Abn logo
Sep 24 2021 @ 23:54PM

అప్పుగా ఐరన ఇవ్వండి.. బిల్లులు రాగానే ఇప్పిస్తాం!

కావలిలో స్టీలు, సిమెంట్‌ దుకాణదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌

వ్యాపారులకు అధికారుల ఆదేశం

అబ్బే.. మాకేం కంపెనీలు ఇప్పు ఇవ్వడం లేదు!

నిరాకరించిన వ్యాపారులు

దుకాణాల వివరాల సేకరణపై ఆందోళన


కావలి, సెప్టెంబరు 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఏర్పాటుకు నిధులు లేక అప్పుల కోసం అధికారుల వెంపర్లాడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీలు అప్పుగా ఇస్తే నిధులు మంజూరయ్యాక డబ్బులు చెల్లిస్తామని వ్యాపారులను కోరిన అధికారులకు చుక్కెదురవుతోంది. జగనన్న ఇళ్ల నిర్మాణం ఎలాగైనా పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండగా వారు కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తుండటంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కావలిలో మంజూరైన జగనన్న ఇళ్లకు ప్రారంభంలో అధికారులు స్టీలు, సిమెంటు ఇచ్చి మిగిలిన మెటీరియల్‌ వారినే తెచ్చుకొని నిర్మాణాలు చేపడితే బిల్లులు ఇస్తామని చెప్పారు. కొందరు లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించగా వచ్చిన స్టీలు అయి పోవడం, చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో ఇళ్ల నిర్మాణం మందగించింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అధికారులు వ్యాపారులపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో  శుక్రవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో స్టీలు వ్యాపారులతో ఆర్డీవో శీనానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి సమావేశమై జగనన్న ఇళ్లకు అవసరమైన స్టీలు అప్పు ఇవ్వాలని కోరారు. ఇందుకు వ్యాపారులు విముఖత వ్యక్తం చేశారు. అప్పు ఇవ్వడానికి తమకు కంపెనీలు అప్పు ఇవ్వడం లేదని ముందుగా డబ్బులు కడితేనే స్టీలు పంపిస్తున్నారని కంపెనీ వారితో మాట్లాడి కనుక్కోవచ్చని చెప్పారు. దీనికి అధికారులు ‘‘మాకు అవన్నీ తెలియవని మీరు అప్పు ఇస్తే మేము డబ్బులు ఇప్పిస్తామని, ముందుగా స్టీలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలకు సహకరించండి.’’ అని కోరారు. వ్యాపారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో వారి దుకాణాల వివరాలు, పోన నంబర్లు ఇచ్చి వెళ్లమని చెప్పారు. దీంతో వ్యాపారులు అప్పులు ఇస్తే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో.. ఇవ్వకపోతే అధికారుల నుంచి వ్యాపారులకు ఎలాంటి బెదిరింపులు ఉంటాయో అర్థంగాక అయోమయంతో నలిగిపోతున్నారు.