న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన కెప్టెన్ అమరీందర్ సింగ్ షెడ్యూల్ ప్రకారం మంగళవారంనాడు ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. తన పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన కలుసుకునే అవకాశ ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను రాజీనామా చేయించడం ద్వారా అవమానించిందనే అభిప్రాయంతో కెప్టెన్ ఉండటం, తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామంటూ బీజేపీకి చెందిన పలువురు నేతలు ఫీలర్లు వదలడంతో కెప్టెన్ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈనెల 18న కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను పార్టీ పిలిపించడం ఇది మూడోసారని, తనపై అపనమ్మకం ఉందంటే అది తనను అవమానించడమేనని కెప్టెన్ వ్యాఖ్యానించారు. ఆ వెనువెంటనే బీజేపీ నేతల నుంచి వరుస ప్రకటనలు వెలువడ్డాయి. బీజేపీతో చేతులు కలపాలంటూ హర్యానా హోం మంత్రి అనిల్ విజ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ తుగ్ ఆహ్వానం పలికారు. తనను అవమానించి కాంగ్రెస్‌కు కెప్టెన్ ఉద్వాసన చెప్పి ఎన్డీఏతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సూచించారు. ఎన్డీయేలోని ప్రతి ఒక్కరికీ సమప్రాధాన్యం ఉంటుందని, పంజాబ్‌లో ఎన్డీయేను అధికారంలోకి తీసుకు రావడానికి కెప్టెన్ పలుకుబడి ఉపయోగపడుతుందని అన్నారు.