ఇనుప రథం.. విద్యుదాఘాతం!

ABN , First Publish Date - 2022-05-29T08:28:12+05:30 IST

రాములోరి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం రథాన్ని గదిలోకి చేర్చుతుండటం ప్రాణాలే తీసింది.

ఇనుప రథం.. విద్యుదాఘాతం!

లాగుతుండగా కరెంట్‌ వైర్లకు తగిలిన వైనం

ముగ్గురి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో విషాదం

దేవరకొండ, మే 28: రాములోరి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం రథాన్ని గదిలోకి చేర్చుతుండటం ప్రాణాలే తీసింది. రథం ఇనుముతో చేసింది కావడం.. అది పైన విద్యుత్తు వైర్లకు తగలడంతో దాన్ని లాగుతున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో ఈ విషాదం జరిగింది. ఆ ఊర్లో ఏప్రిల్‌ నెలలో సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అయితే రథాన్ని గుట్టపై ఉన్న ఆలయం వద్దే వదిలేశారు. ఆలయ కమిటీ నిర్వాహకుడు, గ్రామానికి చెందిన పసునూరి దయానందరెడ్డి, ఆ రథాన్ని గుట్టకింద ఉన్న గదిలో భద్రపరచాలని సూచించాడు. శనివారం గ్రామస్థుల్లో కొందరు తాళ్ల సాయంతో, ఇంకొందరు నేరుగా రథాన్ని చేతులతో పట్టుకొని లాగారు. ఈ క్రమంలో రథం.. పైన 11కేవీ సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు వైర్లకు తగలడంతో విద్యుత్తు సరఫరా అయింది. రథాన్ని లాగుతున్న వారిలో గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(35), పొగాకు మోహనయ్య(42), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(28) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వీరివెంట ఉన్న రాజబోయిన వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా గ్రామానికి చెందిన దాసరి సత్తయ్య, బక్క చిన్నయ్య, విఘ్నేష్‌, రాజబోయిన మల్లయ్య, వెంకటయ్య.. రథాన్ని తాళ్లతో లాగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.  

Updated Date - 2022-05-29T08:28:12+05:30 IST