సందడే సందడి

ABN , First Publish Date - 2021-06-14T06:37:22+05:30 IST

దేశంలో ఐపీఓ మార్కెట్‌ మరోసారి సందడి చే యడానికి సన్నద్ధం అవుతోంది. రెండు నెలల పాటు మందకొడిగా సాగిన ఐపీఓ మార్కెట్‌ తలుపులు తట్టేందుకు పలు కంపెనీలు ఎదురు చూస్తున్నాయి...

సందడే సందడి

  • రాబోతున్న రూ.1.12 లక్షల కోట్ల ఐపీఓలు
  • రెండు నెలల విరామం అనంతరం హడావుడి షురూ

ముంబై : దేశంలో ఐపీఓ మార్కెట్‌ మరోసారి సందడి చే యడానికి సన్నద్ధం అవుతోంది. రెండు నెలల పాటు  మందకొడిగా సాగిన ఐపీఓ మార్కెట్‌ తలుపులు తట్టేందుకు పలు కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. సమీప  కాలంలో ఎల్‌ఐసీ సహా పలు కంపెనీలు ఇష్యూలు జారీ చేయనున్నాయని, మొత్తం ఇష్యూల పరిమాణం సుమారుగా రూ.1.12 లక్షల కోట్లుంటుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. ఒక్క ఎల్‌ఐసీ ఇష్యూనే రూ.70,000-90,000 కోట్లుంటుందని అంచనా. విడుదల కాబోయే ఇష్యూల్లో అధిక శాతం ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కంపెనీలవే ఉన్నట్టు తెలుస్తోంది. డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలోని పేటీఎం బోర్డు రూ.22,000 కోట్ల మెగా ఇష్యూకి అనుమతి ఇచ్చింది. ఎల్‌ఐసీని మినహాయిస్తే ఆర్థిక సర్వీసుల రంగంలోని ఇతర కంపెనీలన్నింటి ఐపీఓల పరిమాణమే రూ.55,000 కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు.


సెబీ ముందు ఎన్నో దరఖాస్తులు: సెబీ అనుమతులు పొంది ఇష్యూల జారీకి సన్నాహాలు చేసుకుంటున్న కంపెనీలు కొన్నైతే మరో 26 కంపెనీలు ఇష్యూల జారీకి సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయని ఐఐఎ్‌ఫఎల్‌ సెక్యూరిటీస్‌ సీఈఓ సందీప్‌ భరద్వాజ్‌ అన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను సమూలంగా మార్చి వేసిం దని, రాబోయే కాలంలో మంచి వ్యాపార భవిష్యత్తున్న మరిన్ని రంగాలకు చెందిన కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల కోసం మార్కెట్‌ తలుపు తట్టే ఆస్కా రం ఉందని ఆయన అభిప్రాయపడ్డా                రు. డజనుకి పైగా బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, కమర్షియల్‌ బ్యాంకింగ్‌, మైక్రోఫైనాన్స్‌, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, పేమెంట్‌ బ్యాంక్‌లు కూడా ఇష్యూల కోసం దరఖాస్తు చేసి సెబీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయంటున్నారు. 


ఇప్పటికి 17 ఇష్యూలు: ఈ ఏడాది ఇప్పటి వరకు 17 కంపెనీలు ఐపీఓలు జారీ చేశాయి. ఆ కంపెనీలన్నీ కలిపి రూ.17,503 కోట్లు సమీకరించాయి. వాటిలో ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌, రోలెక్స్‌ రింగ్స్‌, సెవెన్‌ ఐలండ్స్‌ షిప్పింగ్‌ ప్రధానమైనవి. 


ఈ వారంలోనే కిమ్స్‌, దొడ్ల డెయిరీ ఇష్యూలు 

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సై న్సెస్‌ (కిమ్స్‌), దొడ్ల డెయిరీ ఇష్యూలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. 

  1. కిమ్స్‌ మొత్తం ఇష్యూ పరిమాణం రూ.2144 కోట్లు. షేరు ధర శ్రేణి రూ.815-825. ఇష్యూ ప్రారంభ తేదీ జూన్‌ 16, ముగింపు తేదీ జూన్‌ 18. తాజా షేర్ల జారీ పరిమాణం రూ.200 కోట్లు. 
  2. దొడ్ల డెయిరీ ఇష్యూ పరిమాణం రూ.520 కోట్లు. షేరు ధర శ్రేణి రూ.421-428. ప్రారంభ తేదీ జూన్‌ 16, ముగింపు తేదీ జూన్‌ 18. 
  3. సోనా కామ్‌ స్టార్‌ ఇష్యూ పరిమాణం రూ.5550 కోట్లు. షేరు ధర శ్రేణి రూ.285-291. ప్రారంభం జూన్‌ 14 (సోమవారం). ముగింపు తేదీ జూన్‌ 16 (బుధవారం).

Updated Date - 2021-06-14T06:37:22+05:30 IST