ఖరీఫ్‌లో 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు

ABN , First Publish Date - 2022-05-20T06:57:53+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1.35 లక్షల ఎకరాలకు సాగునీరందించ బోతున్నామని కలెక్టర్‌ కె.వెంకట్రమణారెడ్డి వెల్లడించారు.

ఖరీఫ్‌లో 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు
ప్రసంగిస్తున్న కలెక్టర్‌

సాగునీటి సలహా బోర్డు సమావేశంలో కలెక్టర్‌


తిరుపతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1.35 లక్షల ఎకరాలకు సాగునీరందించ బోతున్నామని కలెక్టర్‌ కె.వెంకట్రమణారెడ్డి వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా సాగునీటి సలహా బోర్డు తొలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యుల సూచనల మేరకు తొలిసారిగా ఖరీఫ్‌ సీజనుకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కండలేరు జలాశయంలో ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ వుందన్నారు. అరణియార్‌ రిజర్వాయర్‌లో 1.386 టీఎంసీల జలాలుండగా జిల్లాలోని 2405 చెరువుల కింద 15.84 టీఎంసీల నీరు నిల్వ వుందని వివరించారు. అందుబాటులో వున్న ఈ నీటి వనరులతో రైతులు తమ పొలాలు సాగు చేసుకునే అవకాశముందన్నారు. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు బకాయిలను త్వరలో చెల్లించడం జరుగుతుందన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, కళ్యాణ్‌ చక్రవర్తి, ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ హరినారాయణరెడ్డి, ఎస్‌ఈ రామగోపాల్‌, డిప్యూటీ ఎస్‌ఈ గంగాధరరావు, ఈఈలు రమణారెడ్డి, సుబ్రమణ్యం, మదనగోపాల్‌, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.


నెల్లూరు-తిరుపతి నడుమ శాశ్వత నీటి కేటాయింపులు జరపాలి :వాకాటి 


 నెల్లూరు, తిరుపతి జిల్లాల నడుమ శాశ్వత ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరపాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. సాగునీటి సలహా బోర్డు సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.నెల్లూరు జిల్లా నుంచీ నీటిని విడుదల చేస్తేనే తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేటలతో పాటు సత్యవేడు నియోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు. దాన్ని దృష్టిలో వుంచుకుని శాశ్వత ప్రాతిపదికన రెండు జిల్లాల నడుమ నీటి కేటాయింపులు జరపాలని డిమాండ్‌ చేశారు.నీరిస్తాం పంటలు వేయండని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇదివరకే వేసిన పంటలకు సంబంధించి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదని విమర్శించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర అవినీతి జరుగుతోందని సాక్షాత్తూ వైసీపీ ఎంపీయే ఒప్పుకున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేయబట్టే కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాలకు ఇవాళ కృష్ణా జలాలు అందుతున్నాయని నారాయణరెడ్డి గుర్తు  చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గాలేరు-నగరి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ పథకం పూర్తయితేనే తిరుపతికి తాగునీరు, నగరి, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందే అవకాశముంటుందని స్పష్టం చేశారు. 

మంత్రుల డుమ్మా....మళ్ళీ నేడు సమావేశం

సాగునీటి సలహా బోర్డు తొలి సమావేశానికే మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణస్వామి, జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా గైర్హాజరయ్యారు.తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.అదే సమయంలో చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన సమావేశానికి ఇంఛార్జి మంత్రి ఉషశ్రీ, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై ఖరీఫ్‌కు సాగునీటి లభ్యత గురించి సమీక్షించారు.జిల్లాలో సాగునీటి రిజర్వాయర్ల పరిస్థితి ఏమిటి? నీటి నిల్వలెలా వున్నాయి? ఖరీఫ్‌లో పంటల సాగుకు నీటి నిల్వలు సరిపోతాయా? రిజర్వాయర్లు, చెరువులు, కాలువల మరమ్మతులు, నిధుల అవసరం, సాగునీటి కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు  గైర్హాజరు కావడం రైతాంగాన్నే కాకుండా అధికార వర్గాలను కూడా విస్మయానికి గురి చేసింది. ఈ పరిణామాలను ఆలస్యంగా గుర్తించిన మంత్రులు నష్ట నివారణ చర్యల్లో భాగంగా గురువారం జరిగిపోయిన సమావేశాన్ని తిరిగి శుక్రవారం మళ్ళీ జరపాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. దీంతో  శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం జరుగుతుందని జిల్లా యంత్రాంగం ప్రకటన జారీ చేసింది.

Updated Date - 2022-05-20T06:57:53+05:30 IST