Hajj యాత్ర కోసం: యూకే నుంచి Meccaకు 6,500 కిలోమీటర్ల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-07-11T16:32:39+05:30 IST

ఓ ఇరాకీ వ్యక్తి హజ్ కోసం యూకే నుంచి మక్కా నగరానికి చేరుకోవడానికి 6,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు....

Hajj యాత్ర కోసం: యూకే నుంచి Meccaకు 6,500 కిలోమీటర్ల పాదయాత్ర

ఇరాకీ వ్యక్తి సాహసం...

మక్కా (సౌదీ అరేబియా): ఓ ఇరాకీ వ్యక్తి హజ్ కోసం యూకే నుంచి మక్కా నగరానికి చేరుకోవడానికి 6,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు.ఇరాకీ-కుర్దిష్ మూలానికి చెందిన ఒక బ్రిటీష్ వ్యక్తి ఈ సంవత్సరం హజ్ చేయడానికి యూకే నుంచి కాలినడకన నడిచి మక్కా చేరుకున్నాడు.52 ఏళ్ల ఆడమ్ మొహమ్మద్ 10 దేశాల మీదుగా 6.500కిలోమీటర్ల దూరం నడిచి హజ్ చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది.  బ్రిటీష్ వ్యక్తి ఇంగ్లండ్‌ దేశంలోని వాల్వర్‌హాంప్టన్ నగరం నుంచి పాదయాత్ర ప్రారంభించి మక్కా చేరుకున్నాడు.ఆడమ్ మొహమ్మద్ నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్‌ దేశాల గుండా నడిచి సౌదీ అరేబియా దేశానికి చేరుకున్నాడు. 


దాదాపు 6,500 కిలోమీటర్ల దూరాన్ని 10 నెలల 25 రోజుల్లో కవర్ చేశారు. ఇతను 2021 వసంవత్సరం ఆగస్టు 1వతేదీన యూకేలో పాదయాత్ర ప్రారంభించి గత నెలలో సౌదీ అరేబియా చేరుకున్నాడు.ఆడమ్ ప్రతిరోజూ సగటున 17.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఇస్లాం పారాయణాం చేస్తూ ఉన్న లౌడ్ స్పీకర్లు, వ్యక్తిగత వస్తువులతో కూడిన 300 కిలోల బరువున్న బండితో ఆడమ్ పాదయాత్ర సాగించాడు. శాంతి, సమానత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడమే తన లక్ష్యం అని ఆడమ్ చెప్పారు.ఇతను తన కోసం గో ఫండ్ మి (Go Fund Me) పేరిట ఓ పేజీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 


‘‘నేను ఇదంతా కేవలం కీర్తి లేదా డబ్బు కోసం పాదయాత్ర చేయడం లేదు, కానీ మన జాతి, రంగు, మతంతో సంబంధం లేకుండా మానవులందరూ సమానమని ప్రపంచానికి చాటి చెప్పడానికి,మన ఇస్లాం బోధించే శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి యాత్ర చేశాను’’ అని ఆడమ్ చెప్పారు.యాత్ర దారిలో జనం తనపై కురిపించిన ప్రేమాభిమానాలతో ఆడమ్ పొంగిపోయాడు. అతను తన ప్రయాణాన్ని టిక్‌టాక్‌లో ప్రసారం చేశాడు. ఈ టిక్ టాక్‌కు అర మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు.మినా నగరానికి చేరుకున్న తర్వాత మీడియా తాత్కాలిక మంత్రి మాజిద్ బిన్ అబ్దుల్లా అల్-కసాబి ఆడమ్ కి ఆతిథ్యం ఇచ్చారు. 


ఆడమ్ కు హజ్ పర్మిట్ విధానాన్ని ఖరారు చేయడంలో మంత్రి సహాయం చేశారు.రెండు సంవత్సరాల విరామం తర్వాత సౌదీ అరేబియాలో జరిగిన హజ్ 2022 యాత్రకు ఈ సంవత్సరం మిలియన్ ముస్లింలను అనుమతించారు. కొవిడ్ మహమ్మారి వల్ల 2020, 2021లలో హజ్ యాత్రను సౌదీ అరేబియా నివాసితులకు మాత్రమే పరిమితం చేశారు.




Updated Date - 2022-07-11T16:32:39+05:30 IST