సాగునీరు... సాగేదెలా...!

ABN , First Publish Date - 2022-05-18T06:05:23+05:30 IST

పంట పొలాలకు సాగునీరందించే ప్రధాన పంట కాల్వలతో పాటు పిల్ల కాల్వలు, సైడ్‌ ఛానల్స్‌ వ్యర్ధాలు, తూటు, గుర్రపుడెక్కతో పూడుకుపోయాయి. దీంతో ఖరీఫ్‌లో సాగునీరు సాగేదెలా అన్న సమస్య తలెత్తుతోంది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సాగును జూన్‌ ఒకటి నుంచి ప్రారంభిస్తామని, దానికనుగుణంగా నీరు విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు.

సాగునీరు... సాగేదెలా...!
గోపాలపురం లాకుల వద్ద అధ్వానంగా ఉన్న ప్రధాన పంట కాల్వ

  • వ్యర్ధాలతో పూడుకుపోతున్న ప్రధాన పంట కాల్వలు
  • తూటు, గుర్రపుడెక్కతో మూసుకుపోతున్న పిల్ల కాల్వలు
  • ఉపాధి కూలీలతో నామమాత్రంగా పనులు

రావులపాలెం రూరల్‌, మే 17: పంట పొలాలకు సాగునీరందించే ప్రధాన పంట కాల్వలతో పాటు పిల్ల కాల్వలు, సైడ్‌ ఛానల్స్‌ వ్యర్ధాలు, తూటు, గుర్రపుడెక్కతో పూడుకుపోయాయి. దీంతో ఖరీఫ్‌లో సాగునీరు సాగేదెలా అన్న సమస్య తలెత్తుతోంది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సాగును జూన్‌ ఒకటి నుంచి ప్రారంభిస్తామని, దానికనుగుణంగా నీరు విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అయితే జిల్లాలోని ప్రధాన పంటకాల్వల్లో తూటు, గుర్రపుడెక్క, ఇతర వ్యర్ధాలతో కొన్నిచోట్ల కాల్వలు పూడుకుపోయాయి. దీంతో సాగునీరు ముందుకు పారేదెలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధాన పంట కాల్వలకు అనుసంధానంగా ఉన్న పిల్ల కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కాగా పలుచోట్ల ఉపాధి కూలీలతో కాల్వల ఆధునికీకరణ పనులను నామమాత్రంగా చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నీటి సంఘాల ద్వారా పంట కాల్వల ఆధునికీకరణ, కాల్వ రేవుల నిర్మాణం, రిటైనింగ్‌ వాల్స్‌, పిల్ల కాల్వలకు చెక్‌ డ్యామ్‌లు నిర్మించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వల ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో అరకొరగా పనులు తప్ప కాల్వలు పూర్తిస్థాయిలో ఆధునికీకరణకు నోచుకోలేదు. దీంతో జిల్లాలోని ప్రధాన పంట కాల్వలు ఎక్కడ చూసినా వ్యర్ధాలు, చెత్తాచెదారాలతో దర్శనమిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఖరీఫ్‌ సీజను ప్రారంభమయ్యే దాకా కొనసాగితే పూర్తిస్థాయిలో సాగునీరందడం ప్రశ్నార్ధకమే. వర్షాధారంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు శివారు ప్రాంత రైతులు చెప్తున్నారు. మెయింటెనెన్స్‌ పేరిట కొంతమేర నిధులు కేటాయించి అక్కడక్కడా కాల్వల ఆధునికీకరణ పనులు చేపడుతున్నప్పటికీ గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదన్న విమర్శలున్నాయి. కాల్వల ఆధునికీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  


Updated Date - 2022-05-18T06:05:23+05:30 IST