‘సాగు’ కష్టమేనా...!

ABN , First Publish Date - 2022-05-11T05:30:00+05:30 IST

వ్యవసాయ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

‘సాగు’ కష్టమేనా...!
వేపూరికోట సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు

వ్యవసాయ మీటర్లతో భారం పడుతుందేమోనని రైతుల ఆవేదన

రైతుల నుంచి అంగీకారపత్రాల సేకరణ 

ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత

తంబళ్లపల్లె నియోజకవర్గంలో 23,366 వ్యవసాయ కనెక్షన్లు


ములకలచెరువు, మే 11: వ్యవసాయ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం రాయితీ ఇస్తామని ప్రకటించినా పలు అనుమానాలు రైతును వెంటాడుతున్నాయి. తమపై భారం పడి పంటల సాగుకు కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత విద్యుత్‌ ఎత్తేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు త్వరలోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. సీఎం ప్రకటనతో రైతుల్లో అలజడి ప్రారంభమైంది. మీటర్లు బిగిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ విషయంలో ఇలాగే చేసి, ప్రస్తుతం రాయితీ అంతంతమాత్రంగా ఇస్తున్నారని పలువురు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ విషయంలో కూడా రాయితీ తొలగిస్తారేమోనని పలువురు రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


రైతుల నుంచి అంగీకార పత్రాల సేకరణ

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు విషయమై అధికారులు ఇప్పటికే అంగీకార పత్రాలు సేకరించారు. ‘వ్యవసాయ ఉచిత విద్యుత్‌ వినియోగం నిమిత్తం మంజూరు చేసిన రాయితీ నగదును బ్యాంకు ఖాతాకు విడతల వారీగా బదిలీ అయిన వెంటనే ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసేందుకు పూర్తి సమ్మతి తెలియజేస్తున్నా..ఇందులో ఏ విధమైనా అభ్యంతరాలు లేవని ధ్రువీకరిస్తున్నా...’అంటూ రైతులతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. ప్రతి రైతు నుంచి ఆధార్‌, పట్టాదారు, బ్యాంకు పాసు పుస్తకాల జిరాక్సు కాపీలను తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం డిస్కంలకు నేరుగా విద్యుత్‌ రాయితీలను చెల్లిస్తుంది. మీటర్లు ఏర్పాటైతే రైతులు వినియోగించిన నెలవారీ యూనిట్లకు సంబంధించి వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. రైతు ఖాతాల్లో నుంచి నేరుగా డిస్కంలకు ఆ సొమ్ము జమ అవుతుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయం రైతుల ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా తెలుస్తుందని అధికారులు అంటున్నారు. 


సందేహాలు ఎన్నో

- విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుకు ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రాయితీ కాకుండా నగదు బదిలీ పథకం అమలు చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

- మీటర్లు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వం ఏ ఒక్క రైతు ఖాతాలోకి నగదు జమ చేయకపోయినా..ఆ మొత్తాన్ని రైతులే చెల్లించాల్సి వస్తుందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

- ప్రభుత్వం భవిష్యత్తులో వ్యవసాయానికి ఇన్ని యూనిట్లే వాడాలని నిబంధన పెడితే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

- రైతులు పొలాల్లోని కేబుల్‌ వైర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. అలాగే గతంలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేయడంతో పాటు రాగి వైరును చోరీ చేసిన ఘటనలు అధికంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే రాత్రి వేళల్లో రక్షణ బాధ్యత ఎవరిదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


తంబళ్లపల్లె నియోజకవర్గంలో 23,366 విద్యుత్‌ కనెక్షన్లు

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 23,366 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ములకలచెరువు మండలంలో 3,319, పెద్దతిప్పసముద్రంలో 4,606, బి.కొత్తకోటలో 4,155, తంబళ్లపల్లెలో 3,941, కురబలకోటలో 3,771, పెద్దమండ్యంలో 3,574 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా అన్నింటికీ మీటర్లు బిగించనున్నారు.  


ఉచితానికే స్వస్తి పలికేందుకే

ఉచిత విద్యుత్‌కు స్వస్తి పలికేందుకే మీటర్ల బిగింపు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే పంటలకు విద్యుత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించలేం. పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయలేం. ఇన్నాళ్లు ఉచిత విద్యుత్‌ అన్నారు. ఇప్పుడెమో వాయించేందుకు సిద్ధమవుతున్నారు. 

- కె.నరసింహారెడ్డి, కన్నెమడుగువారిపల్లె, ములకలచెరువు మండలం


బిల్లులు లేనప్పుడు మీటర్లు ఎందుకు

వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే బిల్లులు రావని చెబుతున్నారు. బిల్లులు రానప్పుడు మీటర్లు ఎందుకు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ మాటున మీటర్ల బిగింపు నిర్ణయం సరైంది కాదు. మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయం మానుకుని పొలాలను బీడు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. 

- ఎ.సాంబశివారెడ్డి, పర్తికోట, ములకలచెరువు మండలం


విధి విధానాలు రాగానే మీటర్లు బిగిస్తాం

- హేమకుమార్‌, ట్రాన్స్‌కో ఏఈఈ, ములకలచెరువు క్లస్టర్‌

ప్రభుత్వం నుంచి విఽధి విధానాలు రాగానే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తాం. రైతులందరూ విద్యుత్‌ సిబ్బందికి సహకరించాలి. రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాము. రైతుల ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాం. మీటర్లు బిగించిన తరువాత రైతులు వాడిన విద్యుత్‌కు సంబంధించి ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుంది. రైతుల ఖాతాల్లో నుంచి డిస్కంలకు నేరుగా ఈ నగదు జమ అవుతుంది. ప్రభుత్వం జమ చేసే నగదు రైతులు తీసుకునే వీలుండదు.

Read more