రేషన్‌ దుకాణం కేటాయింపులో అక్రమాలు

ABN , First Publish Date - 2022-01-29T06:14:54+05:30 IST

రేషన్‌ దుకాణం కేటాయింపులో అక్రమాలు జరగాయని, వార్డుకు చెందిన మహిళా సంఘాలకే కేటాయించాలని చిన్నబోనాలకు చెందిన మహిళ సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు.

రేషన్‌ దుకాణం కేటాయింపులో అక్రమాలు
మహిళలకు వివరిస్తున్న తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌

సిరిసిల్ల టౌన్‌, జనవరి 28 : రేషన్‌ దుకాణం కేటాయింపులో అక్రమాలు జరగాయని, వార్డుకు చెందిన మహిళా సంఘాలకే కేటాయించాలని చిన్నబోనాలకు చెందిన మహిళ సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.  మహిళా సంఘాల సంభ్యులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద  మోహరించారు. రేషన్‌ దుకాణం మహిళా సంఘాలకే కేటాయించాలని సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలకు చెందిన సరస్వతి ఏరియా లెవల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మహిళలు సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. దీంతో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ మహిళలను సముదాయించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 10వ వార్డుకు చెందిన 38 స్వశక్తి  మహిళ సంఘాలు ఉన్నాయని, మా మహిళ సంఘాలకు రేషన్‌ దుకాణం ఇవ్వకుండా వేరే వార్డుకు చెందిన మహిళా సంఘానికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. నిన్న  వరకు తమ సంఘంలో ఉన్న మహిళ మరో సంఘంలో చేరి అధికారులతో కలిసి  దుకాణాన్ని సొంతం చేసుకుందని ఆరోపించారు. వెంటనే కేటాయించిన రేషన్‌ దుకాణంను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తాత్కాలికంగానే రేషన్‌ దుకాణం కేటాయించామని, త్వరలో ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాలతోపాటు 10వ వార్డు రేషన్‌ దుకాణానికి కూడా నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు.   అర్హత గలవారికే రేషన్‌ దుకాణాలు కేటాయించనున్నట్లు చెప్పారు.  దీంతో మహిళలు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు.  కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్‌ బోల్గం నాగరాజు, బాలకిషన్‌, సమైక్య అధ్యక్షురాలు అశ్విణి, ఎల్లవ్వ, లావణ్య, మహిళలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T06:14:54+05:30 IST