ఇరిగేషన్‌ పురాతన భవనంలో పేలుడు పదార్థాలు

ABN , First Publish Date - 2021-07-27T06:28:40+05:30 IST

వికారాబాద్‌ జిల్లా, పెద్దేముల్‌ మండల కేంద్రం ఇరిగేషన్‌ పాతభవనంలో

ఇరిగేషన్‌ పురాతన భవనంలో పేలుడు పదార్థాలు
ఇరిగేషన్‌ పాత భవనంలో లభించిన పేలుడు పదార్థాలు, నాన్‌ ఎలక్ర్టానిక్‌ వైరు

  • 3 వేల డిటోనేటర్స్‌,1160 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం 
  • బాంబు డిస్పోజబుల్‌ టీం ద్వారా పరిశీలన
  • ఇరిగేషన్‌ అధికారులు నిల్వ పెట్టారా, లేక ఇతరులు పెట్టారా అనే కోణంలో విచారణ
  • పేలుడులో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం


తాండూరు : వికారాబాద్‌ జిల్లా, పెద్దేముల్‌ మండల కేంద్రం ఇరిగేషన్‌ పాతభవనంలో 3వేల డిటోనేటర్స్‌(పేలుడు), 1160 జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పెద్దేముల్‌ మండలంలో బ్యాగరి వెంకటయ్య నివాసంలో బాంబు పేలి తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. ప్రస్తుతం వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుపై సీఐ జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని పురాతన ఇరిగేషన్‌ భవనంలో బాంబు డిస్పోజల్‌ టీం ముం దుగా పరిశీలించింది. అనంతరం అక్కడ లభించిన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్స్‌ నాన్‌ ఎలక్ట్రికల్‌ ఫీజు వైర్‌ స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం పెద్దేముల్‌కు చెందిన రాజు, బ్యాగరి వెంకటయ్య పేలుడు పదార్థాల బాక్సులు రెండు చోరీ చేశారు. స్వాధీనం చేసుకున్న బాక్సుపై డేంజర్‌ అని రాసి ఉండటంతో రాజు ఇంట్లోవారు ఆ బాక్సును బావిలో పడేశారు. వెంకటయ్య మాత్రం తన ఇంట్లోనే పెట్టుకుని ఆదివారం వాటిని బండతో మోదే క్రమంలో అవి పేలి వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, పురాతన ఇరిగేషన్‌ భవనంలో ఉన్న పేలుడు పదార్థాలను తెచ్చామని వెల్లడించినట్లు తెలిపారు.



Updated Date - 2021-07-27T06:28:40+05:30 IST