తప్పని నిరీక్షణ

ABN , First Publish Date - 2020-05-31T09:32:35+05:30 IST

వర్షాధార మెట్ట భూములకు నెలవైన కళ్యాణదుర్గం ప్రాంతానికి కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఊరిస్తోంది.

తప్పని నిరీక్షణ

- ఊరిస్తున్న కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ 

-  రూ.300 కోట్ల కేటాయింపులేవీ?

-  పాలకులకు పట్టని వైనం

- కరువు రైతుకు శాపం


కళ్యాణదుర్గం, మే 30: వర్షాధార మెట్ట భూములకు నెలవైన కళ్యాణదుర్గం ప్రాంతానికి కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఊరిస్తోంది. నాలుగేళ్లుగా డీపీఆర్‌ దశలోనే రైతులను వెక్కిరిస్తోంది. శాశ్వత సాగునీటి వనరులు ఆవిరైన కరువు రైతుపై చొరవచూపని పాలకుల తీరు శాపమైంది. మరోవైపు ఇరిగేషన్‌, ఐడీసీ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో ప్రాజెక్ట్‌ కొండెక్కింది. 


15 వేల ఎకరాలకు నీరందించే ఆశయం

వరుస కరువులు, వర్షాభావంతో కుదేలైన కళ్యాణదుర్గం ప్రాంతంలోని రైతన్నలను గట్టెక్కించేందుకు గత టీడీపీ ప్రభుత్వం కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంకల్పించింది. అనుకున్నదే తడవుగా 2016 అక్టోబరులో ప్రాజెక్ట్‌ను మంజూచేసింది. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా కళ్యాణదుర్గం, కంబదూరు మండలాల పరిధిలోని 15 వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ కింద 0.49 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. ఆ వెంటనే సర్వే చేపట్టి పనులు ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.


పెన్నా నుంచి నీరివ్వలేమన్న సాకు 

ఈ ప్రాజెక్టు పనుల స్థితిగతులపై నీటి పారుదల, ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ శాఖ అధికారుల సమన్వయంతో నివేదికను ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలోని పెన్నానదిలో నీటి నిల్వ లేదని, ఈ పరిస్థితుల్లో నీటి సరఫరా చేయలేమని అప్పట్లో తప్పుడు నివేదిక సమర్పించారు. దీంతో ఈ ప్రక్రియ సకాలంలో ముందుకు సాగలేకపోయింది. దీన్ని గుర్తించిన అప్పటి ప్రజాప్రతినిధులు అధికారుల తప్పిదంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఆశాఖల ఈఎన్‌సీ (ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌) అధికారులకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అదే ఏడాది నెల రోజుల పాటు ఆయా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు పైప్‌లైన్‌ ఏర్పాటు, నీటి సరఫరా, ఈ ప్రాజెక్టు అమలైతే సుమారు 2వేల మంది రైతుల జీవనోపాధులు పెరుగుతాయని డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) అందజేశారు. 


నిధుల ఊసే లేదు..

కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులు పూర్తికావాలంటే రూ.300 కోట్ల నిధుల కేటాయింపు జరగాల్సి ఉంది. ఆ నిధులను భారీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వెచ్చించాలని గత ప్రభుత్వం ఆశాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అధికారుల సమన్వయ లోపంతోనే పనులు కార్యరూపం దాల్చలేదని తేటతెల్లమవుతోంది. శాశ్వత సాగునీటి పథకం అమలులో అధికార, పాలకవర్గాల నిర్లక్ష్యంతో ఈ ప్రాంత రైతుల కల నెరవేరకుండా పోతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిధులు రాబట్టి కరువు రైతుకు బాసటగా నిలవాల్సి ఉంది.

Updated Date - 2020-05-31T09:32:35+05:30 IST