పైడిగాయం!

ABN , First Publish Date - 2022-06-25T04:40:02+05:30 IST

పైడిగాం ప్రాజెక్టు సోంపేట మండలంలో మహేంద్ర తనయ నదిపై బాతుపురం-కొత్త బాతుపురం గ్రామాల మధ్యఉంది. దీని కింద ఖరీఫ్‌లో పదివేల ఎకరాల ఆయకట్టు ఉంది. పైడిగాం చానెల్‌

పైడిగాయం!
తితలీ తుపాను సమయంలో ప్రధాన విభాగాలు కొట్టుకుపోయిన దృశ్యం


ఈ సారీ సాగునీరు ప్రశ్నార్థకమే!
పైడిగాం కింద 10 వేల ఎకరాల ఆయకట్టు
తితలీలో కొట్టుకుపోయిన ప్రధాన విభాగం
కాలువలదీ అదే పరిస్థితి
తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టిన వైనం
(సోంపేట రూరల్‌)

పైడిగాం ప్రాజెక్టు సోంపేట మండలంలో మహేంద్ర తనయ నదిపై బాతుపురం-కొత్త బాతుపురం గ్రామాల మధ్యఉంది. దీని కింద ఖరీఫ్‌లో పదివేల ఎకరాల ఆయకట్టు ఉంది. పైడిగాం చానెల్‌ మరమ్మతుల కోసం 1999-2000లో రూ.1.35 కోట్లు, 2014-15లో రూ.9.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 3/2 నుంచి 6/2 వరకు గోడల నిర్మాణం, దిగువ భాగంలో కాంక్రీటు పనులు పూర్తి చేశారు. 0/0 నుంచి 0/6 వరకు కాలువకు రెండు వైపుల గోడలు నిర్మించాల్సి ఉంది. బాతుపురం వద్ద ఉన్న ఆనకట్ట ముఖద్వారం వద్ద ఉన్న 140 అడుగులు ఉన్న సపటా కేవలం 40 అడుగులు మాత్రమే ఉంది. మిగిలిన సపటా తితలీ తుఫాన్‌ సమయంలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కలెక్టరుగా ఉన్న నివాస్‌ ప్రాజెక్టును సందర్శించి తాత్కాలిక మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా పనులు పూర్తి కాలేదు. కాలువలలో పూడిక పేరుకుపోవడంతో ఈ ఏడాది కూడా శివారు భూములకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది.

- మహేంద్రతనయ నది ఒడిశాలో పుట్టి మన జిల్లాలో ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో నదిపై ఎక్కడికక్కడే ఒడిశా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు, చెక్‌ డ్యామ్‌లు నిర్మించడంతో ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన జలాలు అందడం లేదు. ప్రధానంగా పురియాసాయి డ్యామ్‌ నిర్మాణంతో మనకు రావాల్సిన 135 క్యూసెక్కులు రావడం లేదు. కేవలం 50 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. అదీ కూడా వర్షాకాలంలో మాత్రమే.

- ప్రస్తుతం బాతుపురం- కొత్త బాతుపురం గ్రామాల మధ్య ప్రాజెక్టు ఉంది. ఇది మన భూభాగానికి ఎగువ ప్రాంతం. అంతకంటే దిగువ ప్రాంతంలో కళింగదళ్‌ రిజర్వాయర్‌ మిగులు నీరు, చీకటి గెడ్డ వరద నీరు కలుస్తోంది. అదే దిగువ ప్రాంతంలోని లడ్డగుడ్డి వద్దకు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ అటు కళింగదళ్‌, ఇటు చీకటి గెడ్డ నీరు కలిసే అవకాశముంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేపడితే ఇచ్ఛాపురం నియోజకవర్గంతో పాటు పలాస నియోజకవర్గంలోని మందస మండల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరందుతుంది.

టెండర్లు కాగానే..
పైడిగాం ప్రాజెక్టు దుస్థితిని ప్రభుత్వానికి వివరించాం. ప్రతిపాదనలు తయారుచేసి పంపించాం. 2/2 వద్ద ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మించేందుకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు  ప్రారంభిస్తాం.
- మధుసూదన పాణిగ్రాహి, ఇరిగేషన్‌శాఖ ఏఈ





Updated Date - 2022-06-25T04:40:02+05:30 IST