Abn logo
Jun 20 2021 @ 00:19AM

సస్యశ్యామలమే లక్ష్యం

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, పక్కన స్పీకర్‌ తమ్మినేని, మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ లఠ్కర్‌ తదితరులు

 ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి

 ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

 కరకట్టల నిర్మాణానికిప్రతిపాదనలు : స్పీకర్‌ సీతారాం

 శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : మంత్రి అప్పలరాజు

 వాడీవేడిగా సాగునీటి సలహా మండలి సమావేశం

 వచ్చేనెల 8న వంశధార, మడ్డువలస కాలువల నీటి విడుదల

కలెక్టరేట్‌, జూన్‌ 19: జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారులకు సూచించారు. అదును.. పదును ఉన్నప్పుడే సాగునీటి పనులు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పార్టీ నాయకులు జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ మాట్లాడుతూ, నియోజకవర్గాల వారీగా సాగునీటి వివరాలను అందించడంలో ఎందుకు చొరవ చూపడంలేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. నేరడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకున్నారని, దీనిపై ఒడిశా ముఖ్యమంత్రికి ఏప్రిల్‌ 16న లేఖ రాసినట్లు తెలిపారు.  నేరడి ప్రాజెక్టుతో జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందన్నారు. ఖరీఫ్‌కు జూలై 8 నాటికి వంశధార, మడ్డువలస కాలువల నుంచి నీటిని విడుదల చేసేందుకు సలహా మండలి సభ్యులు నిర్ణయించారు.


కాలువ  పనులు పూర్తి చేయాలి

రైతులు పంటలు వేయకముందే సాగునీటి కాలువల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.  జిల్లా ప్రజాప్రతినిధుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి రౌతు సత్యనారాయణను సలహాదారుగా ఏర్పాటు చేశామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా జిల్లాలో 70వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు.  చుక్క నీరు కూడా వృథా కాకుండా ముఖ్యమంత్రి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.


 నీటి విడుదలకు ఒక విధానం ఉండాలి..

సాగునీటి విడుదలకు ఒక విధానం అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. ఒక ప్రణాళిక అంటూ లేకపోవడంతో శివారు ప్రాంతాలకు చుక్క నీరు కూడా రావడం లేదన్నారు. దీనివల్ల రైతులు నాట్లు వేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ, జిల్లాలో పలు జలవనరుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల వివిధ ప్రాజెక్టుల నుంచి పంటలకు నీరు విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న నిధులతో కాలువల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు, రెడ్డి శాంతిలు తమ ప్రాంతాల్లోని సాగునీటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.రఘువర్మ, కళింగ కోమట్ల కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.