Abn logo
Oct 28 2020 @ 00:11AM

ఆశల పోలవరం పూర్తి అయ్యేనా ?

Kaakateeya

స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం పోలవరంపై విషం చిమ్ముతూ కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసిన ఫలితంగానే, ఇప్పుడు నిధుల్లో కోతపెట్టి అయిదు కోట్లమంది నోట్లో మట్టి కొట్టింది కేంద్ర ప్రభుత్వం. 


విజ్ఞత, బాధ్యత లేని పాలకులు రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారు. అమరావతిపై పగబట్టి దాని రెక్కలు విరిచారు. పోలవరంపై విషం చిమ్మి దానిని ముంచుతున్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100 శాతం నిధులు సమకూర్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నవ్యాంధ్ర జీవనాడి పోలవరాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలనే పవిత్ర సంకల్పంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగించింది గత ప్రభుత్వం. 2014 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు ప్రాంతం అంతా పెద్ద పెద్ద కొండలు, ఖాళీ చెయ్యని గ్రామాలు ఉన్నాయి. ఇది ఎప్పటికి పూర్తి కావాలి, అసలు పూర్తి అవుతుందా? అని అనేకులు నిరుత్సాహపడుతున్న స్థితి. ఈ నేపథ్యంలో అన్ని సవాళ్లనూ అధిగమించి ప్రాజెక్టు ప్రాంతంలో 2019 ఫిబ్రవరి నాటికి మహాద్భుతం ఆవిష్కృతం అయింది. 2015 జనవరి వరకు తట్ట మట్టి తీయని చోట, బొచ్చెడు కాంక్రీట్ వేయని చోట 2019 మార్చినాటికి ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. నిరంతర శ్రమ, పర్యవేక్షణతో మూడేళ్లలో 70శాతం పూర్తయి రేడియల్ గేట్లు బిగింపు దశకు చేరుకుంది. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రకటించిన 16 జాతీయ ప్రాజెక్టులలో శరవేగంతో నిర్మాణం జరిగి 70 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టు పోలవరం ఒక్కటే.  


రివర్స్ టెండర్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని రివర్స్ చెయ్యడంతో దాని భవిత ప్రశ్నార్థకం అయింది. పోలవరంలో ఎటువంటి అవినీతి జరిగినట్లు తమ దృష్టికి రాలేదని లోక్‌సభలో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారు. అవినీతి జరగలేదంటూ కేంద్రజలశక్తి శాఖ ఢిల్లీ హైకోర్టుకు ఒక కేసు సందర్భంగా 24 పేజీల రిపోర్టు సైతం అందజేసింది. 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాస వ్యయం భారీగా పెరిగిన వాస్తవాన్ని గుర్తించకుండా, కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయం పెంచారనీ, ప్రాజెక్టు ఆసాంతం అవినీతి, అక్రమాల పుట్టనీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా కేంద్రానికి రాసిన లేఖలే పోలవరం పుట్టిముంచాయి. అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండర్స్ పేరుతో కాంట్రా క్టర్‌ను మార్చారు. ఇప్పుడు కేంద్రం కూడా జగన్ రివర్స్ పథకాన్నే అమలు చేస్తూ 2013–-14 నాటి అంచనాలే ఫైనల్‌చేసి ఆశల పోలవరాన్ని ముంచింది. ఈ ప్రాజెక్టుకు పునరావాసం, భూ సేకరణ వ్యయమే అధికం. యూపియే ప్రభుత్వం పోతూ పోతూ 2013 కొత్త భూ సేకరణ చట్టం తీసుకు రావడంతో భూ సేకరణ వ్యయం అమాంతం పెరిగి పోయింది. కానీ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనీ, వ్యయం అంచనాలు పెంచవద్దని ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌ కేంద్రానికి లేఖలు రాసిన ఫలితంగానే కేంద్రం తాను ఇవ్వాల్సిన నిధులకు నేడు గండి కొట్టింది. తాము చేసిన పాపాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంపై, చంద్రబాబుపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన.


2013–14 నాటి అంచనా వ్యయంతో ఇప్పుడు పోలవరం నిర్మాణం పూర్తి కావడం అసాధ్యం. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని విభజన చట్టంలో అంగీకరించిన కేంద్రం ఇప్పుడు నానా విధ కొర్రీలు వేస్తూ పోలవరానికి అడ్డుపడుతున్నది. 2013–-14 అంచనా వ్యయం ప్రకారం రూ.20,398.61 కోట్లకు అంగీకరించని పక్షంలో రాష్ట్రానికి రీయంబర్స్ చేయాల్సిన రూ.2,234.28 కోట్లను కూడా ఇచ్చేది లేదని కేంద్రం హెచ్చరిస్తే తలాడించి కేంద్రం ముందు మోకరిల్లిన ఆర్థికమంత్రి నెపాన్ని చంద్రబాబుపై వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చెయ్యడం సిగ్గుచేటు. పోలవరం అంచనా వ్యయంలో కేంద్రం అన్ని వేల కోట్లు కోతపెడితే నిలదీసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన వ్యయాన్ని రీయంబర్స్ చేయాలని కేంద్రాన్ని అడిగినప్పుడు భూసేకరణ వ్యయాన్ని తగ్గించుకొంటేనే రూ.1850 కోట్లు రీయంబర్స్ చేస్తామని కొర్రీ వేసింది కేంద్రం. దానికి మారు మాట్లాడకుండా అంగీకరించడం వల్లనే ఆ మధ్య రూ.1850కోట్లు విడుదల చెయ్యడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించడం క్షమించరానిది.  


కేంద్రం మూడింట రెండొంతులు కోత పెట్టిన నేపథ్యంలో ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారనుంది. ఇప్పటివరకు 1,10,996 ఎకరాల భూమి సేకరించగా, ఇంకా 56,328 ఎకరాలు సేకరించాల్సిన స్థితిలో భూములు ఇవ్వడానికి ప్రజలు ముందుకు వచ్చే అవకాశం లేదు. పోలవరం విషయంలో కేంద్రం దగా చేసింది. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన దానికి, అధికారంలోకి వచ్చిన తరువాత చెబుతున్న దానికీ బిజెపి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ప్రశంసించి అవార్డు ఇచ్చింది. కేంద్ర జల విద్యుత్ సంస్థ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) ఈ అవార్డును ప్రకటించింది. ప్రాజెక్టు పనులు వేగంగా, చక్కగా సాగుతున్నందుకు అవార్డు ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి అయిన నవయుగ సంస్థ 24 గంటల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఏది ఏమైనా ఏడాదిన్నర క్రితం వరకు పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం రాష్ట్రప్రజల్లో బలంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఐదుకోట్ల ఆంధ్రుల ఆశలు ఆవిరి అయ్యాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం పోలవరంపై విషం చిమ్ముతూ కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసిన ఫలితంగానే, ఇప్పుడు నిధుల్లో కోతపెట్టి అయిదు కోట్లమంది నోట్లో మట్టి కొట్టింది కేంద్ర ప్రభుత్వం.                  

నీరుకొండ ప్రసాద్

Advertisement
Advertisement