భూ బకాసురులకు రెవెన్యూ అండ

ABN , First Publish Date - 2020-02-20T10:07:40+05:30 IST

పోతునాయుడు పేటలో డీపీఎన్‌ రోడ్డుకు అనుకుని చెరువు కబ్జా చేసిన అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల

భూ బకాసురులకు రెవెన్యూ అండ

 చెరువు పోరంబోకు డి-పట్టాగా గుర్తింపు 

 పోరంబోకు భూమికి శిస్తు వసూలు

వెలుగు చూస్తున్న రెవెన్యూలో అక్రమాలు


సంతబొమ్మాళి, ఫిబ్రవరి 19: పోతునాయుడు పేటలో డీపీఎన్‌ రోడ్డుకు అనుకుని  చెరువు కబ్జా చేసిన అక్రమార్కులకు  రెవెన్యూ అధికారుల అండ దండలు ఉన్నాయనే  విమర్శలు  వినిపిస్తున్నాయి.  పోతునాయుడుపేటలోని సర్వే నెంబరు 316-డిలో ఆక్రమణలపై   ‘భూబకాసురులు’ శీర్షికతో ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. బాడిగండం చెరువులో భూ ఆక్రమణలకు రెవెన్యూ అధికారుల సాయం చేశారనడానికి ఒక్కో ఆధారం బయట పడుతోంది.  సర్వే నెంబరు 316- డిలో బారిగండం చెరువు అని నమోదు అయినప్ప టికీ.. ఆక్రమణదారుడి పేరిట అండగల్‌లో డి-పట్టాగా ఆన్‌లైన్‌లో నమోదై ఉంది. దీంతో రెవెన్యూ సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


చెరువులో ఎవరికీ ఎటువంటి పట్టాలు జారీ చేసే అవకాశం లేకున్నా.. ఆన్‌లైన్‌లో డి-పట్టాగా నమోదు వెనుక భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో  ఆక్రమణ దారుడు  డి-పట్టా చూపించకుండా..  పోయిందని  రెవెన్యూ అధికారుల ఎదుట చెబుతున్నట్లు తెలిసింది. ఆక్రమణదారుడి నుంచి రెవెన్యూ సిబ్బంది చెరువు డి-పట్టా సర్వే నెంబరు 316--డిలో భూమికి  శిస్తు కూడా వసూలు చేసినట్లు  సమాచారం. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై విచారణ చేస్తున్న రెవెన్యూ అధికారులకు చెరువు పోరంబోకుపై భూశిస్తు వసూలు చేయడంపై నివ్వెరపోతున్నారు.


ప్రస్తుతం భావనపా డులో పోర్టు నిర్మాణం అవుతున్న నేపథ్యంలో ఈ భూమి విలువ రూ.కోటికి పైగా మార్కెట్‌లో విలువ ఉండటంతో ఆ వ్యవహారం నుంచి తప్పించుకునేందు కు పైరవీలు జోరుగా చేస్తున్నట్లు  పలువురు అనుకుంటున్నారు.  ఇదిలా ఉండగా..  బాడిగుండం చెరువు ఆక్రమణ విషయం  కలెక్టర్‌కు  స్థానికులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.  కాగా.. చెరువు ఆక్రమణాదారునికి రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేసినా సదరువ్యక్తి అందుకోలేదు.


ఆక్రమణలో చెరువు పోరంబోకు                                                   

పోతునాయుడుపేట రెవెన్యూ గ్రూపులో సర్వేనెంబరు 316డి బాడిగండం చెరువు పోరంబోకు. సర్వే చేసి గుర్తించారు. చెరువు పోరంబోకుకు డి-పట్టాలు జారీ కావు. దీనిపై తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చాను.   

- బాలరెడ్డి, మండల సర్వేయర్‌, సంతబొమ్మాళి     

                                                                                             

ఆన్‌లైన్‌లో నమోదై ఉంది..                                                                                                             

పోతునాయుడుపేట బాడిగండం చెరువులో సర్వే నెంబరు 316డి ఆన్‌లైన్‌ అండగల్‌లో డి-పట్టాగా నమోదై ఉంది. నిబంధనలు ప్రకారం చెరువులో ఎవరకీ డి-పట్టాలు ఇవ్వం. ఆన్‌లైన్‌లో డి-పట్టాగా నమోదు అవ్వడంపై దర్యాప్తు చేస్తున్నాం. ఆక్రమణదారునికి నోటీసులు ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తా.

- పి.సోమేశ్వరరావు, తహసీల్దార్‌, సంతబొమ్మాళి

Updated Date - 2020-02-20T10:07:40+05:30 IST