నగరంలో ఇరానీ గ్యాంగ్‌..!

ABN , First Publish Date - 2022-01-22T16:25:51+05:30 IST

ఒక్కరోజే మూడు కమిషనరేట్స్‌ పరిధిలో ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేసి హడలెత్తించిన ఘరానా గొలుసు దొంగ కేసులో పోలీసులు ...

నగరంలో ఇరానీ గ్యాంగ్‌..!

 ‘గొలుసు’ కట్టు చోరీలు ఆ సభ్యుడి పనే

 నిందితుడి సీసీ ఫుటేజీ, కీలకాధారాలు సేకరణ 

 కొట్టేసిన యాక్టివాతో వరుస చోరీలు


హైదరాబాద్‌ సిటీ: ఒక్కరోజే మూడు కమిషనరేట్స్‌ పరిధిలో ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేసి హడలెత్తించిన ఘరానా గొలుసు దొంగ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలతోపాటు పలు కీలకాధారాలు సేకరించినట్లు తెలిసింది. చైన్‌ స్నాచింగ్‌లలో ఆరితేరిన ఇరానీ గ్యాంగ్‌సభ్యుడి పనిగా అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ నగరంలో తిష్ఠవేసిందా అన్న దిశగా విచారణ ముమ్మరం చేశారు. 


ముందురోజే యాక్టివా చోరీ

ఒకేరోజు ఆరుచోట్ల స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడు ముందురోజు మెహిదీపట్నం, ఆసి్‌ఫనగర్‌ ప్రాంతాల్లో కాలినడకన తిరిగినట్లు పోలీసులకు టెక్నికల్‌ ఆధారాలు లభించాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు మెహిదీపట్నం నుంచి ఆసి్‌ఫనగర్‌ పరిధిలోకి నడుచుకుంటూ వెళ్లిన నిందితుడు ఓ మొబైల్‌ దుకాణం ముందు తాళం వేయకుండా ఉన్న యాక్టివాను చోరీ చేశాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలిసింది. యాక్టివా పోయిన విషయం గుర్తించిన దుకాణపు యజమాని అదేరోజు ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


మరుసటి రోజు స్నాచింగ్‌ల వేట..

కొట్టేసిన బైక్‌తో మరుసటిరోజు ఉదయం 10గంటలకు గొలుసు దొంగతనాలు ప్రారంభించాడు. మారేడ్‌పల్లిలో మొదలుపెట్టి పేట్‌బషీరాబాద్‌, జీడిమెట్ల, తుకారంగేట్‌, మేడిపల్లి ఇలా సాయంత్రం 4.30 వరకు మొత్తం ఆరు స్నాచింగ్‌లు చేశాడు. ఒక్కటి మాత్రమే విఫలమవగా, మిగిలిన 5 స్నాచింగ్‌ల్లో సుమారు 18-20తులాల బంగారు గొలుసులను తెంచుకొని పారిపోయాడు. 


చెంగిచెర్ల మీదుగా

యాక్టివాను మేడిపల్లిలోని సంపూర్ణ హోటల్‌ ముందు వదిలేశాడు. అక్కడినుంచి చెంగిచెర్లవైపు వెళ్లాడు. మేకల బాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌ వద్ద తాను ధరించిన జర్కిన్‌ (స్వెట్టర్‌)ను వదిలేశాడు. ఆ తర్వాత అతని ఆనవాళ్లు లభించలేదు. మేడిపల్లి పోలీసులు, యాక్టివాను, స్వెట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, రాచకొండ పోలీసులు యాక్టివా నంబర్‌ ఆధారంగా యజమాని మహ్మద్‌ సులేమాన్‌ను ప్రశ్నించారు. సేకరించిన ఆధారాలను బట్టి నిందితుడు పాత నేరస్థుడే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్ర నుంచి నగరానికి వచ్చి ఈ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిసింది. ఇరానీ గ్యాంగ్‌కు చెందిన గొలుసు దొంగ అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పాత నేరస్థుల జాబితాను, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను పోలీసులు వడపోస్తున్నారు. 


దృష్టి మరల్చి చోరీ 

తార్నాక: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి దృష్టి మరల్చి డబ్బులు కాజేసిన సంఘటన శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడకు చెందిన ముత్యంరెడ్డి (52) హబ్సీగూడ స్ట్రీట్‌నెంబర్‌ 8లోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ నుంచి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో రూ.70వేలు డ్రా చేసి ప్యాంట్‌ జేబులో పెట్టుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఇది గమనించిన ఓ దుండగుడు ముత్యంరెడ్డిని ఫాలో అవుతూ ఓ అపార్టుమెంట్‌ వద్ద ఆపాడు. హిందీ, తెలుగులో కలిపి మాట్లాడుతూ మీ ప్యాంట్‌ జేబు ఎత్తుగా ఉంది. డబ్బులు పోగొట్టుకుంటారు జాగ్రత్త.. దొంగలున్నారంటూ సలహా ఇస్తూనే ముత్యంరెడ్డి చేతిలోని డబ్బులను తీసుకుని పేపర్‌లో చుట్టినట్లుగా చుట్టి తన బ్యాగులో వేసుకున్నాడు. ఖాళీ పేపర్‌ను ముత్యంరెడ్డి వాహనం సీటు కవర్‌లో పెట్టాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత అనుమానం వచ్చిన ముత్యంరెడ్డి పేపరు విప్పి చూడగా అందులో నగదు లేదు. దాంతో తాను మోసపోయానని తెలుసుకుని వెంటనే ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 


కస్టమర్స్‌ రావడంతో తాళం వేయలేదు.. 

సాయంత్రం 5గంటల సమయంలో దుకాణం వద్ద బైక్‌ పార్కు చేసి స్టాక్‌ను లోపలికి తీసుకెళ్లాను. కస్టమర్లు రావడంతో నేను బిజీ అయిపోయాను. యాక్టివాకు తాళం వేయడం మర్చిపోయాను. వారు వెళ్లిపోగానే బయటకు వచ్చి చూస్తే యాక్టివా కనిపించలేదు. వెంటనే ఆసి్‌ఫనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. 

- మహ్మద్‌ సులేమాన్‌, యాక్టివా యజమాని

Updated Date - 2022-01-22T16:25:51+05:30 IST