పంచాయతీ బదిలీల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2022-07-07T05:47:42+05:30 IST

డీపీఓ ప్రభాకర్‌ రావు పంచాయతీ విభాగంపై మంచి పట్టున్న అధికారి. కింది స్థాయి కేడర్‌ నుండి వచ్చిన ఉద్యోగి కావడంతో శాఖపై మంచి అవగాహన ఉంది

పంచాయతీ బదిలీల్లో అవకతవకలు
డీపీఓ కార్యాలయం ఫైల్‌ఫొటో

 లేవంటూనే కుప్పలు తెప్పలుగా బయటకొస్తున్న రీప్రొసీడింగ్స్‌

ఇకే రోజు రెండు ఆర్డర్లు ఎలా సాధ్యమో!

కలెక్టర్‌నే బురిడీ కొట్టించారా..?

శాఖపై డీపీఓ పట్టు, అవగాహన ఏమైందో?

అనంతపురం న్యూటౌన, జూలై6: డీపీఓ ప్రభాకర్‌ రావు పంచాయతీ విభాగంపై మంచి పట్టున్న అధికారి. కింది స్థాయి కేడర్‌ నుండి వచ్చిన ఉద్యోగి కావడంతో శాఖపై మంచి అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం శాఖలో జరిగిన సాధారణ బదిలీల పరిస్థితి చూస్తుంటే ఆయన సీనియార్టీ, అవగాహన ఏమైపోయాయని ఆ శాఖ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. దీన్ని బట్టే బదిలీల్లో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ కింది స్థాయి సిబ్బంది ప్రొసీడింగ్స్‌ తయారు చేశారనుకున్నా, కనీసం సంతకం చేసే సమయంలోనైన ఏమి ఉందో చూసుకోవాలి కదా!. దీనికి తోడు కలెక్టర్‌తో కూడా సంతకాలు చేయించారు. దీన్ని బట్టి చూస్తే కలెక్టర్‌ను కూడా బురిడీ కొట్టించారా? అన్న చర్చ జరుగు తోంది. పంచాయతీ సెక్రటరీల బదిలీల్లో భాగంగా జూన30 అర్ధరాత్రి వరకు బదిలీ ఉత్తర్వులు తయారీలో నిమగ్నం అయ్యారు. అనంతరం ఒక్కొక్కటిగా ఉత్తర్వులు బయటకు వచ్చాయి. జూలై 1వ తేదీకల్లా ఎవరి ఆర్డర్స్‌ వారికి అందా లి. అయితే చాలా మందికి ఆర్డర్స్‌ అందలేదు. అందిన వారిలో కొందరు తమకు నచ్చిన స్థానం రాకపోవడం, వారు కోరుకున్న ఆప్షన్సలో ఏ ఒక్కటీ రాకపోవడం జీర్ణించుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలను ఆశ్రయిం చారు. నాయకుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవడంతో రీప్రొసీడింగ్స్‌ దిశగా అధికారులు పావులు కదిపారు. అయితే 30వ తేదీనే రీప్రొసీడింగ్స్‌ కూడా ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు మొదట జారీ చేసిన ఉత్తర్వు ల్లో అన్ని వివరాలు నమోదు చేశారు. రీప్రొసీడింగ్స్‌లో మాత్రం సెక్రటరీ పేరు, మండలం మాత్రమే నమోదు చేశారు. మిగిలిన వివరాలు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటివి పదుల సంఖ్యలో బయటకు వస్తుండటంతో పాటు స్థానిక నాయకుల నుండి ఒత్తిడి మరింత పెరిగిపోయిందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఫలనా వారికి చేశావంట కదా ! మా వానికి ఎందుకు కాదు. చేయాల్సిందే అని నాయకులు మెడమీద కత్తి పెట్టినట్లు హెచ్చరికలు జారీ చేయడంతో డీపీఓ ప్రభాకర్‌రావు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయనకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేక స్థానిక నాయకులు నుంచి చీవాట్లు తిని బదిలీ వేటు వేయించుకోవాలని ఇలా చేస్తున్నారా? లేక డీపీఓ కింది స్థాయి అధికారులు, సిబ్బంది కావాలనే డీపీఓను ఇరుకున పడేయడానికి ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


చెప్పినట్లు వింటావా.. సెలవులో వెళతావా?

 జిల్లాలో పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన బదిలీల్లో స్థానిక నాయకులు ఒత్తిళ్లు తీవ్ర స్థాయికి చెరినట్టు చర్చ జరుగుతోంది. తన తప్పు ఏమి లేదు. తాను నిక్కచ్చిగా ఉన్నాని డీపీఓ ధీమాగా ఉన్నప్పటికి సిబ్బంది చేసిన తప్పిదాలతో ఆయన ఇరకాటంలో పడినట్లు అయింది. దీంతో ఓ ఎమ్మెల్యే ఏకంగా ఫోన చేసి మేము చెప్పినట్లు చేస్తావా..? లేదంటే సెలవులో వెళ్లిపోతావా? అని మందలించినట్లు తెలిసింది. మరో ఎమ్మెల్యే ఆయన సెలవులో వెళితే ఈ స్థానంలో మరెవరిని నియమించాలన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది.  


ఒకే రోజు రెండు ఉత్తర్వులు

 జిల్లాలోని పలువురు పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒకే రోజు రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డేటు మారకపోవడం ఒక తప్పిదం అయితే ఒక్కో ప్రొసీడింగ్‌లో ఒక్కోవిధంగా వివరాలు నమోదు చేయడం మరొకటి. భైరవానతిప్ప క్లస్టర్‌లో పని చేసే పంచాయతీ సెక్రటరీ అనిల్‌కుమార్‌ను శీర్పి క్లస్టర్‌ పంచాయతీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి అదే రోజే సవరణ ప్రొసీడింగ్స్‌ కింద బ్రహ్మసముద్రం క్లస్టర్‌ నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ పంచాయతీ ఏ క్లస్టర్‌ అన్నది కూడ వివరాలు నమోదు చేయలేదు. ఎందుకు ఇలా చేశారన్నది అర్థం కావడం లేదు. ఇలా రీప్రొసీడింగ్స్‌ జారీ చేసిన వారిలో ఓ పది మంది వరకు ఎక్కడా పోస్టింగ్‌ లేకుండా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కలెక్టర్‌ రీప్రొసీడింగ్స్‌కు అవకాశం లేదని డీపీఓకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే రీప్రొసీడింగ్స్‌లో ఒకే రోజు రెండు ఆర్డర్లపై కలెక్టర్‌ సంతకాలు ఉండటం పలు అనుమానాలకు దారీ తీస్తోంది.  


Updated Date - 2022-07-07T05:47:42+05:30 IST