Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాగునీటి ప్రణాళిక ఖరారు


సమావేశమైన ఉమ్మడి జిల్లా నీటి పారుదల సలహాబోర్డు
ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారు
మొత్తం 2లక్షల 66వేల 802ఎకరాలకు  సాగునీరు ఇవ్వాలని నిర్ణయం
యాసంగిలో ఆరుతడి పంటలను సాగుచేయాలన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల కింద యాసంగికి నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారైంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో పంటలను బట్టి ఆరు నుంచి పది తడుల వరకు నీటి విడుదల చేయనున్నారు. ఎత్తిపోతల పథకాల నీటి విడుదల షెడ్యూల్‌ను నీటి పారుదల సలహాబోర్డు ప్రకటించింది. ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లో నీటి లభ్యత ఆధారంగా ఈ నీటిని సాగుకు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులనుబట్టి పంట మార్పిడి చేసుకోవాలని బోర్డు సభ్యులు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్‌కు అనుగుణంగా నీటి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి జిల్లా నీటి పారుదల సలహాబోర్డు సమావేశాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.  ప్రాజెక్టుల నీటి నిల్వలపై చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరాం సాగర్‌, నిజాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు కౌలాస్‌నాలా, రామడుగు, పోచారం ప్రాజెక్టుల ఆయకట్టుపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేసే పంటలను అధికారుల ద్వారా వివరాలను తీసుకున్నారు. షె డ్యూల్‌ను ఆమోదం తెలిపి నీటి విడుదల తేదీలను ఖరారు చేశారు. రైతులు వేసే యాసంగి పంటల ఆధారంగా నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 2లక్షల 66వేల 802 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు.
ఈ విస్తీర్ణంకు 23.832 టీఎంసీల నీరు వినియోగించాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సూచించిన విధంగానే షెడ్యూల్‌ను ఖరారు చేసి ఈ నీటి విడుదల చేయనున్నామని బోర్డు సమావేశం లో ప్రకటించారు. రైతులు కూడా షెడ్యూల్‌ను పరిశీలించి పంటలు వేసుకోవాలని కోరారు.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌..
ఈ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో జిల్లాలో 43వేల 240 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాల్వ ద్వారా 9,182 ఎకరాలు, లక్ష్మి కాల్వ ద్వారా 25 వేల 763 ఎకరాలు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి 8297 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద లక్ష్మికాల్వకు డిసెంబరు 25 నుంచి నీటి విడుదలను చేయనున్నారు. మొత్తం 10 విడతల్లో నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. మే 19 వరకు ఈ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు నుంచి 3.797 టీఎంసీల నీటిని ఈ పంటల కోసం వినియోగించనున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఫుల్‌ రిజర్వాయర్‌ కెపాసిటీలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిజాంసాగర్‌ ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టు కింద సాగయ్యే ఆయకట్టుకు ఆరు విడతల్లో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రతీ విడతలో 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎనిమిది రోజుల పాటు నీటి విడుదల నిలిపివేయనున్నారు. డిసెంబరు 15 నుంచి ఏప్రిల్‌ 13వరకు ఈ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో లక్షా 15వేల 825 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు యాసంగిలో 8.900 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి డీ1 కాల్వ నుంచి డీ49 వరకు ఈ నీటి విడుదల కొనసాగించనున్నారు.
అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం
ఈ ఎత్తిపోతల పథకం కింద డిసెంబరు 18 నుంచి నీటి విడుదలను కొనసాగించనున్నారు. మొత్తం 4 విడతల్లో నీటి విడుదల కొనసాగించనున్నారు. ఏప్రిల్‌ 18 వరకు ఈ ఎత్తిపోతల పథకం కింద పంటలకు నీటి విడుదల కొనసాగిస్తారు. ఈ లిఫ్ట్‌కింద మొత్తం 47వేల 455 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. యాసంగిలో ఈ లిఫ్టు పరిధిలో 4.478 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం
ఈ లిఫ్ట్‌ కింద డిసెంబరు 28 నుంచి నీటి విడుదల కొనసాగించనున్నారు. మొత్తం ఏడు విడతల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 30 వరకు నీటి విడుదల కొనసాగించనున్నారు. ఈ లిఫ్ట్‌ పరిధిలో మొత్తం 35వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ యాసంగిలో ఈ లిఫ్ట్‌ కింద 3 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
కౌలాస్‌నాలా ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టు కింద డిసెంబరు 10 నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తం 7 విడతల్లో నీటి విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 6 వరకు ఈ నీటి విడుదల కొనసాగిస్తారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 9వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. మొత్తం 0.550 టీఎంసీలను వినియోగించనున్నారు.
రామడుగు ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టు ఆయకట్టుకు డిసెంబరు 27 నుంచి ఏడు విడతల్లో ఏప్రిల్‌ 28 వరకు నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తం 6100 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ యాసంగిలో మొత్తం 0.762 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
పోచారం ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టు ఆయకట్టుకు జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 20 వరకు 5 విడతల్లో సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10వేల 180 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. మొత్తం 1.520టీఎంసీలను వినియోగించనున్నారు.
ప్రాజెక్టుల కింద పంటలకు నీటిని అందిస్తాం : మంత్రి
ఈ ఏడాది భారీ వర్షాలు పడ్డాయని, ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిండకుండలా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నీటి సలహాబోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వానకాలంలో ధాన్యం కొనుగోలులో జిల్లా రాష్ట్రంలో ముందుందన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. యాసంగిలో కూడా అన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారులు చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదలకు ఆమోదం తెలిపామన్నారు. రైతులు షెడ్యుల్‌కు అనుగుణంగా ఏయే పంటలు అనులకూలమో వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల మేరకు వేసుకోవాలన్నారు. యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. వరి వేస్తే ముందుగానే మిల్లర్‌లతో బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, సాగునీటిశాఖ సీఈలు మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌, ఎస్‌ఈలు బద్రినారాయణ, కరుణాకర్‌, వాసంతి, ఆర్డీవోలు రాజేశ్వర్‌, రవి,శ్రీనివాస్‌, రాజాగౌడ్‌, శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డీసీఎంఏ చైర్మన్‌ మోహన్‌,నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement