Apr 23 2021 @ 14:13PM

అనుకున్న ప్రతీసారీ.. అదే జరుగుతోంది..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌కి మోక్షం కలగడం లేదు. అఖిల్ నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. డెబ్యూ సినిమా 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు నటించిన అఖిల్‌కి.. ఈ మూడు సినిమాలలో ఒక్కటి కూడా మంచి హిట్ సినిమాగా నిలవలేకపోయింది. దాంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా మీద చాలానే నమ్మకాలు పెట్టుకున్నాడు అఖిల్. వాస్తవంగా అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. 

కానీ కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల అనుకున్న ప్రతీసారీ రిలీజ్ డేట్ మార్చాల్సి వస్తోంది. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ఫస్ట్ వేవ్ బ్రేక్ వేసింది. దాంతో షూటింగ్ దశలో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత విజయదశమి పండుగ సందర్భంగా ప్లాన్ చేశారు. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ జరగకపోవడంతో 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ జనవరి నుంచి ఏప్రిల్..ఏప్రిల్ నుంచి ఫైనల్‌గా జూన్ 19కి రిలీజ్ డేట్ లాకయింది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి జూన్ 19న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా. కాగా అఖిల్ కెరీర్‌లో 5వ సినిమా 'ఏజెంట్' టైటిల్‌తో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన అఖిల్ ఫస్ట్ లుక్‌తో సినిమా మీద బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.