వివోపై సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-07T09:50:55+05:30 IST

ఊహించినట్టుగానే ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా చైనీస్‌ కంపెనీ వివోపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేసింది. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యల ...

వివోపై సస్పెన్షన్‌

ఈ ఏడాదికి దూరం   

బీసీసీఐ వెల్లడి

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా చైనీస్‌ కంపెనీ వివోపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేసింది. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఆ దేశ కంపెనీలను బహిష్కరించాలని భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు తమ ప్రకటనలో మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఏకవాక్యంలో ముగించింది. ‘బీసీసీఐ-వివో కలిసి ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు తమ ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసుకోవాలని నిర్ణయించాయి’ అని మాత్రమే పేర్కొంది. మరోవైపు ఈ ఒక్క ఏడాదికే తమ ఒప్పందాన్ని నిలుపుదల చేసినట్టు వివో తెలిపింది. వచ్చే ఏడాది పరిస్థితులు సద్దుమణిగితే కొత్త ఒప్పందంతో రావాలని భావిస్తోంది. అయితే సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉంటాయని, అలాంటప్పుడు వచ్చే ఏడాది అంతా శాంతియుతంగా ఉంటుందని ఎలా చెప్పగలమని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.

వివో ఆలోచన ఇదీ..

వివో వెనక్కి తగ్గడం వెనుక ఆర్థిక కోణం కూడా ఉన్నట్టు వినిపిస్తోంది. ఎందుకంటే ఒప్పందంలో భాగంగా బోర్డుకు ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు నవంబరులో ముగిసే ఈ సీజన్‌కు తిరిగి వచ్చే ఏడాది జరిగే సీజన్‌కు మధ్య ఆరేడు నెలల విరామం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో వివో రూ.880 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలో చైనా ఉత్పత్తులను నిషేధిస్తుండడంతో అంత మొత్తం ఇవ్వడం సులువేమీ కాదు. ఇదంతా ఆలోచించాకే ఈ ఏడాదికి దూరంగా ఉండడమే మేలని వివో భావించింది.

లైన్‌లో బైజూస్‌, కోకా కోలా

వివో అధికారికంగా వైదొలగడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ కోసం త్వరలోనే టెండర్లను పిలవనుంది. ఈనేపథ్యంలో కోకా కోలా, బైజూస్‌ కంపెనీలు ఐపీఎల్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. బైజూస్‌ ఇప్పటికే టీమిండియాకు స్పాన్సర్‌గా ఉంటోంది. ఈ కంపెనీ రూ.300 కోట్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అలాగే క్రికెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు తాము ఎదురుచూస్తున్నట్టు కోకా కోలా ప్రకటించింది. అయితే తుది నిర్ణయం తీసుకునేముందు పరిస్థితులను అంచనా వేస్తున్నామని తెలిపింది.


ఒక్క పాజిటివ్‌ తేలినా..

ఐపీఎల్‌ సందర్భంగా ఎస్‌ఓపీని కఠినంగా అమలు చేసే బాధ్యత బీసీసీఐపై ఉందని పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌ వాడియా తెలిపాడు. ఒక్క కరోనా కేసు వెలుగు చూసినా ఐపీఎల్‌ విఫలమవుతుందని హెచ్చరించాడు. ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బంది, కుటుంబసభ్యులు, యజమానులను బయో బబుల్‌లో ఉండేలా బోర్డు సూచించింది. ‘ఎట్టకేలకు ఐపీఎల్‌ జరగడం ఖాయమైంది. అయితే ఇందులో పాల్గొనే వారి ఆరోగ్యం గురించే మా ఆందోళన. ఎందుకంటే ఒక్క కేసు నమోదైనా అంతటా భయాందోళన నెలకొంటుంది. బయో సెక్యూర్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది. నేనైతే అక్కడికి వెళ్లడం లేదు’ అని వాడియా తెలిపాడు.

Updated Date - 2020-08-07T09:50:55+05:30 IST