చైనా చెలిమే మనకు శ్రేయస్కరమా?

ABN , First Publish Date - 2020-07-21T06:08:20+05:30 IST

ప్రపంచ ఆదాయంలో భారత్ వాటా 4 శాతం కాగా చైనా వాటా 15 శాతం. అమెరికా వాటా (25 శాతం) భారత్, చైనాల మొత్తం వాటా కంటే అధికం. ప్రపంచ ఆదాయంలో భారత్ వాటాలోని 1 శాతాన్ని 31 కోట్ల మంది వ్యక్తులు పంచుకుంటున్నారు...

చైనా చెలిమే మనకు శ్రేయస్కరమా?

మన జనాభాతో సమాన నిష్పత్తిలో ప్రపంచ ఆదాయంలో వాటా సాధించుకోవడమే ఇప్పుడు భారత్ ముందున్న సవాల్. మనం అమెరికా పక్షం వహిస్తే అధునాతన సాంకేతికతలు సమకూరుతాయనడంలో సందేహం లేదు. అయితే ఆ సహాయం సుదీర్ఘంగా అందుతుందని చెప్పలేము. చైనా వైపు మొగ్గితే తయారీ, సేవల రంగాలలో పరస్పర సహాయసహకారాలు సుసాధ్యమవుతాయి. ప్రపంచ మార్కెట్లు మనకు అందుబాటులోకి వస్తాయి.


ప్రపంచ ఆదాయంలో భారత్ వాటా 4 శాతం కాగా చైనా వాటా 15 శాతం. అమెరికా వాటా (25 శాతం) భారత్, చైనాల మొత్తం వాటా కంటే అధికం. ప్రపంచ ఆదాయంలో భారత్ వాటాలోని 1 శాతాన్ని 31 కోట్ల మంది వ్యక్తులు పంచుకుంటున్నారు; చైనా వాటాలో 1 శాతాన్ని 9 కోట్ల మంది వ్యక్తులు భాగస్వాములు కాగా అమెరికా వాటాలో 1 శాతం 1.3 కోట్ల మంది వ్యక్తులకు సంప్రాప్తమవుతున్నది. ప్రపంచ ఆదాయంలో మన జనాభాతో సమాన నిష్పత్తిలో వాటాను సాధించుకోవడమే ఇప్పుడు భారత్ ముందున్న సవాల్. మరి ఇదెలా సాధ్యమవుతుంది? అమెరికాకు వ్యతిరేకంగా చైనా పక్షం ద్వారా లేక చైనాకు వ్యతిరేకంగా అమెరికా కొమ్ము కాయడం వల్ల సుగమమవుతుందా? ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిద్దాం. 


అమెరికాకు మద్దతునిచ్చి ఆ దేశంతో స్నేహాన్ని నెరపడం వల్ల మనకు అత్యాధునిక సాంకేతికతలు లభ్యమవుతాయి. ‘ప్రపంచ మేధా సంపత్తి హక్కుల సంస్థ’లో చైనా నమోదు చేసిన పేటెంట్ల సంఖ్య అమెరికా నమోదు చేసిన పేటెంట్ల సంఖ్య కంటే అధికంగా ఉన్న మాట నిజం. అయితే కొత్త సాంకేతికతల అభివృద్ధిలో అమెరికాయే ఇప్పటికీ అగ్రగామిగా ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 2019 సంవత్సరంలో అమెరికా దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య 58,000 కాగా చైనా దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య 59,000. మన దేశం దాఖలు చేసిన పేటెంట్ల దరఖాస్తులు 30,000 మాత్రమే. దశాబ్దాలుగా సృష్టించిన నవ సాంకేతికతల, అభివృద్ధిపరిచిన వినూత్న సాంకేతికతల సంచితం అమెరికా ఆస్తి. ఈ ఎనలేని ఆస్తి ప్రాతిపదికన అధునాతన సాంకేతికతల సృష్టిలో ఆ దేశం ఇప్పటికీ అగ్రగామిగా ఉన్నది. 


మరి అమెరికాను కాదని చైనా పక్షం వహించడం వల్ల మనకు నవీన సాంకేతికతలు ఏవీ అందుబాటులోకి రావు. చైనా తాను అభివృద్ధి చేసిన సాంకేతికతలను చాలవరకు తనకు మాత్రమే సంరక్షించుకోవడం కద్దు. మరి ఈ రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఎక్కడ, ఎలా సాధ్యమవుతుంది? తయారీరంగంలో చైనా ప్రపంచ అగ్రగామి. సేవల రంగంలో భారత్ అంతర్జాతీయ మేటి. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, మెడికల్ ట్రాన్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్స్, టైప్ సెట్టింగ్ మొదలైన అధునాతన సేవలను భారత్ అద్వితీయంగా అందిస్తోంది. చైనా తయారీరంగ శక్తి సామర్థ్యాలను భారత్ సేవల ప్రతిభా పాటవాలను మేళవిస్తే అమెరికాపై ఈ రెండు ఆసియా దేశాలు పై చేయి సాధించడం సుసాధ్యమవుతుంది. అమెరికాతో నెయ్యం నవ సాంకేతికతలను ఇస్తే, చైనాతో చెలిమి ప్రపంచ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెస్తుంది.


చైనా, అమెరికాల మధ్య ఓ ముఖ్యమైన తేడా రుణానికి సంబంధించినది. అమెరికాకు చైనాభారీ మొత్తంలో రుణాలను సమకూరుస్తున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసిన ట్రెజరీ బాండ్లలో 15 శాతాన్ని చైనాయే కొనుగోలు చేసింది. అమెరికా ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున మదుపులు చేసింది. ఆ దేశాలు కూడా అమెరికాకు భారీ రుణాలనందిస్తున్నాయి. రుణదాత, రుణ గ్రహీత కంటే ఆధిక్యంగా ఉండడం సహజం కదా. ఈ లెక్కన అమెరికా కంటే చైనాయే ఆర్థిక సత్తువలో ఆధిక్యంగా ఉన్నదని చెప్పక తప్పదు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే అమెరికా రుణభారం శీఘ్రగతిన పెరుగుతోంది. తత్ఫలితంగా సాంకేతికతల సృష్టిలో అమెరికా తన అగ్రగణ్యతను కోల్పోతోంది. ఆర్థిక శక్తి సామర్థ్యాలూ దిగసిల్లిపోతున్నాయి. ఇదే సమయంలో ఈ రెండు అంశాలలోనూ చైనా మున్ముందుకు దూసుకుపోతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికా ప్రాభవం క్షీణ ముఖం పట్టగా చైనా వైభవం మధ్యాహ్న మార్తాండుడిలా వెలిగిపోతోంది. అమెరికా గత వంద సంవత్సరాలలో మొత్తం 26 యుద్ధాలు చేసింది. -అన్నీ తన సరిహద్దులకు సుదూరాన ఉన్న దేశాలతోనే. చైనా కేవలం ఆరు యుద్ధాలు మాత్రమే చేసింది. ఇవన్నీ ఇరుగు పొరుగుదేశాలతోనే. ఒక్క టిబెట్ మినహా మరే దేశాన్ని చైనా పూర్తిగా ఆక్రమించుకోలేదు.


ఇదిలావుంటే అమెరికా మనకు అందించిన సహాయ సహకారాలు తక్కువేమీ కాదన్న సత్యాన్ని మనం అంగీకరించి తీరాలి. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ అమెరికా వెళ్ళి, జర్మనీపై యుద్ధంలో తమకు సహాయాన్ని అందించాలని అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్‌ను అభ్యర్థించాడు. యుద్ధం ముగిసిన తరువాత భారత్ మొదలైన వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం ప్రసాదించడానికి బ్రిటన్ అంగీకరిస్తేనే జర్మనీకి వ్యతిరేకంగా తోడ్పాటు నిస్తామని రూజ్వెల్ట్ షరతు విధించారు. ఈ నైతిక మద్దతును మనం విస్మరించలేము. 1960 దశకంలో మనం దేశంలో కరువుకాటకాల బారినపడినప్పుడు పిఎల్ 480 కార్యక్రమం కింద అమెరికా మనకు విరివిగా ఆహారధాన్యాలను సరఫరా చేసింది. నౌక నుంచి నోటికి అన్న చందంగా వుండేది ఆనాటి మన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆహారోత్పత్తిలో మనం సంపూర్ణంగా స్వావలంబన సాధించాము. చమురు దిగుమతులు మన ఆర్థిక వ్యవస్థపై అనివార్యంగా పెను భారాన్ని మోపుతున్నాయి. ఇరాన్‌ను నిర్లక్ష్యం చేసి అమెరికా పక్షం వహిస్తుండడం వల్ల మనం చమురు దిగుమతులకు మరింత అధికంగా వెచ్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 


టిబెట్ 1368–-1544 మధ్య కాలంలో చైనాలో భాగంగా కాక స్వతంత్రంగా ఉన్నదని, 1644-–1912 మధ్య కాలంలో చైనాకు సామంత రాజ్యంగా ఉన్నదని చైనా చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసిన వారు నిర్ధారించారు. 1912 నుంచి 1950 దాకా టిబెట్ మళ్ళీ సంపూర్ణ స్వాతంత్ర్యంతో విలసిల్లింది. కమ్యూనిస్టు రాజ్యంగా ఆవిర్భవించిన చైనా 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్నది. 1912–-50 మధ్య స్వాతంత్ర్యం వెర్రితలలు వేసిన కారణంగానే టిబెట్‌ను మళ్ళీ తమలో అంతర్భాగం చేసుకోవడం జరిగిందని కమ్యూనిస్టు చైనా తన చర్యను సమర్థించుకున్నది. ఏమైనా 1912కి పూర్వం దాదాపు మూడు శతాబ్దాల పాటు టిబెట్ స్వతంత్రంగా లేదన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం.


ఇక ఇప్పుడు 1962లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు యుద్ధం విషయాన్నిచూద్దాం. ఆ యుద్ధంలో మనం పరాజయం పాలవ్వడానికి కారణమేమిటి? బ్రిటిష్ పాత్రికేయుడు నెవిల్ మ్యాక్స్‌వెల్ 1962 యుద్ధం పూర్వాపరాలపై ‘ఇండియాస్ చైనా వార్’ అనే వివాదాస్పద పుస్తకం నొకదాన్ని రాశాడు. ఆనాటి మన రక్షణ మంత్రి వి.కె. కృష్ణమీనన్ అనుసరించిన ‘ఫార్వార్డ్ పాలసీ’ యే భారత్ పరాభవానికి కారణమయిందని విపులంగా నిరూపించాడు. సరిహద్దు ప్రాంతాలలో ఏ భూభాగాలు ఏ దేశానివో స్పష్టంగా నిర్ధారించని ప్రాంతాలలోకి, కృష్ణ మీనన్ విధానం మేరకు, భారత సైనికదళాలు చొచ్చుకుపోవడం వల్లే చైనా మనపై యుద్ధానికి వచ్చిందన్నది ఆ బ్రిటిష్ పాత్రికేయుని వాదన. 


మనం అమెరికా పక్షం వహిస్తే మనకు అధునాతన సాంకేతికతలు సమకూరుతాయనడంలో సందేహం లేదు. అయితే ఆ సహాయం ఎంతకాలం అందుతుంది? సుదీర్ఘంగా అందుతుందని నిశ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా మనం అమెరికా విధానాలను నిరంతరం సమర్థించవలసివుంటుంది. మన ఆర్థిక ప్రయోజనాలను సైతం త్యాగం చేయడం అనివార్యమవుతుంది. మరి చైనా చెలిమితో తయారీ, సేవల రంగాలలో పరస్పర సహాయసహకారాలు సుసాధ్యమవుతాయి. ముందే చెప్పినట్టు ప్రపంచ మార్కెట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అయితే స్నేహం అనేది సమస్కంధుల మధ్య మాత్రమే వికసిస్తుందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఈ దృష్ట్యా మనం ముందు మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. చైనీస్ సరుకుల పై భారీ దిగుమతి సుంకాలు విధించాలి. మన పరిశోధనా సామర్థ్యాలను పటిష్ఠం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చైనాతో స్నేహాన్ని నెరపాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-07-21T06:08:20+05:30 IST