పెట్రోలు, డీజిల్ ధరలపై శుభవార్త రాబోతోందా?

ABN , First Publish Date - 2021-03-03T01:10:14+05:30 IST

పెట్రోలు, డీజిల్ ధరలు వారం, పది రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది

పెట్రోలు, డీజిల్ ధరలపై శుభవార్త రాబోతోందా?

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు వారం, పది రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి వీటి ధరలు పెరుగుతూ పోతుండటంతో సామాన్యులు కోపాన్ని దిగమింగుతూ, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. దాదాపు 10 నెలల నుంచి క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై భారం మోపక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ పరిస్థితిలో కొంచెం మార్పు రాబోతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సామాన్యులపై పెట్రోలు, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.  పది నెలల నుంచి క్రూడాయిల్ ధరలు రెట్టింపు అయ్యాయని, దీంతో రిటెయిల్ ధరలు పెంచక తప్పడం లేదని ప్రభుత్వం చెప్తోంది. రిటెయిల్ ధరలో సుమారు 60 శాతం వరకు పన్నులు, సుంకాలు ఉంటాయి. వీటిని తగ్గించేందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నారు. కేంద్రం ఆదాయం పెద్దగా దెబ్బతినకుండా, సామాన్యులకు అందుబాటులో పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఆయిల్ కంపెనీలతోనూ చర్చలు ప్రారంభమయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలను నిలకడగా ఉంచేందుకుగల మార్గాల గురించి చర్చ జరుగుతోంది. ఇంచుమించుగా మరొక 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


పన్నుల విధానంలో మరోసారి మార్పులు అవసరం లేకుండానే, పన్నుల్లో కోత విధించక ముందే చమురు ధరలు స్థిరంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ, ఇంధనంపై పన్నులు ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై పన్నుల తగ్గింపు గురించి చర్చలు జరపాలన్నారు. 


మరోవైపు మరికొద్ది రోజుల్లో చమురు ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్), ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల సమావేశం జరగబోతోంది. చమురు ఉత్పత్తిపై ఆంక్షలను సడలించడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం వెలువడితే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కచ్చితంగా ఉంటుంది. 


క్రూడాయిల్ వినియోగంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కాబట్టి చమురు ఉత్పత్తులపై ఆంక్షలను సడలించి, ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ దేశాలను కోరింది. 


Updated Date - 2021-03-03T01:10:14+05:30 IST