పాత పోస్టాఫీసు ప్రాంతంలో పార్కింగ్ లేని కాంప్లెక్స్
- పార్కింగ్ స్థలం లేదు
- అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు
- అమలు కాని మాస్టర్ ప్లాన
- నిబంధనలకు తూట్లు
ఆదోని పట్టణం అక్రమ కట్టడాలకు చిరునామాగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించకుండానే కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన ప్రకారం రహదారి విస్తరణ కోసం వదలాల్సిన స్థలంలో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని కొన్ని వార్డులలో అనుమతి లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. మరికొన్ని వార్డులలో అనుమతి లేకుండా అదనపు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫుట్పాతలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అనుమతిలేని ప్లాట్లలో నిర్మాణాలు సాగుతున్నాయి.
- ఆదోని టౌన
కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల్లో పార్కింగ్ కోసం 20 శాతం స్థలం కేటాయించాలి. నిర్మాణదారులు పార్కింగ్ నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకుంటే పట్టణంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పోస్టాఫీసు ప్రాంతంలో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయలేదు. ఎంఎం రోడ్డులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన ఉన్న సందులో నిర్మాణంలో ఉన్న మరో కమర్షియల్ కాంప్లెక్స్‌ను కూడా పార్కింగ్ స్థలం లేకుండానే నిర్మిస్తున్నారు.
పట్టించుకొనే వారేరీ...?
పట్టణంలో పెద్ద నిర్మాణాల విషయంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి వార్డులో ఒక సచివాలయం ఉన్నా... నిర్మాణాలకు సంబంధించి ఒక వార్డు ప్లానర్ విధులు నిర్వహిస్తున్నా పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని నిర్మాణదారుల నుంచి కొందరు వార్డు ప్లానర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఇవి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.
అమలుకాని మాస్టర్ ప్లాన..
మాస్టర్ ప్లాన ప్రకారం రహదారి విస్తరణ కోసం స్థలం వదిలి నిర్మాణ పనులు చేపట్టాలి. కొందరు కనీసం సెట్ బ్యాక్ స్థలాలను కూడా వదలకుండా నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాల ప్రారంభంలోనే చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పాత పట్టణ ప్రాంతంలోని ప్రధాన రహదారుల్లో పెద్ద నిర్మాణాల్లో అయినా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పార్కింగ్ స్థలాలపై దృష్టి సారించాలి
పద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో పార్కింగ్ స్థలాలను ఖచ్చితంగా వదలాలి. ప్రస్తుతం పట్టణంలో పార్కింగ్ సమస్య విపరీతంగా ఉంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలం కాకుండా అధికారులు చూడాలి.
- ప్రకా్షజైన, మాజీ ఎమ్మెల్యే
అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు
పట్టణంలో గుర్తించిన అనధికార, అక్రమ కట్టడాలకు నోటీసులను జారీ చేస్తున్నాం. రెండు నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని వారిని ఊపేక్షించేది లేదు.
- ఆర్.జి.వి. కృష్ణ, మున్సిపల్ కమిషనర్