Abn logo
Sep 21 2021 @ 00:09AM

ఉల్లిపై మళ్లీ కిరికిరి

  1. నాణ్యత ఉంటేనే కొంటాం
  2. వ్యాపారుల తీరుతో రైతుకు నష్టం 
  3. రోజుకు వెయ్యి క్వింటాళ్ల తిరస్కరణ
  4. యార్డులో కుళ్లిపోతున్న ఉల్లి నిల్వలు
  5.  క్వింటం రూ.100 ప్రకారం అమ్మకం
  6.  మొత్తం దిగుబడి కొనేదాకా రావద్దు
  7.  ఉల్లి రైతులకు కమీషన ఏజెంట్ల సూచన


 - కర్నూలు(అగ్రికల్చర్‌) 

గూడూరుకు చెందిన ఈ రైతు పేరు రామాంజినే యులు. ఈయనకు ఐదుగురు కూతుళ్లు. కుటుంబాన్ని పోషించుకునేందుకు సొంతూరు వదిలి కల్లూరుకు వలస వచ్చాడు. నాయకల్లులో ఎకరా రూ.15 వేల ప్రకారం ఐదెకరాలను కౌలుకు తీసుకున్నాడు. దాదాపు రూ.86 వేలు ఖర్చు చేసి ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం కోత కోసి పొలంలోనే నిల్వ చేశాడు. మార్కెట్‌లో ధర ఎంత ఉందో తెలుసుకునేందుకు శనివారం కర్నూలు యార్డుకు వచ్చాడు. యార్డులో విక్రయాలు జరగడం లేదని, ఉల్లిని యార్డుకు ఇప్పుడే తీసుకురావద్దని కమీషన ఏజెంట్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. వర్షం వస్తే ఉల్లి గడ్డలు తడిసి కుళ్లిపోతాయని, అప్పులపాల వుతానని ఆందోళ చెందుతున్నాడు. మార్కెట్‌ యార్డులో ఉల్లి కొనుగోళ్లు మళ్లీ ఎప్పుడు మొదలు పెడుతారోనని ఎదురు చూస్తున్నాడు. అధికారులను అడిగితే.. వ్యాపారులతో చర్చలు జరిపి, ఉల్లి కొనుగోళ్లను త్వరలోనే ప్రారంభిస్తామని అంటున్నారని, జాప్యం జరి గితే దిగుబడులు మట్టిపాలవుతాయని వాపోతున్నాడు. జిల్లాలో వేలాది మంది రైతులు ఉల్లి సాగు చేసి పడరాని కష్టాలు పడుతున్నారు. ఏదో ఒక కారణంతో కర్నూలు యార్డులో ఉల్లి విక్రయాలు పదే పదే నిలిచిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


రైతుల్లో ఆందోళన

జిల్లాలో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారు. ఆగస్టులోనే ఈ పంట చేతికి అందింది. ఆదిలోనే హంసపాదు అన్నచందంగా ఈనామ్‌ పద్ధతిపై వివాదం తలెత్తింది. దాదాపు నెల రోజులు ఉల్లి లావాదేవీలు నిలిచిపోయాయి. రైతులు మరోదారి లేక వీధుల్లో తిరిగి అమ్ముకున్నారు. క్వింటానికి రూ.400-500 కూడా దక్కలేదు. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఈ నామ్‌ పద్ధతికి వ్యాపారులను ఒప్పించారు. కానీ నాణ్యమైన ఉల్లినే కొనుగోలు చేస్తామని వ్యాపారులు షరతు పెట్టారు. ఇదే ఇప్పుడు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. యార్డులో రోజూ 3 వేల నుంచి 6 వేల క్వింటాళ్ల ఉల్లిని రైతులు కర్నూలు యార్డుకు తెస్తున్నారు. ఇందులో నాణ్యత లేదని రోజూ వెయ్యి క్వింటాళ్ల దాకా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. రైతులు ప్రశ్నిస్తే.. నాణ్యత లేని ఉల్లిని కొని  ఏం చేయాలని వ్యాపారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వ్యయప్రయాసల కోర్చి యార్డుకు తెచ్చిన ఉల్లిని కొనుగోలు చేయకుండా వ్యాపారులు మొండికేస్తున్నారని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వెనక్కి  తీసుకుపోలేక చిల్లర వ్యాపారులకు క్వింటం రూ.100 నుంచి రూ.150కి అమ్మి నష్టపోతున్నారు. రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. అధికారులు వ్యాపారులకే మద్దతుగా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నాణ్యమైన ఉల్లినే కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పుడు తాము అడ్డుకునే అవకాశం లేదని తేలిపోతున్నారు. 


 రోజూ మిగిలిపోతున్నాయి

కర్నూలు మార్కెట్‌ యార్డులో బహిరంగ వేలం విధానం అమలులో ఉన్నప్పుడు రైతులు తెచ్చిన ఉల్లినంతటినీ ఏదో ఒక ధరకు కొనుగోలు చేసేవారు. ఈనామ్‌ పద్ధతి వచ్చాక నాణ్యమైన దిగుబడినే కొంటామని మొండికేస్తున్నారు. ఈ నామ్‌ పద్ధతి వ్యాపారులకే అనుకూలంగా మారిందని కమీషన ఏజెంట్లు అంటున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 లాట్ల దాకా (దాదాపు 1000 క్వింటాళ్లు) ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని, ఈ ఉల్లిని ఎక్కడ అమ్మాలో దిక్కుతోచక చిల్లర వర్తకులకు రూ.100 నుంచి రూ.150కి అమ్మాల్సిన పరిస్థితి దాపురించిందని కమీషన ఏజెంట్లు అంటున్నారు. ఉల్లి రైతులకు తాము రూ.లక్షల్లో రుణాలు ఇచ్చామని, రైతులు తెచ్చిన ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేయకపోతే తమ రుణాలను ఎలా తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే సమస్య పరిష్కారం అయ్యేవరకూ కర్నూలు యార్డుకు దిగుబడులు తీసుకురావద్దని రైతులకు చెప్పామని అంటున్నారు. ప్రస్తుతం కర్నూలు యార్డులో వ్యాపారులు కొనేందుకు తిరస్కరించిన దిగుబడులు 1000 క్వింటాళ్ల దాకా ఉన్నాయి. ఈ ఉల్లి రోజులు గడిచేకొద్దీ కుళ్లిపోతున్నాయి. అధికారులు బయట పారబోసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. 

ఇప్పట్లో పరిష్కారమయ్యేనా..? 

మార్కెట్‌ యార్డులో తాజా పరిస్థితుల నేపథ్యంలో కమీషన ఏజెంట్లు కూడా నష్టపోతున్నారు. అందుకే దిగుబడులను యార్డుకు తీసుకురావద్దని రైతులకు చెబుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, తెచ్చిన ఉల్లిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చిన తర్వాత యార్డుకు ఉల్లిని తీసుకురావాలని కమీషన ఏజెంట్లు రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఈ నెల 17 నుంచి రైతులు యార్డుకు ఉల్లిని తేవడం లేదు. సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

ధర పూర్తిగా తగ్గించేశారు.. 

రెండెకరాల్లో ఉల్లిని సాగు చేశాను. క్వింటానికి రూ.600 మాత్రమే చేతికి అందాయి. పంట సాగు కోసం లక్షన్నరదాకా ఖర్చు చేశాను. పెట్టుబడి డబ్బులు కూడా తిరిగి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. బహిరంగ వేలం ద్వారా మాకు కొంతైనా న్యాయం జరిగేది. 

- బతుకన్న, రైతు, నెరవాడ


బహిరంగ వేలమే మేలు..

బహిరంగ వేలంలో ఉల్లి కొనుగోలు జరిగేటప్పుడు రైతులకు న్యాయం జరిగేది. రైతులు తెచ్చిన సరుకునంతటినీ వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఈనామ్‌ పద్ధతి వల్ల రైతులు చాలా మంది నష్టపోతున్నారు. నాణ్యత లేదనే నెపంతో వ్యాపారులు చాలామంది రైతుల నుంచి ఉల్లిని కొనడం లేదు. దీని వల్ల రోజూ వెయ్యి క్వింటాళ్లకు పైగానే ప్లాట్‌ఫారాలపై ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితి మెరుగు పడి రైతులకు న్యాయం జరగాలంటే బహిరంగ వేలం పద్ధతిని అమలు చేయాలి. అప్పటి దాకా రైతులు ఉల్లిని మార్కెట్‌ యార్డుకు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశాం. 

- కట్టా శేఖర్‌, కమీషన ఏజెంట్ల సంఘం కార్యదర్శి 


తొందరలోనే పరిష్కరిస్తాం

నాణ్యమైన ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి చిల్లర వర్తకులే దిక్కు అవుతున్నారు. కమీషన ఏజెంట్లు రైతులకు ఇచ్చిన అప్పులు రాబట్టుకునేందుకు ఉల్లికి అధిక ధర వచ్చే వరకు ఉల్లిని యార్డుకు తీసుకురావద్దని చెబుతున్నారు. దీనివల్ల 17వ తేదీ నుంచి రైతులు కర్నూలు యార్డుకు ఉల్లిని తీసుకురావడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వ్యాపారులను ఒప్పించి మొత్తం దిగుబడులు కొనేలా చూస్తాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.

 - జయలక్ష్మి, సెలెక్షన గ్రేడ్‌ సెక్రటరీ


పొలంలోనే.. 

ఈ రైతు పేరు ముల్లా ఉసేన. కోడుమూరు మండలం వర్కూరు. ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడులకు సుమారు రూ 1.5 లక్షలు అయింది. పంట చేతికి వచ్చాక ధరలు పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌యార్డులో వ్యాపారులు ఈనామ్‌ పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాడేపల్లి, హైదరాబాదు మార్కెట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లికి గిట్టుబాటు ధరలేక నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. సుదూర మార్కెట్లకు ఉల్లిని తీసుకెళితే లారీ బాడుగలు రావని రైతులు జంకుతున్నారు. పోని కర్నూలు మార్కెట్‌కు తరలించాలనుకున్నా కొనేనాథుడు లేడు. దళారులకు అమ్ముదామన్నా క్వింటం రూ 500 మొదలు రూ.700 మించి కొనుగోలు చేయడం లేదని ఉసేన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో పొలంలోనే ఉంచానన్నాడు. 

- కోడుమూరు(రూరల్‌)