రబీకి 26 టీఎంసీల నీరు

ABN , First Publish Date - 2020-11-28T06:39:45+05:30 IST

జిల్లాలోని ఆయకట్టుకు రబీ సీజన్‌లో 26 టీఎంసీల నీటిని కేటాయించాలని అధికారులు, మంత్రులు నిర్ణయించారు.

రబీకి 26 టీఎంసీల నీరు

కొత్త బ్యారేజీల నిర్మాణానికి త్వరలో టెండర్లు

వైకుంఠపురం, చోడవరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం

ఈ ఏడాది 1220 టీఎంసీల నీరు సముద్రం పాలు

జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో చర్చ


విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఆయకట్టుకు రబీ సీజన్‌లో 26 టీఎంసీల నీటిని కేటాయించాలని అధికారులు, మంత్రులు నిర్ణయించారు. జిల్లాలోని 1.55 లక్షల ఎకరాల్లోని పంటకు ఈ నీరు అందుతుంది. అదే విధంగా కృష్ణానదిపై మూడు కొత్త బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటికి టెండర్లను పిలవనున్నారు. విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు, జేసీ డాక్టర్‌ కె.మాధవీలత, జలవనరుల శాఖ ఈఈ కె.నరసింహమూర్తి, ఐడీసీ ఈఈ రంగనాథ్‌, వ్యవసాయ శాఖ జేడీ టి.మోహనరావు పాల్గొన్నారు. 


గడచిన ఏడాది 10,400 ఎకరాల ఆయకట్టుకు నీరందలేదు. ఈసారి ఈ భూములకూ సాగునీటిని అందించాలని నిర్ణయించారు. వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీ, చోడవరం, మోపిదేవిల వద్ద మరో రెండు బ్యారేజీలను నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల నీటి సామర్థ్యంతో కొత్త బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీకి దిగువ చోడవరం, మోపిదేవి ప్రాంతాల్లో రూ.204.37 కోట్ల వ్యయంతో నిర్మించే స్టేట్‌-1 పనులకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. రబీ సీజన్‌లో పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో మొత్తం 1,44,500 ఎకరాలకు  సాగునీటిని అందించాలని నిర్ణయించారు. 


డిసెంబరు ఆఖరిలోగా  పరిహారం : కొడాలి 

ప్రస్తుత వైపరీత్యం కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని డిసెంబరు 15వ తేదీ నాటికి అంచనా వేసి, ఆ నెలాఖరుకు రైతులకు పరిహారాన్ని అందజేస్తాం. ఈ ఏడాది రబీ సీజన్‌లో పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ, దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు రెట్టింపు స్థాయిలో నీరు అందుతుంది. రైతులు మార్చి 31వ తేదీ నాటికి చేతికి పంట వచ్చేలా సాగు చేయాలి. 


త్వరలోనే డెల్టా ఆధునికీకరణ : కలెక్టర్‌

తూర్పు డెల్టా పరిధిలోని పంట కాల్వలు, మురికి కాల్వల ఆధునికీకరణ పనులను త్వరలో చేపడతాం. దీనికి సంబంధించి రూ.2,180 కోట్లకు ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.1,518.42 కోట్లతో 109 పనులు చేపట్టాం. ఇప్పటి వరకు 75 శాతం పనులు పూర్తయ్యాయి. 

Updated Date - 2020-11-28T06:39:45+05:30 IST