Abn logo
Jan 22 2021 @ 04:28AM

రాజీ సాధ్యమా?

మూడువ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఆందోళన కీలక ఘట్టానికి చేరుకున్నది. చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉద్యమసంఘాలు తిరస్కరించాయి. చట్టాలరద్దు, మద్దతుధరకు చట్టప్రతిపత్తి వంటి డిమాండ్లకు తాము కట్టుబడి ఉన్నామని రైతుసంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. నలభైకి పైగా సంఘాలు భాగస్వాములుగా ఉన్న మోర్చా, ప్రభుత్వ ప్రతిపాదనలపైనా, శుక్రవారం నాటి చర్చల్లో అనుసరించవలసిన వైఖరి మీదా సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ ప్రతిపాదన తమకు సమ్మతం కాదని ప్రకటించింది. ఇక ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేయవలసి ఉంటుంది. 


నిజానికి, ఈ ఆందోళన త్వరగా కొలిక్కివచ్చేది కాదని రైతులకు తెలుసు. ఎంతకాలమైనా ఉద్యమాన్ని కొనసాగించాలని రైతుసంఘాలు నిశ్చయించుకున్నాయి. కొంతకాలానికి అలసిపోయి విరమించుకుంటారు లెమ్మని అనేక దఫాల చర్చలతో ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అమలుచేస్తూ వస్తున్నది. అంతూ దరీ లేకుండా సాగిపోయే అవకాశమున్న ఈ సన్నివేశానికి గణతంత్రదినోత్సవం కారణంగా జటిలమయిన సమస్య ఎదురవుతున్నది. ఆ రోజున ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. గణతంత్రదినోత్సవ కార్యక్రమాల రీత్యా అది భద్రతకు హానికరమని ప్రభుత్వం చెబుతున్నది. ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతించవలసిందిగా రైతు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ పోలీసులే ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటారని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఎట్టి పరిస్థితులలోను ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించేది లేదని ప్రభుత్వం గురువారం నాడు స్పష్టం చేసింది. ర్యాలీ యథావిధిగా జరుగుతుందా, జరిగితే అక్కడే జరుగుతుందా, లేదా శుక్రవారం నాటి చర్చల ఫలితాన్ని బట్టి విరమించుకుంటారా, ప్రభుత్వ వైఖరి మరింత బిగుసుకుంటుందా అన్నది వేచిచూడాలి. 


పద్దెనిమిది నెలల నిలుపుదల అన్న ప్రతిపాదనపై రైతుసంఘాలు గురువారం నాడు ఎటువంటి హర్షాతిరేకాలను వ్యక్తం చేయలేదు. అయితే, అనేక సంఘాల నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. కేంద్రప్రభుత్వంతో జరుగుతున్న చర్చలలో నలభైకి పైగా రైతుసంఘాలు పాలుపంచుకుంటున్నాయి. ఈ సంఘాలలో కొన్ని ప్రభుత్వ సానుకూల స్పందనకు సంతోషంగా ఉన్నాయని చెబుతున్నారు. మరి కొందరు నిలుపుదల కాలాన్ని ఏడాదిన్నర నుంచి రెండేళ్లకు, అంతకు మించి పెంచమని డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. ఇదంతా రైతు ఉద్యమాన్ని భగ్నం చేసేందుకు చెబుతున్న మాటలే తప్ప, ప్రభుత్వం మాట మీద నిలబడదని, చట్టాలను పూర్తిగా రద్దుచేయడం ఒక్కటే ఆమోదనీయమని మరి కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై కలుగుతున్న అపనమ్మకం కారణంగా ఉద్యమనేతలు కఠినవైఖరి తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. 


ఒకస్థాయికి చేరిన ఉద్యమాన్ని కాపాడుకోవాలనే తపన రైతుసంఘాల్లో బలంగా ఉన్నది. బుధవారం నాడు సుప్రీంకోర్టులో చేసిన వాదనల్లో కూడా ఈ తాపత్రయం వ్యక్తమయింది. చట్టాల అమలును నిలిపివేశాము కదా, వాటి చట్టబద్ధతను నిర్ణయించేవరకు మీరు ఆందోళనను నిలిపివేయవచ్చును కదా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరి రేపు మీరు ఆ చట్టాలు రాజ్యాంగబద్ధమేనని తీర్పు ఇచ్చిన పక్షంలో రైతుల పరిస్థితి ఏమిటి? అని ఉద్యమకారుల పక్షాన వాదిస్తున్న ప్రశాంత్‌ భూషణ్ వాదించారు. ‘‘మేము అట్లా తీర్పు ఇచ్చిన నాడు, మరునాడే తిరిగి ఆందోళనను ప్రారంభించవచ్చు’’ అని న్యాయమూర్తులు సూచించారు. సాంకేతికంగా రాజ్యాంగ బద్ధమైన చట్టాలను కూడా వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉన్నదని సుప్రీంకోర్టు భావించడం ఆనందకరమే అయినప్పటికీ, ఇప్పుడు శిబిరాలను ఎత్తివేసి ఇళ్లకు వెళ్లిపోయాక, రేపెప్పుడో తిరిగి ఇంతటి శక్తిని కూడగట్టుకోవడం సాధ్యం అవుతుందా- అన్న సందేహం సహజం. 


చట్టాల నిలిపివేతే పెద్ద వరం అనుకుంటే, ఆ పని సుప్రీంకోర్టు ద్వారా జరిగింది. ప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేముంది? వచ్చే ఎన్నికల దాకా నిలిపివేస్తామంటే కొంతవరకు భరోసా కలిగేదేమో? ఏడాదిన్నర వల్ల పెద్దగా ఒరిగేది ఉండకపోవచ్చు. కనీస మద్దతు ధర అంశంపై ఒక కమిటీని ఏర్పరుస్తామని కూడా కేంద్రం ప్రతిపాదిస్తున్నది. ఇప్పటిదాకా కనీస మద్దతుధరకు చట్టబద్ధత కానీ, చట్టబద్ధత ఇవ్వాలన్న బలమైన డిమాండ్ కానీ లేదు. ఇప్పుడు, ఆ అంశాలను పరిశీలించడానికి కేంద్రం అంగీకరించడమంటే, ఇది రైతులకు ఒక విజయమే. ఉద్యమాన్ని ఇతర పద్ధతుల ద్వారా బలహీనపరచడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమై, ఒక సామరస్య ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తేవడం కూడా ఈ ఉద్యమకారుల విజయమే. కానీ, ఉద్యమం ఒక స్థాయికి చేరుకున్న తరువాత కేవలం సంకేతాత్మక విజయాలు సరిపోవు. వాస్తవమైన ఫలితాలు కావాలి. శుక్రవారం నాటి చర్చలలో ప్రభుత్వం సంయమనంతో, ఉదారంగా వ్యవహరించగలదని ఆశించాలి. పరిష్కారం కోరుకుంటున్నప్పుడు, ప్రజలతో పంతాలు పనికిరావు. శాంతియుతంగా వ్యవహరించాలని రైతుబిడ్డలకు ఎవరూ చెప్పనక్కరలేదు. ఇంతకాలం వారు తమ అశాంతిని ఎంత మృదువుగా, సత్యాగ్రహంతో వ్యక్తంచేశారో గమనిస్తే, వారిని ఎవరూ అనుమానించరు. ఢిల్లీ రైతు ముట్టడి ఆ రైతుల సొంత గొడవ కాదు. దేశంలోని అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలూ శ్రద్ధగా గమనిస్తున్న ఒక నమూనా.

Advertisement
Advertisement
Advertisement