రైతన్న కుదేలు

ABN , First Publish Date - 2021-11-30T05:44:16+05:30 IST

పలువురికి పట్టెడన్నం పెట్టే రైతన్నపై ప్రకృతి పగబట్టింది. అతివృష్టితో రైతన్న రెక్కల కష్టం వర్షార్పణం అయింది. గత గాయం మాన్పుకొని చేతిలో చిల్లి గవ్వలేకున్నా అప్పు

రైతన్న కుదేలు
వరదతో తోగూరుపేటలో నేలకొరిగిన వరి

తుఫాన్లతో కోలుకోలేని దెబ్బ

నిరుడు నివర్‌... ఇప్పుడు జవాద్‌

దెబ్బతిన్న బుడ్డశనగ, వరి, ఉల్లి, ఉద్యానపంటలు

రైతు కష్టం వర్షార్పణం

కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పలువురికి పట్టెడన్నం పెట్టే రైతన్నపై ప్రకృతి పగబట్టింది. అతివృష్టితో రైతన్న రెక్కల కష్టం వర్షార్పణం అయింది. గత గాయం మాన్పుకొని చేతిలో చిల్లి గవ్వలేకున్నా అప్పు చేసి ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన రైతన్న ప్రకృతి కోపానికి బలయ్యాడు. నిరుడు నివర్‌ తుఫాన రైతు కష్టాన్ని నేలపాలు చేస్తే ఈ ఏడాది జవాద్‌ తుఫాన కోలోకోలేని దెబ్బకొట్టింది. చేతికొచ్చిన పంట చేలోనే నేలపాలవడంతో రైతన్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. జవాద్‌ తుఫాన రైతులకు సుమారు రూ.404.20 కోట్ల పైగా నష్టం జరిగిందని అధికారుల ప్రాథమిక అంచనా . వాస్తవానికకి ఈ నష్టం రూ.600 కోట్ల పైగా ఉంటుందని చెబుతున్నారు. 


జవాద్‌ నష్టం అపారం

జిల్లాలో ఈ నెల మొదటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ సీజనలో సుమారు 27 వేల ఎకరాల దాకా వరి బోర్ల కింద సాగు చేశారు. ఈ పంటంతా కొన్ని చోట్ల కోత దశకు వచ్చింది. కోతలు కోస్తామనుకుంటున్న సమయానికి వర్షాలు మొదలవడంతో కోతలను వాయిదా వేసుకున్నారు. దీంతో చాలా చోట్ల పొలాల్లోనే వరి మోసులొచ్చి ఎందుకూ పనికిరాకుండా పోయింది. రబీలో సుమారు లక్ష ఎకరాల్లో బుడ్డశనగ సాగు చేస్తారు. అయితే మొలక దశలోనే ఈ పంట దెబ్బతింది. జవాద్‌ తుఫాన కారణంగా కరీఫ్‌, రబీ సీజనలో పంటలు 1,42,949 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. అలాగే 17,704 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. రూ.404.20 కోట్లు రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. జవాద్‌ దాడికి ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, రబీలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంతో తీవ్ర నష్టం వాటిళ్లింది. చాలా పొలాల్లో ఇసుక మేట వేసింది.


కోలుకోక ముందే 

గత ఏడాది కూడా రబీ సీజన రైతు తీవ్రంగా నష్టపోయాడు. నవంబర్‌లో వచ్చిన నిర్‌ తుఫాన రైతులను ముంచేసింది. వేరుశనగ, అరటి, బొప్పాయి, మామిడి, పత్తి తదితర పంటలు 1.20 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. సుమారు 135 కోట్ల మేర నష్టం సంభవించింది. గత ఏడాది తుఫాన నుంచి కోలుకోక ముందే ఈ ఏడాది జవాద్‌ రూపంలో ప్రకృతి పగపట్టింది. 


మళ్లీ భయం భయం 

జవాద్‌ తుఫాన పీడకళ మరువక ముందే మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జవాద్‌ దాడికి బుడ్డశనగ సుమారు 70 శాతం దాకా దెబ్బతింది. ఇప్పుడు అల్పపీడనం ద్వారా వర్షాలు కురుస్తుంటే అక్కడక్కడ ఉన్న మిగిలిన పంటలు కూడా వర్షార్పణమేనని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని వాగులు, వంకలు, నదులు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా చేరింది. 145 చెరువులు నిండాయి. 49 చెరువులు డేంజర్‌ స్థితికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే వర్షాలు పడితే ఆ చెరువులకు ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


జిల్లాలో వర్షం 

జిల్లావ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు 31.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడూరులో 88 మి.మీ. నమోదైంది. కడప నగరం వర్షాలకు మళ్లీ జలమయం అయింది. ఆర్టీసీ బస్టాండ్‌ టూ కోటిరెడ్డి సర్కిల్‌ వెళ్లే రహదారి, అంబేడ్కర్‌ సర్కిల్‌ టూ వై జంక్షన, వైజంక్షన టూ మినీ బైపాస్‌ మరికొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోరుమామిళ్లలో ఆర్టీసీ బస్టాండ్‌ పూర్తిగా జలమయమైపోయింది. కాపువీధి, కొత్తవీధిలో మోకాల్లోతు నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలసపాడు, కాశినాయన ప్రాంతంలో వర్షం రావడంతో సగిలేరు ఎల్‌ఎస్‌పీ డ్యాంకు 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ఎల్‌ఎస్‌పీ డ్యాంలో చెరువులన్నీ నిండడంతో ఆ నీటిని సగిలేరుకు వదిలేశారు. బి.కోడూరు మండలం రామచంద్రాపురంలో మూడు ఇళ్లు వర్షానికి కూలాయి. మైలవరం డ్యాం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని పెన్నాలోకి విడుదల చేశారు.


కడప డివిజనలో...

చెన్నూరులో 69.6 మి.మీ, కడప 57.8, వీరబల్లి 52.2, సీకేదిన్నె 47.6, కమలాపురం 47, వల్లూరు 45.6, ఖాజీపేట 41.4, రామాపురం, 40.8, టి.సుండుపల్లి 32.6, ఎల్‌ఆర్‌పల్లి 32.6, పెండ్లిమర్రి 29.6, ఎర్రగుంట్ల 29.4, సంబేపల్లి 23.6, రాయచోటి 20.6, వీఎనపల్లి 19.6, చిన్నమండెం 18.6, చక్రాయపేట18.4, గాలివీడులో 12.6 మి.మీ వర్షం కురిసింది.


రాజంపేట డివిజనలో... 

కోడూరులో 88 మి.మీ, అట్లూరు 85,  ఒంటిమిట్ట 82, సిద్ధవటం 75.8, చిట్వేలి 71.8, నందలూరు 57.4,  పుల్లంపేట 55.4, ఓబులవారిపల్లె 55, రాజంపేట 54, బీకోడూరు 47.8,  గోపవరం 35.8, పోరుమామిళ్ల 32.6, బిమఠం 27.6, కాశినాయన 19.8, కలసపాడులో 12.2 మి.మీ వర్షపాతం నమోదైంది.


జమ్మలమడుగు డివిజనలో...

మైదుకూరులో 39.5 మి.మీ, చాపాడు 24.3, మైలవరం 22.4, దువ్వూరు 21.6, వేంపల్లి 17.8, ప్రొద్దుటూరు 16.8, జమ్మలమడుగు 16.1, ముద్దనూరు 14.6, రాజుపాళెం 14.2, వేముల 14, పెద్దముడియం 13.6, తొండూరు 11.8, సింహాద్రిపురం 10.6 కొండాపురం 9.8,   పులివెందుల 8.8, లింగాలలో 5.8 మి.మీ వర్షం కురిసింది.   

Updated Date - 2021-11-30T05:44:16+05:30 IST