభిప్రాయం ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతలకు ఉన్నట్టుంది. అక్కడి నేతలూ రాజకీయవాదులే కాబట్టి, తమ అవసరార్థం లేదా తమ వ్యూహాల ప్రకారం ఏవో దాగుడు మూతలాడుతూ ఉంటారు. ట్వీట్లు చేసినా, ఆక్సిజన్ కావాలని ఫేస్‌బుక్‌లో అభ్యర్థనలు పంపినా, ప్రభుత్వం పై వ్యంగ్య చిత్రాలను ప్రచారం చేసినా కేసులు పెట్టి వేధించడానికి దేశంలో ఒక ఆనవాయితీ ఇంతకుముందే మొదలయింది. ఆ అప్రజాస్వామికతను వార్తాచానెళ్ల దాకా విస్తరించే సాహసం జగన్ ప్రభుత్వం చేసింది. -జగన్ ప్రభుత్వంపై అభిమానాన్ని, ప్రేమను, సమ్మతిని కల్పించడానికి పత్రికలకు, చానెళ్లకు ఎంత హక్కు ఉన్నదో, అప్రియత్వాన్ని, వ్యతిరేకతను, ఏవగింపును కలిగించడానికి కూడా పత్రికలకు అంతే హక్కు ఉంటుంది. దాన్నే భావప్రకటనా స్వేచ్ఛ అంటారు. అది నేరశిక్షాస్మృతికి సంబంధించింది కాదు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించింది. సలహాదారులు ఒకసారి రాజ్యాంగం తిరగేస్తే, జగన్ ప్రభుత్వానికి మంచిది.

Updated Date - 2021-05-18T05:56:17+05:30 IST